Begin typing your search above and press return to search.

రాత్రికి రాత్రే ఆ ఊరి నుంచి జనం మాయం.. 200 ఏళ్లైనా అంతుపట్టని రహస్యం!

By:  Tupaki Desk   |   26 March 2021 11:30 PM GMT
రాత్రికి రాత్రే ఆ ఊరి నుంచి జనం మాయం.. 200 ఏళ్లైనా అంతుపట్టని రహస్యం!
X
ఆ ఊరిలో ఇళ్లు ఉంటాయి. ఎవరి పనులు వారు చేసుకుంటూ సాఫీగా సాగుతుంది. అలాంటి సమయంలో ఓ రోజు రాత్రికి రాత్రే జనం మాయమయ్యారు. ఊరు అంతా బోసీగా మారింది. ఇళ్లు అన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. మరి ఇంతకీ ఆ జనం ఎక్కడికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు అనేది ఆనవాళ్లు లేవు. ఈ సంఘటన జరిగి 200 ఏళ్లైనా ఆ గ్రామానికి సంబంధించిన అంతుపట్టని రహస్యాలెన్నో ఉన్నాయి. ఆ పరిసర ప్రాంతాల్లోని వారు మాత్రం ఎవరికి తోచినట్లు వారు చెబుతున్నారు. ఇదంతా రాజస్థాన్ లోని అనాదరణకు గురైన ఓ గ్రామం చరిత్ర.

రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతానికి 17 కి.మీ. దూరంలో కుల్ధారా అనే గ్రామం ఉంది. అన్ని రకాల వృత్తులు చేసుకుంటూ జనం జీవనం సాగించేవారు. అలా సాఫీగా సాగుతున్న వారి జీవితాల్లో అనుకోని మలుపు తిరిగింది. 200 ఏళ్ల క్రితం ఆ ఊరి జనం ఒక్కసారిగా మాయమయ్యారు. వారిపై ఎటువంటి దాడులు, ఇతర ఘటనలు జరిగిన దాఖలాలు లేవు. వాళ్లు ఎటు వెళ్లారో ఆచూకీ లభించలేదు. వారి గురించి పరిశోధించడానికి వెళ్లిన వారు కూడా అంతుపట్టని విధంగా మరణించడం గమనార్హం.

ఈ సంఘటన జరిగి 200 ఏళ్లు అయినా ఆ గ్రామంలో ప్రజలు నివసించడానికి ఇప్పటికీ జంకుతారు. ఇల్లు కట్టుకోవడానికి ఒక్కరూ సాహసించలేదు. పరిశోధనలు చేయడానికి వెళ్లినవారు, పర్యాటకులు సైతం సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో మాత్రమే పర్యటిస్తారు. కానీ నాటి ఇళ్లు ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. కానీ కొత్త కట్టడాలు మాత్రం లేవు.

ఈ గ్రామంలో 500 సంవత్సరాల పాటు పాలివాల్ బ్రాహ్మణులు ఉండేవారు. నాటి పాలకులు వారిని బలవంతంగా ఖాళీ చేయించారని కొందరు చెబుతారు. ఫలితంగా ఆ బ్రహ్మణుల శాపమే నేటికీ ఆ ఊరిలో ఒక్క మనిషి ఉండడానికి సాహసించరు అని అంటారు. ఆ ఊరిలో జాలిమ్ సింగ్ అనే మంత్రి గ్రామపెద్ద కూతుర్ని వివాహం చేసుకోదలిచాడని మరికొందరు చెబుతారు. అందుకు గ్రామస్థులు నిరాకరించగా.. ఆగ్రహించిన ఆయన పన్నులు విపరీతంగా పెంచేశారని తెలిపారు. అలా పెంచి ప్రజలను ముప్పు తిప్పలు పెట్టారని అంటారు. చేసేది లేక ఆ ఊరిని ఖాళీ చేయాలని గ్రామస్థులంతా మూకుమ్మడిగా అనుకోని.. వెళ్తూ శపించగా ఆ ఊరి ఇలా మారిందని చెబుతారు. ఫలితంగా కుల్ధారాతో సహా ఆ చుట్టుపక్కల ఉండే 84 గ్రామాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తాయి.