Begin typing your search above and press return to search.

అమిత్ షాపై సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌కొచ్చింది

By:  Tupaki Desk   |   3 April 2018 5:50 AM GMT
అమిత్ షాపై సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌కొచ్చింది
X
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నిందితుడిగా ఉన్న సోహ్రబుద్దీన్‌ ఎన్‌ కౌంటర్‌ కేసును విచారిస్తూ మృతి చెందిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి బ్రిజ్‌ గోపాల్‌ హరికిషన్‌ లోయా మృతి కేసుపై మ‌రో సంచ‌ల‌న వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. 'ద కారవాన్‌' మ్యాగజైన్‌ మరో అనూహ్య విష‌యాల‌తో వార్తా కథనాన్ని వెల్లడించింది. కేసు నుంచి అమిత్‌ షాను బయటపడేయటానికి జస్టిస్‌ లోయాను ప్రలోభపెట్టారని, వాటికి లొంగలేద‌ని వార్త‌లువ‌చ్చాయి. ఇదే స‌మ‌యంలో లోయా హఠాత్తుగా డిసెంబరు 1 - 2014న మరణించటం సర్వత్రా అనుమానం రేకెత్తించింది. జస్టిస్‌ లోయా మరణం సహజమైనదా ? కుట్ర దాగి వుందా ? అన్నదానిపై ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా - జస్టిస్‌ ఏఎం.ఖాన్‌ వికార్‌ - జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. జస్టిస్‌ లోయా మృతిపై మీడియా కథనాలన్నీ ఊహాత్మకమైనవని కొట్టిపారేస్తూ - ఆయన సహజ మరణం పొందారని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు నివేదిక అందజేసింది.

తాజాగా కార‌వాన్ మ‌రో సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించింది. మహారాష్ట్ర ఆర్థిక మంత్రికి దగ్గరి బంధువైన వైద్యుడు ఇచ్చిన 'డైరెక్షన్‌' ప్రకారం జస్టిస్‌ లోయా పోస్ట్‌ మార్టంను నాగపూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల రూపొందించిందని - వాస్తవాల్ని దాచారని ఈ కథనం తెలిపింది. 'ద కారవాన్‌' మ్యాగజైన్‌ వార్తా కథనంలో ఏముందంటే, `జస్టిస్‌ లోయా శవ పరీక్షను డాక్టర్‌ ఎన్‌ కే.తుమ్రామ్‌ జరిపారు. ఆ సమయంలో నాగపూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆయన ఫోరెన్సిక్‌ విభాగంలో లెక్చరర్‌గా ఉన్నారు. అయితే ఈ శవపరీక్ష ఆపరేషన్‌ అంతా ప్రొఫెసర్‌ 'మకరాంద్‌ వ్యవహారే' నేతృత్వంలో జరిగింది. అనేక పోస్ట్‌మార్టం నివేదికల్ని మార్చారన్న ఆరోపణలు ఈయనపై నమోదై ఉన్నాయి. మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్‌ మంగన్‌తివార్‌కు ప్రొఫెసర్‌ మకరాంద్‌ వ్యవహారే బావ అవుతారు. ఈయన మహారాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా కూడా ఉన్నారు. వైద్యఆరోగ్య శాఖలో శక్తివంతమైన స్థానంలో ఉండి ఆయన పలు శవ పరీక్షల నివేదికల్ని మార్చివేశారన్న ఆరోపణలు నాగపూర్‌ ప్రభుత్వ వైద్య కాలేజీలో ఎదుర్కొన్నారు. ఈనేపథ్యంలో జస్టిస్‌ లోయా శవపరీక్ష నివేదికను సైతం ఆయన మార్పించారని నాగపూర్‌ ప్రభుత్వ కాలేజీలోని 14మంది ఉద్యోగస్తులు 'ద కారవాన్‌'ను తెలియజేశారు.` అంటూ సంచ‌ల‌న విష‌యాన్ని కార‌వాన్ వెల్ల‌డించింది.