Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో కరవు.. విశాఖలో దరువు

By:  Tupaki Desk   |   15 April 2016 12:12 PM GMT
మహారాష్ట్రలో కరవు.. విశాఖలో దరువు
X
మహారాష్ర్టంలోని ముంబయి, నాగపూర్ లలో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణకు ఆటంకాలు రావడంతో బీసీసీఐ ప్రత్యామ్నాయ వేదికలను పరిశీలిస్తోంది. మహారాష్ట్రలో నీటి కరువు కారణంగా బీభత్సంగా నీటి వృథాకు వేదికయ్యే ఐపీఎల్ మ్యాచుల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కేసులు, విచారణల అనంతరం అక్కడ పోటీల నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ అవకాశం ఇప్పుడు విశాఖ పట్నానికి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. మహారాష్ట్రంలో జరగాల్సిన కొన్ని మ్యాచులు మొహలీలో జరిపేందుకు నిర్ణయం కాగా మరో వేదికగా విశాఖను పరిశీలిస్తున్నారు.

విశాఖపట్టణంలో ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ స్టేడియంను బీసీసీఐ అధికారులు పరిశీలించారు. ఈ నెల 30 తరువాత మహారాష్ట్రలో నిర్వహించాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను విశాఖపట్టణంలో నిర్వహించే అవకాశాలను బీసీసీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. విశాఖలో మ్యాచ్ లు నిర్వహించేందుకు సానుకూల వాతావరణం కనిపిస్తున్నప్పటికీ...ఎండలు మ్యాచ్ లు నిర్వహించే అవకాశానికి గండికొట్టేలా కనిపిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల్లో ఆడితే...ఆటగాళ్లు డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ లు నిర్వహించే అవకాశంపై బీసీసీఐ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో... విశాఖ ప్రజలకు ఐపీఎల్ మ్యాచ్ లు చూసే ఛాన్సు దొరకబోతోందన్నమాట.