Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో తొలిసారి సిక్సర్ల థౌజండ్‌వాలా.. ప్లే ఆఫ్స్ కు ముందే..

By:  Tupaki Desk   |   23 May 2022 1:30 PM GMT
ఐపీఎల్ లో తొలిసారి సిక్సర్ల థౌజండ్‌వాలా.. ప్లే ఆఫ్స్ కు ముందే..
X
టి20 క్రికెట్ అంటేనే సిక్సర్ల పండగ.. బౌండరీల వేడుక.. పరుగుల ప్రవాహం.. ధనాధన్ క్రికెట్ పుట్టిందే ఇందుకా? అన్నట్లు బ్యాట్స్ మన్ బాదేస్తుంటారు.. బౌలర్లు బాధితులైపోతుంటారు.. అందులోనూ మన టీ20 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే పరుగుల బొనాంజానే. భారత్ లో టి20 లీగ్ జరుగుతుందంటేనే సిక్సర్లు, బౌండరీల స్కోర్ షీట్ అలా అలా పెరిగిపోతుంటుంది. అందుకేనేమో.. ఐపీఎల్.. దక్షిణాఫ్రికాలో జరిగినా.. యూఏఈలో జరిగినా రానంత కిక్.. భారత్ లో జరిగితే వస్తుంది.

ఐపీఎల్.. ఎండాకాలం నిండు వినోదం

ఓ 15 ఏళ్ల కిందట ఎండాకాల వచ్చిందంటే భారత్ తో పాటు అనేక దేశాల్లో క్రికెట్ కు సెలవు. ఇంగ్లిష్ కౌంటీలు తప్ప మరెక్కడా క్రికెట్ మ్యాచ్ లు జరిగే ఆనవాళ్లే ఉండేవి కాదు. దీంతో అభిమానులు డీలా పడిపోయేవారు. మళ్లీ మ్యాచ్ లు ఎప్పుడా? అని ఎదురుచూసేవారు. కానీ, మరి ఇప్పుడో..? మిగతా క్రికెట్ సీజన్ అంతా ఒక ఎత్తు. వేసవి సీజన్ ఒక ఎత్తు. ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుందా? అని కళ్లన్నీ కాయలు కాచేలా చూస్తున్నారు. వేసవిలో క్రికెట్ కొరతను తీర్చింది కాబట్టే ఐపీఎల్ కు అంత డిమాండ్.

15వ ఎడిషన్.. చరిత్రలో నిలిచేలా

ప్రస్తుతం ఐపీఎల్ 15వ సీజన్ నడుస్తోంది. వాస్తవానికి ఈ సీజన్ కు చాలా ప్రత్యేకత ఉంది. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా పూర్తిస్థాయిలో భారత్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం ఆ అవకాశం చేజారనీయలేదు. అంతేకాదు.. చాలా సీజన్లుగా ఒకే జట్టుకు అంటిపెట్టుకున్న ఆటగాళ్లు ఈ సీజన్ లో వేర్వేరు జట్లకు మారిపోయారు. కేవలం నలుగురినే రిటైన్ చేసుకున్న ఫ్రాంచైజీలు మిగతా కావాల్సిన వారిని వేలంలో కొనుక్కున్నాయి.

అన్నిటికి మించి 14 సీజన్లుగా 8 జట్లు ఉండగా.. ఈసారి రెండు జట్లు పెరిగాయి. చిత్రమేమంటే.. ఈ రెండు జట్లే టాప్ -3లో నిలిచాయి. కాగా, ఐపీఎల్‌ 2022మరో ప్రత్యేక ఘనత సాధించింది. ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును (1000) అందుకుంది. అదికూడా ప్లేఆఫ్స్ కు ముందే.. చివరి లీగ్ మ్యాచ్ లో కావడం గమనార్హం. ఆదివారం సన్‌రైజర్స్‌-పంజాబ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ హార్డ్ బిగ్ హిట్టర్‌ లియామన్ లివింగ్‌స్టోన్‌.. ప్రస్తుత లీగ్ వెయ్యో సిక్సర్ బాదాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ స్థాయిలో సిక్సర్లు నమోదవడం ఇదే తొలిసారి.

1,100 దాటడం ఖాయం

2018 సీజన్‌లో 872 సిక్సర్లు కొట్టగా.. అవే ఇప్పటివరకు అత్యధికంగా ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ప్లే ఆఫ్స్, ఫైనల్ కలిపి మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో మరో వంద సిక్సర్లు నమోదయ్యే అవకాశముంది. ఈ సీజన్‌ తొలి సిక్సర్‌ను సీఎస్‌కే బ్యాటర్‌ రాబిన్‌ ఉతప్ప కొట్టాడు. చిత్రమేమంటే ఈ సీజన్‌ లాంగెస్ట్‌ సిక్సర్‌ రికార్డు కూడా లివింగ్‌స్టోన్‌ (117 మీటర్లు) పేరిటే నమోదై ఉండటం విశేషం.

సీజన్ల వారీగా సిక్సర్ల వివరాలు:
2022 : 1001 (అత్యధికం)
2018 : 872
2009 : 506 (అత్యల్పం)

2022 సీజన్‌లో లాంగెస్ట్ సిక్సర్లు:
లివింగ్‌స్టోన్ : 117 మీటర్లు
టిమ్‌ డేవిడ్‌: 114 మీటర్లు
డెవాల్డ్ బ్రెవిస్ : 112 మీటర్లు