Begin typing your search above and press return to search.

నెట్ చూస్తూ.. చ‌చ్చిపోతున్నారు!

By:  Tupaki Desk   |   11 Sep 2017 1:30 AM GMT
నెట్ చూస్తూ.. చ‌చ్చిపోతున్నారు!
X
ఆత్మ‌హ‌త్య మ‌హాపాపం! ఇది ఒక‌ప్ప‌టి భీతి! బ‌తికి ఉండాల‌ని, జీవితాన్ని ఎంజాయ్ చేయాల‌ని - కుటుంబం - పెద్ద‌లు - చిన్న‌ల‌తో ఆనందంగా జీవితాన్ని అనుభ‌వించాల‌ని పెద్ద‌లు చెప్ప‌క‌నే చెప్పారు. ఎంతో తీవ్ర‌మైన ప‌రిస్థితి వ‌చ్చి.. చ‌నిపోయేందుకు సిద్ధ‌ప‌డినా.. ఆత్మ‌హ‌త్య మ‌హాపాపంతో స‌మాన‌మ‌ని హెచ్చ‌రించి.. మన జీవితాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించారు. అయితే, నేడు ఇలా చెప్పేవారు క‌రువై పోయారు. దీంతో ఆత్మ‌హ‌త్య‌లు ఫ్యాష‌న్‌ గా మారిపోయాయి! అయిన దానికీ కాని దానికీ, భ‌ర్త సినిమాకు తీసుకెళ్ల‌లేద‌ని, ప‌రీక్ష‌ల్లో మార్కులు త‌క్కువ వ‌చ్చాయ‌ని - ఎంబీబీఎస్‌ లో సీటు రాదేమోన‌ని ఇలా చిన్న చిన్న - ఎందుకూ ప‌నికిరాని కార‌ణాల‌తో కూడా యువ‌తీయువ‌కులు - మ‌ధ్య వ‌య‌స్కులు ప్రాణాల‌ను తృణ ప్రాయంగా తీసేసుకుంటున్నారు. కుటుంబాల‌కు కుటుంబాల‌ను దఃఖంలో ముంచెత్తుతున్నారు.

ఇక‌, ఇలా ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న వారి దౌర్బ‌ల్యానికి తోడు అందివ‌చ్చిన అంత‌ర్జాలం కూడా వీరిని ఆత్మ‌హ‌త్య‌ల దిశ‌గా ప్రోత్స‌హిస్తున్న దారుణ నిజం ఒక‌టి వెలుగు చూసింది. ఆత్మ‌హ‌త్య‌ల‌కు సంబంధించి పాత పద్ధతులు ఎలా అమలు చేయాలనే స్పష్టతతో పాటు కొత్త కొత్త పద్ధతులను కూడా చూపిస్తున్న‌ ఇంటర్నెట్‌ ఆత్మహత్యా నివారణ కృషికి పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. ఇటీవల హైద‌రాబాద్‌ లోని మాదాపూర్‌ లో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ లక్కీ గుప్తా అగర్వాల్‌ (33) ఒక చిన్నపాటి నైట్రోజన్‌ సిలిండర్‌ ను కొనుగోలు చేసి మాస్క్‌ బిగించుకుని ఆ సిలిండర్‌ లోని గ్యాస్‌ పీల్చి తన ఆపార్ట్‌మెంట్‌ లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు అతనికి సాయమందించింది ఇంట‌ర్ నెట్టే!

మ‌రోఘ‌ట‌న‌లో మలేషియన్‌ టౌన్‌ షిప్‌ కు చెందిన అవినాష్‌ సైతం ఇదే పద్ధతిలో ప్రాణం తీసుకున్నాడు. తన కారులో కూర్చుని టాక్సిక్‌ గ్యాస్‌ ను పీల్చడం ద్వారా ఇతను చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇటీవల ఎస్సార్‌ నగర్‌ పరిధిలో చోటు చేసుకున్న హాస్టల్‌ విద్యార్ధి నవీన్‌ (24) ఆత్మహత్యోదంతం కూడా ఇలాంటిదే.. ఎలా ఉరిపోసుకోవాలో తెలియని నవీన్‌.. దీని కోసం నెట్‌ లో సెర్చ్‌ చేసి పాయింట్ల వారీగా రాసుకుని మరీ దీన్ని అమలు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇందుకు సంబందించిన వీడియోలను వీక్షించడం ద్వారా నవీన్‌ తెలుసుకున్నట్లు దర్యాప్తు అధికారులు చెబుతుంటే ఈ అంతర్జాల ‘వల’యం మనల్ని ఎటు తీసుకుపోతుందో అర్థం కావడం లేదు. దీనిని బ‌ట్టి నెట్‌ ను ఎంత మేర‌కు వినియోగించుకోవాలో? ఎంత మేర‌కు దూరంగా ఉంచుకోవాలో? అనేది మ‌న‌చేతుల్లోనే ఉన్న విష‌యం. బ‌హు ప‌రాక్‌!!