Begin typing your search above and press return to search.

ఆనందయ్య మందుపై అధ్యయనానికి అవాంతరాలు .. ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   26 May 2021 5:30 AM GMT
ఆనందయ్య మందుపై అధ్యయనానికి అవాంతరాలు .. ఏమైందంటే ?
X
ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందుపై కేంద్ర ఆయుర్వేద వైజ్ఞానిక పరిశోధన మండలి చేపట్టిన అధ్యయనానికి మొదట్లోనే పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఆనందయ్య మందును తీసుకున్న వ్యక్తుల అభిప్రాయాలు, వైద్య నివేదికలు సేకరించాలనుకున్న సీసీఆర్‌ ఏఎస్‌ ఆ బాధ్యతలను విజయవాడలోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థతో పాటు తిరుపతి ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాలకు అప్పగించింది. ఈ పరిశోధనలో భాగంగా మొదటగా ఆనందయ్య మందు తీసుకున్న 500 మంది నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించాలని భావించారు. కానీ వారి వివరాలను సేకరించడంలో కొన్ని చిక్కులు ఏర్పడుతున్నాయి.

ఈ రెండు సంస్థల సిబ్బంది తాము సేకరించిన రోగుల, వారి బంధువుల సెల్‌ ఫోన్ నంబర్లకు సోమవారం నుంచి ఫోన్లు చేస్తున్నారు. అయితే ఆ జాబితాలోని 92 మందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని, 42 మంది తాము అస్సలు మందు తీసుకోలేదని చెప్పినట్లు సమాచారం. మరో 36 మంది అయితే ఒకే ఫోన్ నంబర్ ఇచ్చారు. మందు తీసుకున్న వారిలో చాలామంది తమకు వైరస్ సోకకుండానే ముందు జాగ్రత్తగా వేసుకున్నట్లు తెలిపారు. మరికొందరు కొవిడ్‌ బారిన పడ్డ తర్వాతే మందు తీసుకున్నామని చెప్తున్నారని అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రభుత్వానికి నివేదిక ఎలా ఇవ్వాలో అర్థంగాక ఆయుర్వేద సంస్థల అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

దీంతో మరికొందరి ఫోన్ నంబర్లు పంపించాల్సిందిగా నెల్లూరు ఎస్పీని ఎస్వీ ఆయుర్వేద కాలేజీ అధికారులు కోరినట్లు తెలుస్తోంది. ఆనందయ్య దగ్గర సుమారు 70 వేల మంది ఔషధం తీసుకున్నట్లు పోలీసులు, నిఘా వర్గాల అంచనా వేశాయి. ఆయుర్వేద మందు తీసుకున్నవారి వివరాలేమీ తన వద్ద లేవని ఆనందయ్య చెబుతున్నారు. ఆనందయ్య మందుపై తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కాలేజీ ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ కూడా ఉంటాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. వారం రోజుల్లోగా ప్రాథమిక నివేదికను అందజేస్తామని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ మనుషులపై చేయాలా లేక జంతువుల పైనా అనేది ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుందన్నారు. ఇప్పటికే ఐసీఎంఆర్ బృందం కూడా ఆనందయ్య మందుపై అధ్యయనం చేసి వెళ్లిన సంగతి తెలిసిందే. ఐసీఎంఆర్,సీసీఆర్ ఏఎస్‌ ల నుంచి నివేదికలు వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆనందయ్య మందులో ఎటువంటి హానికారక పదార్థాలు లేవని ఇదివరకే ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు