Begin typing your search above and press return to search.

క్వారంటైన్ కు ఢిల్లీ క్యాపిటల్స్.. ఆటగాడికి కరోనా

By:  Tupaki Desk   |   18 April 2022 9:10 AM GMT
క్వారంటైన్ కు ఢిల్లీ క్యాపిటల్స్.. ఆటగాడికి కరోనా
X
నిను వీడని నీడను నేను అంటూ ఐపీఎల్ ను కొవిడ్ వెంటాడుతోంది. కొవిడ్ వ్యాప్తితో రెండేళ్లుగా టోర్నీ ఒడిదొడుకులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. 2020లో పూర్తిగా.. 2021లో సగం టోర్నీ యూఏఈకి తరలిపోయింది. తొలిసారి సుదీర్ఘ లాక్ డౌన్ కారణంగా టోర్నీని గల్ఫ్ దేశానికి తరలించగా, రెండోసారి సగం టోర్నీ అయ్యేసరికి ఆటగాళ్లు, సిబ్బంది వైరస్ బారినపడినట్లు తేలింది.

దీంతో మధ్యలోనే ఆపి వేసి యూఏఈలో కొనసాగించారు. వాస్తవానికి ఈ రెండుసార్లూ అభిమానులు లేకుండా జరిగిన టోర్నీ అంతగా ఆకట్టుకోలేదు. యూఏఈ పిచ్ లు మందకొడిగా ఉండడంతో పరుగులూ రాక నిరాశగా సాగింది. వాస్తవానికి అప్పటికి టీకా కూడా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. పైగా భారత్ లో తలపెట్టిన 2021 ఎడిషన్ కు సెకండ్ వేవ్ తాకిడి తగిలింది. అత్యంత ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కారణంగా వచ్చిన సెకండ్ వేవ్ లో టోర్నీ నిర్వహణ పెద్ద ఇబ్బందికరమే అయ్యేది. దీంతో లీగ్ ను సగంలో ఆపి యూఏఈకి తరలించారు.

అయితే, డెల్టా బలహీన పడడం, ఒమైక్రాన్ కారణంగా వచ్చిన థర్డ్ వేవ్ సద్దుమణగడంతో ఈసారి లీగ్ కు పెద్దగా ఆటంకాలు ఉండవని భావించారు. అన్నిటికి మించి టీకా అందుబాటులోకి రావడం, విదేశీ ఆటగాళ్లు కొందరు మూడో డోసు కూడా వేసుకుని ఉండడంతో టోర్నీ సజావుగా సాగుతుందని భావించారు. అయితే, ఈసారి కూడా కొవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాడికి పాజిటివ్‌ రావడంతో కలకలం రేగుతోంది.

అయితే, అతడి వివరాలు తెలియరాలేదు. దీంతో ఆ జట్టులోని మిగతా ఆటగాళ్లందర్నీ ప్రస్తుతం క్వారంటైన్‌కి తరలించారు. ఈ నేపథ్యంలో ఆ జట్టు.. పంజాబ్‌తో ఆడాల్సిన తదుపరి మ్యాచ్‌పై సందేహాలు నెలకొన్నాయి.

మొన్న ఫిజియోకు

ఇంతకుముందే దిల్లీ జట్టు ఫిజియో ప్యాట్రిక్ ఫర్హత్ కు కరోనా సోకింది. ఈ క్రమంలోనే ఆటగాళ్లకు యాంటిజెన్‌ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌ వచ్చిందని తెలుస్తోంది. దీంతో ఆ జట్టులో ప్రస్తుతం ఆందోళన నెలకొంది. అయితే, వీరికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించాల్సి ఉంది. మరోవైపు గతేడాది సీజన్‌లోనూ బయోబబుల్‌లో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. టోర్నీని మధ్యలోనే నిలిపివేసి.. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలల్లో దుబాయ్‌లో పూర్తి చేశారు. ఒకవేళ ఇప్పుడు కేసులు పెరిగితే నిర్వాహకులు ఏం చేస్తారనేది చూడాలి.

పుణె వెళ్లొద్దు.. హోటల్ లోనే ఉండండి

కొవిడ్ పాజిటివ్ లు రావడంతో దిల్లీ జట్టును హోటల్ వీడొద్దంటూ ఆదేశించారు. ఆటగాళ్లందరి తదుపరి పరీక్ష ఫలితాలు వచ్చేవరకు తర్వాత జరిగే మ్యాచ్ కు పుణె వెళ్లొద్దంటూ సూచించారు. ఈ నేపథ్యంలో దిల్లీ, పంజాబ్ మధ్య బుధవారం జరగాల్సిన మ్యాచ్ సందిగ్ధంలో పడింది. సోమ, మంగళవారాల్లో ఆటగాళ్లందరికీ పరీక్షలు చేసిన తర్వాత దిల్లీ ప్రయాణం ఎలా ఉండనుందో తెలిసిపోతుంది. కాగా, ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడిన దిల్లీ రెండింటిలోనే గెలిచింది. మూడింటిలో ఓడింది. ఓపెనర్లు షా, వార్నర్ , కెప్టెన్ పంత్ రాణిస్తున్నా మిగతావారు చేతులెత్తేస్తుండడంతో దిల్లీకి గెలుపు చిక్కడం లేదు.