Begin typing your search above and press return to search.

అసహనం చెన్నై వరదల్లో కొట్టుకుపోయింది

By:  Tupaki Desk   |   2 Dec 2015 6:10 PM GMT
అసహనం చెన్నై వరదల్లో కొట్టుకుపోయింది
X
కష్టాలు మనిషిని మరింత రాటు దేలుస్తాయంటారు. సమస్యలు ఎదురైతేనే.. అసలు సత్తా తెలుస్తుందన్న మాటను నిజం చేస్తున్నారు చెన్నై వాసులు. ప్రకృతి విసిరిన సవాల్ను అధిగమించేందుకు చెన్నై వాసులు ప్రదర్శిస్తున్న మానవత్వం ‘సరికొత్త భారతాన్ని’’ సృష్టిస్తుందనటంలో సందేహం లేదు. దేశo మొత్తం అసహనం అంశం మీద అట్టుడిగిపోతున్న సమయంలో.. వచ్చి పడిన భారీ వర్షాలతో తమిళనాడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. దేశంలోని మెట్రో నగరాల్లో ఒకటైన చెన్నై మహా నగరం తన విలక్షణతను.. తాజా విపత్కర పరిస్థితుల్లో చాటి చెప్పి.. దేశంలోని భిన్నత్వంలోని ఏకత్వాన్ని ప్రదర్శిస్తోంది.

దేశంలో అసహనం మీద భారీగా చర్చ సాగుతున్న సమయంలో వచ్చి పడ్డ ఈ భారీ వర్షాలతో చెన్నై మహా నగరంలోని రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో 6 అడుగులకు పైనే వర్షపునీరు నిలిస్తే.. మిగిలిన ప్రాంతాల్లోనూ మోకాలి పైనే వరద నీరు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి.

లక్షలాది ఇళ్లు వరద నీరు చేరిపోవటంతో చెన్నై వాసులకు ఏం చేయాలో పాలు పోని పరిస్థితి. ఈ సందర్భంలో చెన్నైవాసులు చేయి చేయి కలిపారు. వాళ్లు.. వీళ్లు అన్నది పట్టించుకోకుండా.. కష్టంలో ఉన్న సాటి మనిషికి సాయం చేసేందుకు గుళ్లు.. మసీదులు.. చర్చిలు బాధిుతల్ని అక్కున చేర్చుకున్నాయి. అంతేకాదు.. పెద్ద పెద్ద మల్టీఫ్లెక్స్ లు.. షాపింగ్ మాల్స్ సైతం.. బాధితులకు షెల్టర్ జోన్ గా నిలిచాయి. భారీ వర్షాలతో వచ్చి పడిన వరద ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. కానీ.. కష్టకాలంతో అందరూ ఒకటై.. ఒకరి కష్టంలో మరొకరు భాగస్వామ్యమైన తీరు చెన్నై మహానగరిలోని ప్రజల మధ్య సరికొత్త భావోద్వేగ బంధాన్ని తెచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు.