Begin typing your search above and press return to search.

ఐపీఎల్ మెగా ‘‘వేలం..’’ ఈసారి ఏమిటో ‘‘విశేషం..’’

By:  Tupaki Desk   |   10 Feb 2022 5:30 PM GMT
ఐపీఎల్ మెగా ‘‘వేలం..’’ ఈసారి ఏమిటో ‘‘విశేషం..’’
X
అనామకులను ఐశ్వర్యవంతులను చేస్తూ.. కుర్రాళ్లపై కోట్లు కుమ్మరిస్తూ.. కాబోయే స్టార్ లను కనిపెట్టి బుట్టలో వేసుకుంటూ.. ప్రతిభావంతులపై పెట్టుబడి పెడుతూ.. వచ్చేయనుంది ఐపీఎల్ 15వ సీజన్ ఆటగాళ్ల వేలం. పది జట్ల్లు.. 590 మంది ఆటగాళ్లు.. ఈసారి సందడి మామాలుగా ఉండదని దీన్నిబట్టే తెలిసిపోతోంది. కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఇప్పటికే అన్ని జట్లు తమ

ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. బెంగళూరులో శని, ఆదివారాల్లో ఈ మెగా వేలం జరగనుంది. తొలుత ఈ వేల ఉన్నత (మార్క్యూ) ప్లేయర్‌లతో ప్రారంభమవుతుంది. ఆపై మిగిలిన ఆటగాళ్ల పేర్లు వేలంలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలే కాదు, వేలంలో పాల్గొనే ఆటగాళ్లు కూడా బెంగళూరుపై దృష్టి సారించారు. కాగా, రెండు ఫ్రాంచైజీలు పెరగడం, 32 మంది తప్ప అందరినీ విడుదల చేయడంతో ఆ వేలం సవాల్ తో కూడుకున్నదే. కొన్ని ఫ్రాంచైజీలు ఎక్కువ సొమ్మును కలిగి ఉన్నందున పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇదే సమయంలో జట్లలో సమతూకం చాలా ముఖ్యం. అన్ని జట్ల ముందున్న అసలు లక్ష్యం కూడా అదే. పది ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు దాదాపు రూ. 500 కోట్లకుపైగా వెచ్చించనున్నాయి.

పంజాబ్ బాగా రిచ్.. ఢిల్లీ పూర్

ప్రస్తతం ఉన్న అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే నలుగురేసి చొప్పున ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఇందుకోసం డబ్బు ఖర్చుపెట్టాయి. అది పోగా మిగిలిన మొత్తంతో ఆటగాళ్లను కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే.. పంజాబ్ కింగ్స్ పర్సులో అత్యధిక డబ్బు కలిగి ఉంది. వేలంలో కింగ్స్ రూ. 72 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. దీని తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌ వద్ద రూ.68 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.62 కోట్లు, లఖ్నో జట్టు చేతిలో రూ.59 కోట్లు, అహ్మదాబాద్ వద్ద రూ.52 కోట్లు ఉన్నాయి. చెన్నై, కోల్‌కతా, ముంబై జట్లు రూ. 48 కోట్లతో తమ జట్టును నిర్మించాల్సి ఉంది. అదే సమయంలో ఢిల్లీ పర్సులో అత్యల్పంగా రూ.47.50 కోట్లు మిగిలాయి.

తొలి రోజు తక్కువ మందే వేలానికి..

శనివారం తొలి రోజు రోజు.. 161 మంది ఆటగాళ్లు వేలానికి రానున్నారు. ఇందులో ఇప్పటికే మనకు తెలిసిన ఆటగాళ్లు ఎక్కువమంది ఉంటారు. ఇక ఆదివారం జరిగే వేలంలో ఎక్కువ కొత్త ముఖాలు కనిపించనున్నాయి. ఎప్పటిలానే తొలి రోజు వేలంలో అమ్ముడు పోని వారు రెండో రోజు వేలంలోకి రానున్నారు.

మార్క్యూ ఎట్ 2 కోట్లు..

ఉన్నత (మార్క్కూ) ఆటగాళ్ల గురించి పెన చెప్పుకొన్నాం కదా? ఇలాంటివారు వేలంలో 10 మంది వరకు ఉన్నారు. వీరి నుంచి మొదటి బిడ్ రానుంది. వీరంతా రూ.2 కోట్ల బేస్ ధర ఉన్న ఆటగాళ్లే. ఈ జాబితాలో అశ్విన్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ తదితరులున్నారు. ఇక

అన్ని జట్ల దృష్టి ఇషాన్ కిషన్‌పైనే ఉంది. ప్రస్తుతం వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ గా నిలకడగా రాణిస్తున్న ఏకైక ఆటగాడు కావడంతో కిషన్‌పై కన్నేశాయి. అహ్మదాబాద్, లక్నో జట్టు యజమాన్యం ఇప్పటికే అతడితో టచ్‌లొ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ వేలంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు.

ఆ ఏడుగురు టాప్‌ ప్లేయర్లను దక్కించుకోవడమే డీసీ లక్ష్యం

ఇప్పటికే పది ఫ్రాంచైజీలు వేలానికి సంబంధించిన కసరత్తులో తీరిక లేకుండా ఉన్నాయి. ఎవరిని కొనుగోలు చేయాలి..? ఎంతకు దక్కించుకోవాలనే లెక్కల్లో మునిగిపోయాయి. అయితే, గత రెండు సీజన్లలో బాగా పుంజుకున్న ఢిల్లీ కేపిటల్స్ (డీసీ) మాత్రం మంచి పట్టుదలతో ఉంది. శనివారం వేలంలోనే టాప్‌ ప్లేయర్ల వేలంలో కనీసం ఏడుగురిని దక్కించుకోవాలని దిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది. జట్టులో సమతూకం తీసుకొచ్చే ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతామని సహాయక కోచ్ ప్రవీణ్ ఆమ్రె వెల్లడించాడు. కెప్టెన్ రిషభ్‌ పంత్, అక్షర్‌ పటేల్, పృథ్వీ షా, ఆన్రిచ్ నోర్జ్‌లను అట్టిపెట్టుకున్న డీసీ.. ఇప్పుడిక మరో ఏడుగురిని ఎంపిక చేసుకోవాల్సి ఉంది.

మెగా వేలంలో పాల్గొనే జాబితాను ఇప్పటికే బీసీసీఐ విడుదల చేసేసింది. 590 మందితో కూడిన లిస్ట్‌లో భారత్‌ నుంచి 370 మంది ఉండగా.. విదేశీ ప్లేయర్లు 220 మంది ఉన్నారు. ఇందులో టీమ్ఇండియా సీనియర్లు, ఓ రాష్ట్ర మంత్రి, నిషేధం తొలిగిపోయిన ఓ క్రికెటర్‌, దిగ్గజ ఆటగాడి కుమారుడు, జాతీయ జట్టులోకి అరంగేట్రం చేయని ఆటగాళ్లు ఉండటం విశేషం. పశ్చిమ్‌బంగా మంత్రి మనోజ్‌ తివారీ (రూ. 50 లక్షలు), శ్రీశాంత్ (రూ. 50 లక్షలు), సచిన్‌ కుమారుడు అర్జున్‌ తెందూల్కర్‌ (రూ. 20 లక్షలు) తదితరులు అదృష్టం పరీక్షించుకుంటారు.

ఆకర్షణీయ ధర

ఇక ఐపీఎల్‌ మెగా వేలంలో అత్యంత ఆకర్షణీయమైన కనీస ధర (బేస్ ప్రైస్) రూ. 2 కోట్లు. మొత్తం 48 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో భారత్‌కు చెందిన 17 మంది టాప్‌ ప్లేయర్లు ఉండటం విశేషం. ఇలాంటివారిలో ఓపెనర్ శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్, స్పిన్నర్ చాహల్ వంటి టీమిండియా ఆటగాళ్లు సహా తెలుగు వాడు అంబటి రాయుడు కూడా ఉన్నారు. రాయుడు (రూ.2.2 కోట్లు), రాబిన్‌ ఉతప్ప (రూ. 3 కోట్లు), దినేశ్ కార్తిక్‌ (రూ. 7.4 కోట్లు), ఉమేశ్‌ యాదవ్‌ (రూ. కోటి), షమీ (రూ. 4.8 కోట్లు) కూడా తమ బేస్‌ ప్రైస్‌ను రూ. 2 కోట్లుగా పెట్టుకున్నారు. అయితే మెగా వేలంలో భారీ ధర రాకపోయినా.. ఏదొక ఫ్రాంచైజీ మాత్రం వీరిని తీసుకుంటుంది. అలానే మరో 20 మంది ఆటగాళ్లు రూ. 1.5 కోట్లతో, 34 మంది ప్లేయర్లు రూ. కోటి ధరతో వేలంలోకి వచ్చారు.