Begin typing your search above and press return to search.

ఐపీఎల్ మరింత ఆలస్యం?

By:  Tupaki Desk   |   30 Aug 2020 5:10 AM GMT
ఐపీఎల్ మరింత ఆలస్యం?
X
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరూ భయపడినట్లుగానే ఐపీఎల్ నిర్వహణకు కరోనా బ్రేకులు వేస్తోంది. సెప్టెంబర్ 19న ఐపీఎల్ మొదలై మొదటి మ్యా చ్ సీఎస్‌కే - ముంబై మధ్య జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మ్యాచ్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ లో మ్యాచ్ లకు వేదికైన దుబాయ్ కి ఆటగాళ్లు కొన్ని రోజులు ముందే చేరుకున్నారు. నిబంధనల మేరకు ఆటగాళ్ళందరినీ యాజమాన్యాలు క్వారంటైన్ కేంద్రాలకే పరిమితం చేశాయి. ఆటగాళ్లు అందరికీ ఆర్టీ -పీసీఆర్ కిట్లతో కరోనా పరీక్షలు చేయించారు. మిగతా ఆటగాళ్లు అందరికీ కరోనా నెగటివ్ రాగా..సీఎస్‌కే జట్టులో ఇద్దరు ఆటగాళ్ళు సహా మొత్తం 12 మంది కోవిడ్ బారిన పడడం సంచలనంగా మారింది. ఒక్క జట్టులో ఇంత మంది వ్యాధి బారిన పడటంతో అంతా షాక్ అవుతున్నారు. అయితే సీఎస్‌కే యాజమాన్యం చేసిన తప్పు కారణంగానే ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. అన్ని జట్లు తమ ఆటగాళ్లను ఇండియాలో ప్రాక్టీస్ కూడా చేయించ కుండానే దుబాయ్ కి తీసుకెళ్ళాయి. అక్కడ ఆటగాళ్లకు వేర్వేరు గదులు కేటాయించి ఒంటరిగా ఉండేలా సౌకర్యం కల్పించాయి. సీఎస్‌కే యాజమాన్యం మాత్రం అత్యధిక కేసులు నమోదు అవుతున్న చెన్నై నగరంలో ముందస్తు ప్రాక్టీస్ నిర్వహించింది. ఆ సమయంలోనే పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. ఈ వ్యాధి ఒకరినుంచి మరొకరికి సోకినట్లు సమాచారం. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా 20 రోజుల వ్యవధి మాత్రమే ఉండగా ఈ సమయంలో కరోనా కేసులు బయట పడటం బీసీసీఐని ఆందోళన పరుస్తోంది.పైగా మొదటి మ్యాచ్ చెన్నై - ముంబై మధ్య ఉండటంతో అప్పటి కల్లా చెన్నై ఆటగాళ్లు సిద్దమవుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కరోనా బారిన పడిన ఆటగాళ్ల స్థానంలో కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే మ్యాచ్ లు మొదలై..ఆటగాళ్లు ఒకరికొకరు దగ్గరగా ఉండాల్సి రావడం, మూడు వేదికల్లో జరిగే మ్యాచ్ ల కోసం ఆటగాళ్లు అటూ ఇటూ తిరగడం వల్ల కూడా వైరస్ బారిన పడే అవకాశం ఉంది. ఒకసారి మ్యాచ్ లు మొదలయ్యాక జట్ల లోని ఆటగాళ్లకు కరోనా వస్తే మ్యాచ్ ల నిర్వహణ ఎలా సాగిస్తారనే ది అర్థం కావడం లేదు. బీసీసీఐ ఇప్పటికి కూడా ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేయక పోవడంతో అసలు 19న సీజన్ మొదలవుతుందా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.