Begin typing your search above and press return to search.

మోడీ ఏదో ఒక రోజు దేశానికే ఇంట‌ర్నెట్ ఆపేస్తారు!

By:  Tupaki Desk   |   16 Dec 2019 8:17 AM GMT
మోడీ ఏదో ఒక రోజు దేశానికే ఇంట‌ర్నెట్ ఆపేస్తారు!
X
మోడీ ప్ర‌భుత్వం అల్ల‌ర్లు సాగిన చోటల్లా ఇంట‌ర్ నెట్ సేవ‌ల‌ను ఆపేయ‌డంపై సోష‌ల్ మీడియాలో సెటైర్లు ప‌డుతున్నాయి. ఇది వ‌ర‌కూ ఆర్టిక‌ల్ త్రీ సెవెన్టీ ర‌ద్దు స‌మ‌యంలో మోడీ ప్ర‌భుత్వం క‌శ్మీర్ వ్యాప్తంగా ఇంట‌ర్నెట్ ను ఆపేయించింది. ఆర్టిక‌ల్ త్రీ సెవెన్టీ ర‌ద్దు ప‌ట్ల క‌శ్మీర్ లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అయ్యింది. దీంతో ఆ ప‌రిస్థితిని స‌రి చేయ‌డానికి అంటూ మోడీ ప్ర‌భుత్వం వివిధ చ‌ర్య‌ల‌ను తీసుకుంది.

అందులో భాగంగా క‌శ్మీర్ రాజ‌కీయ నేత‌ల‌ను హౌస్ అరెస్ట్ చేశారు. చాలా కాలం పాటు వాళ్ల‌ను ఇంటి నుంచి బ‌య‌ట‌కు కూడా రానీయ‌కుండా చూశారు. అలాగే ఢిల్లీలో ఉండే క‌శ్మీర్ నేత‌లు త‌మ రాష్ట్రానికి అంటూ వెళితే - వారిని ఎయిర్ పోర్టుల నుంచినే వెన‌క్కు పంపించారు. ఇక ఆందోళ‌న‌లు విస్తృతం కాకుండా ఉండ‌టానికి అంటూ.. ఇంట‌ర్ నెట్ ను ఆపేశారు. ఇంట‌ర్ నెట్ సేవ‌ల వ‌ల్ల స‌మాచారం ఒక‌రి నుంచి ఒక‌రికి అందుతుంద‌ని ఆపేశారు. అయితే పుకార్లు వ్యాపించ‌కుండా ఉండ‌టానికే ఇంట‌ర్ నెట్ ఆపేసిన‌ట్టుగా మోడీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ఇంట‌ర్ నెట్ సేవ‌ల‌ను ఆపేశారు. పౌర‌స‌త్వ బిల్లును వ్య‌తిరేకిస్తూ అక్క‌డ జ‌రుగుతున్న ఆందోళ‌నల‌ను అరిక‌ట్ట‌డానికి ఇంట‌ర్నెట్ ను ఆపేశారు. పుకార్ల‌ను అరిక‌ట్ట‌డానికే ఇంట‌ర్ నెట్ ను ఆపేసిన‌ట్టుగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించుకుంది.

మొద‌ట క‌శ్మీర్ - ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు.. ఇలా సాగుతున్న మోడీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల ప‌ట్ల సోష‌ల్ మీడియాలో కొంత‌మంది ఘాటుగా స్పందిస్తున్నారు. మోడీ ప్ర‌భుత్వం చ‌ర్యలు తీవ్రంగా ఉన్నాయ‌ని.. ఏదో ఒక రోజు మోడీ ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా ఇంట‌ర్ నెట్ ను ఆపేసే ప‌రిస్థితి కూడా వ‌స్తుందేమో అంటూ వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ ఉన్నారు!