Begin typing your search above and press return to search.

టీడీపీలో భగ్గుమంటున్న వర్గ విభేదాలు

By:  Tupaki Desk   |   15 Oct 2018 12:50 PM GMT
టీడీపీలో భగ్గుమంటున్న వర్గ విభేదాలు
X
నమ్ముకున్న వారికి టీడీపీ మొండిచేయి చూపుతుందని మరోసారి రుజువైంది. పార్టీ నేతలు అసంతృప్తులుగా మారుతున్నా పట్టించుకోవడం లేదు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ రోడ్డున పడుతున్నారు. టీడీపీ నేతలు బహిరంగ విమర్శలకు దిగుతూ ార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు. ఇందుకు నెల్లూరు టీడీపీలో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలే ఉదాహరణ. అసంతృప్తులను చల్లార్చేందుకు మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయి.

జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గాన్ని పరిశీలిస్తే... గతంలో ఇక్కడ ఎప్పటి నుంచో పార్టీ కార్యకలాపాలను నిర్వర్తిస్తూ వస్తున్న కన్నబాబును ఇన్ చార్జిగా అకారణంగా తొలగించారు. ఆయన ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి ఇచ్చే ఫలితం ఇదేనా అని తన ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. గతంలో ఈయన 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఇన్చార్జి బాధ్యతను అప్పగించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో టీడీపీలోకి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీ బాధ్యతలను ఇచ్చారు. కన్నబాబు అసంతృప్తిగా మారిపోయారు.

మధ్యలో వచ్చిన వారికి పార్టీ బాధ్యతను ఇవ్వడం ఏమిటని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత ఆనం పార్టీని వీడారు. మరలా కన్నబాబు ఇన్చార్జిగా నియమించాలని కోరినా, అధిష్ఠానం ఇవ్వలేదు. అనూహ్యంగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి కట్టబెట్టింది. దీనిపైనా కన్నబాబు విరుచుకుపడ్డారు. పార్టీలో రెడ్డి సామాజిక వర్గం పెత్తనం ఎక్కువైందని, పార్టీని కాపాడాలంటూ పార్టీ పెద్దల వద్ద నిరసన తెలియజేశారు. ఆదాలను మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు.

ఈ క్రమంలో ఆదివారం చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన కన్నబాబుకు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య ఎదురుపడ్డారు. ఈయన ముందు కన్నబాబు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి బాగాలేదని మండిపడ్డారు. దానికి కృష్ణయ్య మాట్లాడుతూ సీఎం ఎవరిని నియమిస్తే , వారికి మద్దతుగా నడుచుకోవాల్సిందే కదా అని అన్నారు. పార్టీ కోసం పనిచేయాలే కాని ఇలా అలకబూనడం సరికాదని హితువుపలికారు. అనంతరం రహస్యంగా సమావేశమై అక్కడ నుంచి వెళ్లిపోయారు.

మరోవైపు ఆగ్రహంతో ఉన్న ఆదాల వర్గం కన్నబాబుపై సీఎంవోకు ఫిర్యాదు చేసింది. పార్టీ పరిస్థితి దిగజారుతుందని జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ వ్యవహారం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది ఎంత వరకు వెళ్లి భవిష్యత్తులో పార్టీకి డ్యామేజ్ చేస్తుందేమోనని టీడీపీ నేతలు ఆందోళనలో పడిపోయారు. ఈ తతంగాన్ని గమనిస్తున్న జిల్లా ప్రజలు వైసీపీకి మరోసారి జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు.