Begin typing your search above and press return to search.

యాపిల్ లాభాల కక్కుర్తి లెక్కలు బయటకొచ్చాయ్

By:  Tupaki Desk   |   6 April 2016 9:25 AM GMT
యాపిల్ లాభాల కక్కుర్తి లెక్కలు బయటకొచ్చాయ్
X
యాపిల్ ఉత్పత్తుల్ని వాడటాన్ని హోదాకు చిహ్నంగా కొందరు భావిస్తారు. ఆ సంస్థ ఉత్పత్తులు వాడటం మరికొందరికి విపరీతమైన మోజును ప్రదర్శిస్తారు. షోకు కోసం కావొచ్చు.. స్టేటస్ కోసం కావొచ్చు.. వాడేందుకు అనువుగా ఉండటం ఇలా కారణాలు ఏమైనా.. యాపిల్ ఉత్పత్తులంటే ఆ మోజే వేరు. దీన్ని బాగా తెలుసుకున్న యాపిల్ తన వినియోగదారుల ముక్కు పిండి భారీగా వసూలు చేస్తుందన్న విషయాన్ని ఒక లెక్క స్పష్టం చేస్తుంది.

తనను విపరీతంగా ప్రేమించే తన వినియోగదారుల ఆసక్తిని క్యాష్ చేసుకోవటంలో యాపిల్ కంటే మొనగాడు ఎవరూ లేరన్న భావన తాజా లెక్కను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అదెలానంటే.. ఐహెచ్ ఎస్ అనే ఒక పరిశోధన సంస్థ లెక్క ప్రకారం యాపిల్ ఫోన్ తయారీ కోసం కంపెనీ పెట్టే ఖర్చు.. దానికి అదనంగా ఎంత లాభానికి యాపిల్ తన ఉత్పత్తుల్ని అమ్ముతుందన్న లెక్కను చెప్పుకొచ్చింది. ఆ లెక్క అంతా విన్నప్పుడు అమ్మ యాపిల్ అనిపించక మానదు. ఎందుకంటే అన్నేసి లాభాలు యాపిల్ లాగేసుకోవటమే దీనికి కారణం.

తాజాగా ఐఫోన్.. ఎస్ ఈ అనే మోడల్ విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్ ని 26వేల రూపాయిలకు (యాభై రూపాయిలు అటూఇటూగా) అమ్ముతుంటే.. భారతీయుల దగ్గర మాత్రం రూ.40వేలు ముక్కు పట్టి లాగేస్తుంది. ఇంతకీ ఈ ఫోన్ తయారు చేసేందుకు యాపిల్ సంస్థకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? రూ.10,500 మించి ఖర్చే కాదని చెబుతున్నారు. మరీ.. అంత పక్కాగా లెక్క ఎట్లా చెబుతారంటే దానికి లెక్క లేకపోలేదు.

యాపిల్ తన తాజా ఫోన్ కి వినియోగించిన టచ్ సెన్సింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ ప్లే ధర రూ.1300 మాత్రమేననట. ఇక.. ఐఫోన్ లో వాడే సెల్యూలార్ చిప్ ఖరీదు రూ.975 నుంచి రూ.1450 మధ్యలో ఉంటుందని చెబుతున్నారు. ఇక.. 64 గిగాబైట్ల మెమొరీ ఫోన్ తయారీకి రూ.10,500 లేదంటే రూ.11వేలకు మించి ఖర్చు కాదని చెబుతున్నారు. కానీ.. యాపిల్ మీద ఉండే క్రేజ్ తో.. దాన్ని భారత మార్కెట్ లో దగ్గర దగ్గరగా రూ.40వేలకు అమ్మటం గమనార్హం. లెక్క అంతా విన్న తర్వాత అనిపించేది ఒక్కటే.. వినియోగదారుల్లో కంపెనీకి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవటంలో యాపిల్ తర్వాతే ఇంకెవరైనా కదూ?