Begin typing your search above and press return to search.

ఏబీడీ పరుగుల వరద.. రికార్డులు బ్రేక్..!

By:  Tupaki Desk   |   28 April 2021 6:30 AM GMT
ఏబీడీ పరుగుల వరద.. రికార్డులు బ్రేక్..!
X
బంతి వేస్తున్నది ఏ బౌలర్​ అనేది అతడికి అనవసరం. తాను ఆడుతున్న స్టేడియం బ్యాటింగ్​ కు అనుకూలమా ? బౌలింగ్​ కు అనుకూలమా? అనే లెక్కలు కూడా అతడికి పట్టవు. తనకు బౌలింగ్ వేస్తున్నది స్పిన్నరా? మీడియం ఫేసరా? ఫాస్ట్​ బౌలరా? అనే సమీకరణాలు కూడా అతడు పట్టించుకోడు. బంతి ఏ వైపు నుంచి వచ్చినా .. దాన్ని బౌండరీకి తరలించడమే అతడికి తెలుసు. అతడే దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్​. గతంలో ఢిల్లీ డేర్ డేవిల్స్‌ తరఫున ఆడిన ఈ మిస్టర్​ 360.. ప్రస్తుతం ఆర్​సీబీ తరఫున ఆడుతున్నాడు.

నిన్న అహ్మదాబాద్​లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆర్​సీబీ వర్సెస్​ ఢిల్లీ క్యాపిటల్స్​ ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్​లో డివిలియర్స్​ చెలరేగిపోయాడు. కష్టాల్లో ఉన్న మ్యాచ్​ ను గట్టెక్కించాడు. కేవలం 42 బంతుల్లో 75 పరుగులు చేశాడు. 3 ఫోర్లు, 5 సిక్సులతో స్టేడియంలో బౌండరీల మోత మోగించాడు. అయితే ఈ మ్యాచ్​ లో చేసిన 75 పరుగులతో ఏబీడీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.అతి తక్కువ బంతుల్లో ఐదువేల పరుగులు చేసిన బ్యాట్స్​మెన్​ గా రికార్డు నెలకొల్పాడు.

అంతేకాక ఐదువేల పరుగులు సాధించిన రెండో విదేశీ బ్యాట్స్​మెన్​ గా కూడా రికార్డు సాధించాడు. ఇప్పటికే విదేశీ ఆటగాడు వార్నర్​ 5000 పరుగుల మైలురాయిని దాటాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 3554 బంతుల్లో 5000 పరుగులు చేయగా.. ఏబీడీ మాత్రం కేవలం 3288 బంతుల్లో 5వేల పరుగులు సాధించాడు. నిన్నటి మ్యాచ్​ లో ఆర్​సీబీ తరఫున టాప్​ ఆర్డర్​ కుప్పకూలింది. విరాట్​ కోహ్లీ, దేవదత్​ పడిక్కల్​, మ్యాక్స్​వెల్​ తక్కువ పరుగులకే అవుటయ్యారు. దీంతో జట్టు బాధ్యతను తన భుజస్కంధాలపైకి తీసుకున్న ఏబీడీ ఆర్​సీబీకి గౌరవప్రదమైన స్కోర్​ తీసుకొచ్చాడు.

చివరకు ఈ మ్యాచ్​ లో ఒక్కపరుగు తేడాతో ఆర్​సీబీ విజయం సాధించింది. ఏబీ డివిలియర్స్ 2011 నుంచి ఆర్​సీబీ తరఫున ఆడుతున్నాడు. అంతకుముందు ఢిల్లీ డేర్ డేవిల్స్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌)కు ఆడాడు. ఢిల్లీ తరఫున 28 మ్యాచ్‌ల్లో 671 రన్స్ చేసిన ఏబీడీ.. ఆర్‌సీబీ తరఫున 4,382 రన్స్ చేశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకు 175 మ్యాచులు ఆడిన ఏబీడి 5053 రన్స్ చేశాడు.