Begin typing your search above and press return to search.

భూమిపూజకు అసద్ కు ఆహ్వానం.. పిలిచింది ఎవరంటే?

By:  Tupaki Desk   |   2 Aug 2020 1:30 PM GMT
భూమిపూజకు అసద్ కు ఆహ్వానం.. పిలిచింది ఎవరంటే?
X
రాజకీయం లెక్క ఎలా ఉంటుందన్నవిషయం కళ్లకు కట్టే ఉదంతం ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఇలాంటి ట్విస్టు చోటు చేసుకోలేదనే చెప్పాలి. యావత్ దేశంతో పాటు.. ప్రపంచంలోని కొన్ని దేశాల్లోని వారు ఆసక్తిగా చూస్తున్న అయోధ్యలోని రామాలయానికి ఈ నెల ఐదున భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు.

ఇదిలా ఉంటే.. ఎవరూ ఊహించనిరీతిలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి రామమందిర భూమిపూజకు ఆహ్వానించి ఆశ్చర్యానికి గురి చేశారు తెలంగాణ బీజేపీ సీనియర్ నేత.. పార్టీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు. అయోధ్యలో జరిగే భూమిపూజకు దేశ ప్రధానిగా ఉన్న మోడీ ఎలా వెళతారని.. అసద్.. కమ్యునిస్టు నేతలు ప్రశ్నిస్తున్న వేళ.. అసద్ కు ఆహ్వానించటం ఆసక్తికరంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిగా ఉన్న హిందువుల కల ఈ నెల ఐదున తీరనుందని వ్యాఖ్యానించారు. శ్రీరాముడి జన్మస్థలమైన భవ్య రామ్ మందిర్ వద్ద పూజలు చేస్తారని.. ఈ విషయంలో బీజేపీకి చాలా గర్వంగా ఉందన్నారు. మజ్లిస్ తో సహా వామపక్ష వాదులు లేవనెత్తిన అభ్యంతరాల్ని కృష్ణ సాగర్ తేలిగ్గా కొట్టిపారేశారు.

భారత రాజ్యాంగం అందరికి మతస్వేచ్ఛను సమానంగా ఇచ్చిందని.. అందుకు ప్రధాని సైతం మినహాయింపు కాదన్నారు. ఆయన ఆ హక్కును వినియోగించుకుంటారని.. భారత పౌరుడిగా తనకున్న మతహక్కుల్ని.. ఆచారాల్ని నిర్వహించటానికి ఇతరుల కంటే ఎక్కువ అధికారం మోడీకే ఉందన్నారు. ఈ సంగతి ఇలా ఉంటే.. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న భూమిపూజకు అసద్ ను ఆహ్వానించిన అంశంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. అసద్ లాంటి అసలుసిసలు సెక్యులరిస్టు.. బీజేపీ అధికార ప్రతినిధి ఆహ్వానాన్ని ఏం చేస్తారో చూడాలి.