Begin typing your search above and press return to search.

ఐపీఎల్ వేలం : ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ ‘కొనుగోలు’లోనూ అట్టర్ ఫ్లాప్

By:  Tupaki Desk   |   23 Dec 2022 2:32 PM GMT
ఐపీఎల్ వేలం : ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ ‘కొనుగోలు’లోనూ అట్టర్ ఫ్లాప్
X
దిగ్గజ ఆల్ రౌండర్లను వదిలి.. అనామకులపై కోట్లు పోసి.. బుర్రలేని సన్ రైజర్స్ హైదరాబాద్ అని మరోసారి నిరూపించుకుంది. నెటిజన్లు సన్ రైజర్స్ కొనుగోళ్లపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆటలోనే కాదు.. కొనుగోళ్లలోనూ సన్ రైజర్స్ చెత్త అని తిట్టిపోస్తున్నారు.

కేరళ లోని కొచ్చి వేదికగా ఐపీఎల్ మినీ వేలం సాగుతోంది. షరామామూలుగానే మన సన్ రైజర్స్ హైదరాబాద్ వారిని గాలికి వదిలేసి అనామకులపై కోట్లు పోసింది. ఆ డబ్బునంతా అక్కరకు రాని వారిపై కుమ్మరించి బూడిదలో పోసిన పన్నీరు చేస్తోంది. అయితే ముంబై, చెన్నై సహా ప్రాంఛైజీలన్నీ వ్యూహాత్మకంగా తమ వద్దనున్న డబ్బుకు సరిపడా దిగ్గజ ఆల్ రౌండర్లను కొనుగోలు చేస్తుంటే..

ఐపీఎల్ మినీ వేలంలోనూ సన్ రైజర్స్ కొనుగోల్లు చూస్తే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంగ్లండ్ యువ బ్యాటర్ హెన్రీ బ్రూక్ పై 13 కోట్లు వెచ్చించింది.పంజాబ్ కింగ్స్ వ దిలేసిన ఆ టీం కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ను కొన్న సన్ రైజర్స్ అతడి కోసం 8.5 కోట్లు వెచ్చిందింది.

వీరిద్దరిపై సగం డబ్బు పోవడంతో ఇక ప్రపంచంలోనే దిగ్గజ ఆల్ రౌండర్లు అయిన బెన్ స్టోక్స్, సామ్ కరణ్ లను కొనుగోలు చేయలేకపోయింది. వ్యూహాత్మకంగా రంగంలోకి దిగిన చెన్నై బెన్ స్టోక్స్ ను 16 కోట్లకు కొన్నది.ఇక ఐపీఎల్ లోనే అత్యధిక ధరకు ఏకంగా 18.50 కోట్లకు పంజాబ్ యువ ఆల్ రౌండర్ సంచలనం సామ్ కరన్ ను కొనుగోలు చేసింది. ఇటీవలటీ20 వరల్డ్ కప్ ను ఇంగ్లండ్ గెలవడంలో వీరిద్దరిదే కీలక పాత్ర. అలాంటి వారిని వదిలేసి అనామకులైన వారిని కొని సన్ రైజర్స్ నిండా మునిగింది.

ఇప్పటికే సన్ రైజర్స్ తరుఫున దిగ్గజ ఆటగాళ్లు అయిన డేవిడ్ వార్నర్, కేన్ విలయమ్సన్ లాంటి వాళ్లు కెప్టెన్ లను వదులుకుంది. ఒక్క సీజన్ ఆడకుంటేనే వారు బాగా ఆడడం లేదని ఈ టాప్ ఆటగాళ్లను వదిలేసింది.

వాళ్లు దేశం తరుఫున మళ్లీ పుంజుకోవడంతో సన్ రైజర్స్ నిర్ణయం బెడిసికొట్టినట్టైంది. ఆటగాళ్ల విషయంలో నమ్మకుండా వదిలించుకొని చేతులు కాల్చుకుంది. ముంబై, చెన్నై లాంటి జట్లు తమ ఆటగాళ్లపై నమ్మకం ఉంచి ప్రోత్సహిస్తుంటే.. ఆడని వారి విషయంలో కెప్టెన్ లను కూడా పక్కనపెట్టి సన్ రైజర్స్ ఇలా చేజేతులారా టీంను నాశనం చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.