Begin typing your search above and press return to search.

డకౌట్ అయ్యాడని ఆ క్రికెటర్ ను తలపై కొట్టిన ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఓనర్

By:  Tupaki Desk   |   14 Aug 2022 4:37 AM GMT
డకౌట్ అయ్యాడని ఆ క్రికెటర్ ను తలపై కొట్టిన ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఓనర్
X
షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది.తాజాగా ప్రముఖ క్రికెటర్ ఒకరు రాసిన బ్లాక్ అండ్ వైట్ పుస్తకంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఓనర్ తీరును ఎండగడుతూ.. తనలో దాచుకున్న నిజాన్ని ప్రపంచానికి చెప్పి షాకిచ్చాడో క్రికెటర్. ఒక మ్యాచ్ లో తాను డకౌట్ అయితే.. మ్యాచ్ అనంతరం.. సదరు ఫ్రాంఛైజీ యజమానుల్లో ఒకరు తన తలపై మూడు.. నాలుగు సార్లు కొట్టినట్లుగా పేర్కొన్నారు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు? అదే ఫ్రాంచైజీ అన్న విషయంలోకి వెళితే..

న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. భారత్ టీ20లో ఆడిన అతను.. తనకు ఎదురైన అనుభవంపైన ఓపెన్ అయ్యాడు. తాజాగా తన ఆటో బయోగ్రఫీని 'బ్లాక్ అండ్ వైట్' పేరుతో పుస్తకం రాయగా.. అది తాజాగా విడుదలైంది. ఇక టేలర్ విషయానికి వస్తే అతగాడు.. భారత టీ20లో టేలర్ మొత్తం 55 మ్యాచులు ఆడి 1017 పరుగులు సాధించాడు. ఇక.. తనకు ఎదురైన అనుహ్య ఘటన గురించి అందులో ప్రస్తావించాడు.

మొహలీ వేదికగా పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో తాను డకౌట్ అయి.. పెవిలియన్ కు తిరిగి వచ్చినట్లుగా పేర్కొంటూ.. 'ఆ మ్యాచ్ లో మేం 195 పరుగుల్ని ఛేదించాల్సి ఉంది. అయితే.. ఆ టార్గెట్ ను అందుకోలేకపోయాం. మ్యాచ్ పూర్తైంది. జట్టుతో సాటు సహాయక సిబ్బంది.. మేనేజ్ మెంట్ కేటాయించిన హోటల్లో ఉన్నాం. అక్కడ షేన్ వార్న్.. లిజ్ హుర్లే తదితరులు ఉన్నారు.

రాజస్థాన్ జట్టు యజమానుల్లో ఒకరు నా దగ్గరకు వచ్చారు. రాస్.. మీరు డకౌట్ గా వస్తే మిలియన్ డాలర్లు చెల్లించమంటూ నా చెంపల మీద చిన్నగా నాలుగుసార్లుకొట్టాడు. అప్పటికి అతను నవ్వుతూనే ఉన్నప్పటికీ.. అతడు కావాలని చేసినట్లుగా అనిపించింది' అని పేర్కొన్నారు.

తానీ పరిస్థితిని అస్సలు ఊహించలేదన్నాడు. ఇది కావాలని చేసినట్లుగా అనిపించిందని.. ఆ దెబ్బ పెద్దవేమీ కాదని.. కాకుంటే అది తనకు సరిగా అనిపించలేదన్నాడు. కాకుంటే.. ఆ సందర్భంలో తాను దాన్నో ఇష్యూగా చేయదలుచుకోలేదన్నారు. తన క్రీడా జీవితంలో అలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని మాత్రం తాను అనుకోలేదన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చెప్పినప్పటికీ ఆ యజమాని పేరును మాత్రం ప్రస్తావించలేదు.

ఐపీఎల్ ఫ్రాంఛైజీ యాజమానులపై ఈ తరహా ఆరోపణలు ఎప్పుడూ వచ్చింది లేదు. రాస్ టేలర్ పుణ్యమా అని.. మరిన్నిఇష్యూలు మరికొందరు బయటపెట్టే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఎంత డబ్బులకు వేలంలో కొనుక్కుంటే మాత్రం ఆటగాళ్లతో ఫ్రాంఛైజీ యజమానులు ఈ తరహాలో వ్యవహరించటమా? అన్నదిప్పుడు షాకింగ్ గా మారింది.