Begin typing your search above and press return to search.

మ‌రో యుద్ధం ముంచుకొస్తుందా?

By:  Tupaki Desk   |   26 May 2019 5:17 AM GMT
మ‌రో యుద్ధం ముంచుకొస్తుందా?
X
ప్ర‌పంచానికి మ‌రో యుద్ధం మంచుకొస్తోంది. పెద్ద‌న్న ఈగో హ‌ర్ట్ అయిన నేప‌థ్యంలో.. ఇరాన్ మీద త‌న ప్ర‌తాపాన్ని చూపించేందుకు అమెరికా యుద్ధానికి దిగుతోంది. గ‌డిచిన కొద్ది రోజులుగా ఇరాన్ ను దారికి తెచ్చుకునేందుకు అమెరికా ప్ర‌య‌త్నించ‌టం.. అందుకు ఆ దేశం స‌సేమిరా అన‌టం తెలిసిందే. దీంతో ఇరాన్ ఆర్థిక మూలాల్ని దెబ్బ తీసే క్ర‌మంలో అమెరికా త‌న మిత్ర‌దేశాల‌ను ఇరాన్ నుంచి చ‌మురు కొన‌కూడ‌ద‌న్న ఆంక్ష‌ల‌తో పాటు.. మ‌రిన్ని ప‌రిమితుల్ని విధించింది.

తాజాగా ఇరాన్ సంగ‌తి చూసేందుకు మ‌ధ్య‌-తూర్పు ఆసియాలో మొహ‌రించిన 70వేల బ‌ల‌గాల‌కు అద‌నంగా మ‌రో 1500 మంది సైనికుల్ని పంపుతున్న‌ట్లుగా వైట్ హౌస్ ప్ర‌క‌టించింది. అంతేకాదు.. సైనికుల‌తో పాటు 12 జెట్ విమానాలు.. బీ-52 బాంబ‌ర్లు.. నిఘా విమానాల్ని కూడా త‌ర‌లించే ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ప‌శ్చిమాసియాలో మ‌రోసారి యుద్ద మేఘాలు క‌మ్ముకోనున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

దాదాపు రెండు ద‌శాబ్దాల క్రితం తాలిబ‌న్ల‌ను ఏరివేసేందుకు అప్ఘ‌నిస్తాన్ లో మొద‌లైన యుద్ధం ఆ త‌ర్వాతి కాలంలో ఇరాక్ కు విస్త‌రించ‌టం.. ఇప్పుడా రెండు దేశాలు ఎంత దారుణంగా దెబ్బ తిన్నాయో తెలిసిందే. తాజాగా అమెరికా త‌న టార్గెట్ ను ఇరాన్ మీద పెట్టింది. ఆ దేశం నుంచి త‌మ సైన్యానికి ముప్పు పంచి ఉంద‌ని.. ప‌శ్చిమాసియా.. మ‌ధ్య‌-తూర్పు ఆసియాలో మోహ‌రించిన త‌మ సైనికులు.. వ‌న‌రుల‌ను కాపేందుకు అద‌న‌పు బ‌ల‌గాల్ని పంపుతున్న‌ట్లుగా వైట్ హౌస్ పేర్కొంది.

అయితే.. ఇందుకు త‌గ్గ ఆధారాల్ని చూపించ‌టంలో ట్రంప్ స‌ర్కారు ఫెయిల్ అయ్యింది. మ‌రోవైపు.. ఇరాన్ మీద చేస్తున్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో అమెరికా కాంగ్రెస్ స‌భ్యులు ఆధారాలు చూపించాల‌ని డిమాండ్ చేస్తున్నా ఫ‌లితం లేకుండా పోతున్న ప‌రిస్థితి. తాజాగా క‌మ్ముకున్న యుద్ధ మేఘాల ప్ర‌భావం భార‌త్ మీద త‌ప్ప‌క ఉంటుంది. చ‌మురుకు సంబంధించిన కొర‌త‌.. ధ‌ర‌ల పెరుగుద‌ల భారీగా ఉంటుంద‌న్న అనుమానాలు ఉన్నాయి.

ఇరాన్ తో అమెరికా జ‌రిపే యుద్ధం అగ్ర రాజ్యం మీద మ‌ధ్య‌ప్రాచ్యంలో మ‌రింత ఆగ్ర‌హం క‌లిగించేలా చేయ‌టంతో పాటు.. అశాంతికి కార‌ణ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉంటే.. అమెరికా తీరును ఇరాన్ తీవ్రంగా త‌ప్పు ప‌డుతోంది. ప‌ర్షియ‌న్ గ‌ల్ఫ్ లో ఉద్రిక్త‌త‌ల‌ను సృష్టించేందుకు అమెరికాఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌టం మామూలేన‌ని పేర్కొంది.

అమెరికా పంపే సైన్యాన్ని స‌ముద్రంలోనే జ‌ల‌స్థాపితం చేస్తామ‌ని ఇరాన్ విదేశాంగ‌మంత్రి మ‌హ‌మ్మ‌ద్ జావెద్ జారిఫ్ తీవ్ర వ్యాఖ్య చేశారు. ఈ రెండు దేశాల మ‌ధ్య న‌డుస్తున్న మాట‌ల యుద్ధం.. రియ‌ల్ యుద్ధంగా మారే స‌మ‌యం చాలా త‌క్కువ ఉండ‌టంపై ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మ‌రికొద్ది నెల‌ల్లో అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ట్రంప్ త‌న బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు.. మ‌రోసారి విజ‌యాన్ని సొంతం చేసుకునేందుకు ఇరాన్ మీద యుద్ధానికి కాలు దువ్వుతున్నార‌న్న విమ‌ర్శ ఉంది. గ‌తంలోని ప్ర‌భుత్వాలు యుద్ధంతో రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందిన నేప‌థ్యంలో.. అదే తీరును ట్రంప్ ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్న ఆరోప‌ణ ఉంది. మొత్తంగా చూస్తే అమెరికా - ఇరాన్ మ‌ధ్య జ‌రిగే యుద్ధం ప్ర‌పంచ‌దేశాల మీద ఖాయంగా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.