Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో సిక్సర్ల సునామీ.. రికార్డు ఎవరిదంటే..?

By:  Tupaki Desk   |   31 May 2022 3:30 PM GMT
ఐపీఎల్ లో సిక్సర్ల సునామీ.. రికార్డు ఎవరిదంటే..?
X
బ్యాట్స్ మన్ పరుగులు వేడుక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ఈ ఏడాది లీగ్ దిగ్విజయంగా సాగిన సంగతి అందరికీ తెలిసిందే. అందులోనూ ప్రత్యేకం ఏమిటంటే.. ఈసారి తొలిసారిగా సిక్సర్ల సంఖ్య వెయ్యి దాటింది. గత టోర్నీల్లో అత్యధిక సిక్సర్ల సంఖ్య 850పైగా ఉండగా.. ఈసారి ప్లే ఆఫ్స్ సమయానికే వెయ్యిని మించాయి. వాస్తవానికి ఇది కొంత ఊహించినదే. ఎందుకంటే.. లీగ్ లో ఈసారి రెండు జట్లు పెరిగాయి. అందుకుతగ్గట్లు మ్యాచ్ లను సరిచేయాల్సి వచ్చింది. ఈ ప్రకారమే సిక్సర్లూ పెరిగాయి.

భారత్ లో ధమాకా..?

గత రెండేళ్లు ఐపీఎల్ కొవిడ్ నేపథ్యంలో యూఏఈలో నిర్వహించాల్సి వచ్చింది. అయితే, అక్కడి మైదానాలు చిన్నవే అయినా.. పిచ్ లు మాత్రం నెమ్మది. ఈ కారణంగానే భారీ స్కోర్లు ఒకటో రెండో తప్ప ఎక్కువ ఉండేవి కావు. వాతావరణం రీత్యా బౌండరీలు కాదు కదా.. పరుగుల రాక కూడా కష్టమయ్యేది. కానీ, ఈ ఏడాది కొవిడ్ భయాలు తొలగడంతో పూర్తిగా లీగ్ ను భారత్ లోనే నిర్వహించారు. అయితే, మార్చి నెలకు ముందు థర్డ్ వేవ్ విరుచుకుపడడంతో మైదానాలను నాలుగుకు పరిమితం చేశారు.

మరిన్ని మైదానాల్లో నిర్వహించి ఉంటే..

ప్లే ఆఫ్స్ మాత్రం పుణె, కోల్ కతా, ఫైనల్స్ అహ్మదాబాద్.. ఇలా వేర్వేరు మైదానాల్లో నిర్వహించారు. దీంతో పరుగులు, బౌండరీలు, సిక్సర్లు పెరిగాయి. మొత్తం సంఖ్య వెయ్యి దాటాయి. అయితే, ఇందులో 177 సిక్సర్లు ఐదుగురు బ్యాట్స్ మెనే బాదారు. వీరిలోనూ ముగ్గురు విదేశీ క్రికెటర్లే ఉన్నారు. మిగతా ఇద్దరు భారత క్రికెటర్లు కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ కావడం విశేషం. ఈ ఇద్దరూ తమ జట్లు లఖ్ నవూ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్లు కావడం గమనార్హం. కాగా, లఖ్ నవూ రెండో ప్లే ఆఫ్స్ లో ఇంటిముఖం పట్టగా, రాజస్థాన్ ఫైనల్లో ఓడిన సంగతి తెలిసిందే.

ఈ ఐదుగురూ సిక్సర్ల వీరులు

రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్, ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జాస్ బట్లర్ టోర్నీలో అత్యధిక పరుగులు (863) సాధించిన సంగతి తెలిసిందే. ఆరెంజ్ క్యాప్ ను మొదటి నుంచి అతడే సొంతం చేసుకున్నాడు. 57.53 ఇతడి సగటు. ఇక టోర్నీలో 45 సిక్సులు కొట్టాడు. బట్లర్ ఈ సీజన్ లో నాగులు సెంచరీలు కొట్టాడు. ప్లే ఆఫ్స్ ముందు నాలుగైదు మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు కానీ.. లేదంటే సిక్సర్ల అర్ధ సెంచరీ దాటేవాడు.

రెండో స్థానంలో 34 సిక్సర్లతో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్ మన్ లియామ్ లివింగ్ స్టన్ ఉన్నాడు. ఈ భారీ హిట్టర్ టోర్నీలో 117 మీటర్ల సిక్సర్ కొట్టి అత్యధిక దూరం సిక్స్ కొట్టినవాడిగా నిలిచాడు. కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ 32 సిక్సర్లతో మూడో స్థానంలో, కేఎల్ రాహుల్ (30) నాలుగో, శాంసన్ (26) ఐదో స్థానంలో నిలిచారు. రస్సెల్ కాస్త ఫామ్ లో ఉన్నా.. మరిన్సి సిక్సులు బాదేవాడు.

మన స్టార్లు ఎక్కడ?

టీమిండియా సూపర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తో పాటు భవిష్యత్ కెప్టెన్ గా భావిస్తున్న రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ వీరంతా టోర్నీలో నిరాశపరిచారు. సిక్సర్ల పట్టికలోనే కాదు.. పరుగుల పట్టికలోనూ వీరు వెనుకనే ఉన్నారు. ఇక వీరి తర్వాతి తరం క్రికెటర్లలో హార్దిక్ పాండ్యా, ఫామ్ లోకి వచ్చినా.. సిక్సులు మాత్రం తక్కవే.