Begin typing your search above and press return to search.

ఉగాది ప్ర‌త్యేక‌త ఇదే.. ప‌చ్చ‌డి ఖ‌చ్చితంగా చేయాల్సిందే!

By:  Tupaki Desk   |   12 April 2021 11:30 PM GMT
ఉగాది ప్ర‌త్యేక‌త ఇదే.. ప‌చ్చ‌డి ఖ‌చ్చితంగా చేయాల్సిందే!
X
తెలుగు లోగిళ్లు సంద‌డిగా మారిపోయే రోజు.. పంచాంగ శ్ర‌వ‌ణాల‌తో జీవిత జాత‌క చ‌క్రాన్ని ముందుగానే తెలుసుకునే రోజు.. తెలుగు సంవత్స‌రాది ఆరంభ‌మ‌య్యే రోజూ.. ష‌డ్రుచుల‌ను చ‌విచూసే రోజు.. అదే ఉగాది! మ‌రి, తెలుగువారికి ఇంత‌ ప్రీతిపాత్రమైన పండుగగా ఉగాది నిల‌వ‌డానికి కార‌ణాలేంటీ? ఉగాది ఎందుకు అంత ప్ర‌త్యేకం? అన్న‌ది చూద్దాం.

బ్రహ్మ ఈ యుగాన్ని సృష్టించ‌డం మొద‌లు పెట్టింది ఈ రోజునే అని పురాణోక్తి. అలా మొద‌లైన రోజే యుగాది. అది కాల క్ర‌మంలో ఉగాదిగా మారింద‌ని చెబుతారు. మ‌నిషి పుట్టిన రోజున వారు మాత్ర‌మే సంబ‌రాలు చేసుకుంటారు. మ‌రి, ఇది ప్ర‌పంచం పుట్టిన రోజుగా భావిస్తుంటారు కాబ‌ట్టి.. ప్ర‌జ‌లంతా పండుగ చేసుకుంటారు.

అయితే.. ఉగాది అన‌గానే ముందుగా అంద‌రికీ గుర్తుకు వ‌చ్చేది ఉగాది ప‌చ్చ‌డి. ష‌డ్రుచుల స‌మ్మేళ‌నమైన ఉగాది ప‌చ్చ‌డిని.. తీపి, చేదు, పులుపు, వ‌గ‌రు, ఉప్పు, కారం కలగలిపి తయారు చేస్తారు. ఈ రుచులు మ‌నిషి జీవితంలోని అన్ని పార్శ్వాల‌నూ ప్ర‌తిబింబిస్తాయ‌ని హిందువుల న‌మ్మ‌కం. అందుకే.. ఈ ప‌ర్వదినం వేళ ప్ర‌తి ఒక్క‌రూ ఉగాది ప‌చ్చ‌డి చేస్తారు. ఆర‌గించి, ఆస్వాదిస్తారు.

మ‌రో ముఖ్య‌మైన‌ కార‌ణం కూడా ఉంది. తెలుగు సంవత్స‌రాది ఈ రోజుతోనే ఆరంభ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచం మొత్తం గ్రెగేరియ‌న్ క్యాలెండర్ ను అనుసరిస్తోంది కాబట్టి.. మ‌నం కూడా అందులోని ఇంగ్లీష్‌ నెలలను పాటిస్తుంటాం. అయితే.. తెలుగు మాసాల‌ను ఆధునిక యుగంలో అనుస‌రించ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. పురోహితులు, మ‌న ఇళ్ల‌లోని వృద్ధులు ఇంకా ఈ మాసాల ద్వారాన్నే కాలాన్ని లెక్కిస్తుండ‌డం గ‌మ‌నించొచ్చు.

వైశాఖం, జ్యేష్టం, శ్రావ‌ణం, బాధ్ర‌ప‌దం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఈ ప‌న్నెడు మాసాలే తెలుగు నెల‌లు. ఇక‌, మ‌రో ప్ర‌ధాన‌మైన అంశం కూడా ఉంది. ప్ర‌తీ ఉగాది రోజున ఏదో ఒక నామ సంవ‌త్స‌రం వ‌స్తూ ఉంటుంది. ప్ర‌స్తుతం శార్వ‌రి నామ సంవ‌త్స‌రం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. రేప‌టి ఉగాది నుంచి ప్ల‌వ నామ సంవ‌త్స‌రం ఆరంభ‌మ‌వుతుంది. ఇలా మొత్తం 60 తెలుగు సంవ‌త్స‌రాలు ఉంటాయి. రేప‌టి నుంచి మొద‌లు కాబోయే ప్ల‌వ నామ సంవ‌త్స‌రం 35వ‌ది. మొత్తం 60 పూర్త‌యిన త‌ర్వాత మ‌ళ్లీ మొద‌టి నుంచి ప్రారంభం అవుతుంది.