Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇష్టం లేక‌పోయినా.. రాజ‌కీయాల్లోకి: కేటీఆర్

By:  Tupaki Desk   |   18 Aug 2021 2:30 PM GMT
కేసీఆర్ ఇష్టం లేక‌పోయినా.. రాజ‌కీయాల్లోకి:  కేటీఆర్
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ ఎస్ అధినేత‌.. కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యం నుంచి యాక్టివ్ పాలిటిక్స్‌లో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న కేటీఆర్‌.. 2009 సాధార‌ణ ఎన్నిక‌ల్లో తొలిసారి సిరిసిల్ల నుంచి పోటీ చేసి.. ఇక‌, అప్ప‌టి నుంచ ఇప్ప‌టి వ‌ర‌కు కూడా తిరుగులేని నాయ‌కుడిగా విజ‌యం ద‌క్కించుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే.. నిజంగానే కేటీఆర్‌.. రాజకీయాల్లోకి రావాల‌ని.. కేసీఆర్ కోరుకున్నారా? ఆయ‌న‌ను ఐటీ మంత్రిగా చేయాల‌ని భావించారా? అంటే.. దీనిపై.. ఎవ‌రూ ఏమీ చెప్ప‌లేరు.

కానీ, తాజా ఈవిష‌యాల‌పైనే కేటీఆర్ త‌న మ‌న‌సులో మాట చెప్పారు. మాస్ట‌ర్ ఇన్ ప‌బ్లిక్ పాలిసీ(ఎంపీపీ) ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఓరియెంటేష‌న్ కార్య‌క్ర‌మంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఆస‌క్తికర విష‌యాలు వెల్ల‌డించారు. ``చాలా మందికి నేను ఐటీ మంత్రి అవ‌డం వెనుక ఉన్న అస‌లు విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు. వాస్త‌వానికి మా నాన్న‌(కేసీఆర్‌) న‌న్ను ఐఏఎస్ అధికారిని చేయాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే న‌న్ను ఢిల్లీలోని జేఎన్‌యూలో జాయిన్ చేశారు`` అని కేటీఆర్ వివ‌రించారు.

అయితే.. జేఎన్ యూ గోడ‌ల‌పై ఉన్న కొన్ని రాత‌లు.. త‌న‌ను ప్రేరేపించాయ‌ని.. ఆ స‌మ‌యంలో నేను ప్ర‌జా జీవితం గురించి ప్రేర‌ణ పొందాన‌ని కేటీఆర్ వివ‌రించారు. ``ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి విష‌యంలోనూ రాజ‌కీయ నిర్ణ‌య‌మే.. అంతిమం. రాజ‌కీయాల్లో ఉంటే.. మంచి ఫ్యూచర్‌ను నిర్ణ‌యించుకునే అవ‌కాశం ఉంటుంది`` అని జేఎన్ యూ గోడ‌ల‌పై రాసి ఉంద‌ని.. పేర్కొన్నారు. కాగా, ఈ యూనివ‌ర్సిటీత‌ర్వాత‌.. కేటీఆర్ యూఎస్‌కు వెళ్లివ‌చ్చారు. అక్క‌డ కూడా విద్య‌ను అభ్య‌సించిన విష‌యం తెలిసిందే.

``2006లో యూపీఏ మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీఆర్ ఎస్‌.. ఆ బంధాన్ని తెంచుకుని బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ స‌మ‌యంలోనేను అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వ‌దిలి పెట్టి.. ఇండియాకు తిరిగి చేరుకున్నాను. నిజం చెప్పాలంటే.. నేను ఉద్యోగం మానేసిన విష‌యాన్ని మా నాన్న‌కు చెప్ప‌లేదు. ఆయ‌నకు తెలియ‌కుండానే.. నేను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. నిజానికి మా నాన్న నేను ఏం అడిగినా.. కాద‌నే టైపు కాద‌ని నాకు తెలుసు. నేను ఒక‌టే అనుకున్నాను. నా పాత్ర నేను పోషించి.. ఆయ‌న‌కు స‌పోర్టుగా ఉండాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే నా రాజ‌కీయ జీవితం ప్రారంభించాను`` అని కేటీఆర్ వివ‌రించారు.