Begin typing your search above and press return to search.

ప్రపంచ ప్రజలకు దడ పుట్టే నిర్ణయాన్ని చెప్పిన ఇరాన్

By:  Tupaki Desk   |   6 Jan 2020 5:51 AM GMT
ప్రపంచ ప్రజలకు దడ పుట్టే నిర్ణయాన్ని చెప్పిన ఇరాన్
X
తమ దేశ సైనిక చీఫ్ ను డ్రోన్ల సాయంతో దారుణంగా హతమార్చిన అమెరికాపై ఇరాన్ రగిలిపోతోంది. తమకెంతో కీలకమైన అధికారిని హతమార్చే విషయంలో అగ్రరాజ్యం అన్ని గీతల్ని దాటినట్లుగా ఇరాన్ మండిపడుతోంది. తమకు చేసిన ద్రోహానికి అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్న ఇరాన్.. అందుకు తగ్గట్లే సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అగ్రరాజ్యంతో తమకున్న విభేదాల వేళ.. ప్రపంచ ప్రజలు ఉలిక్కిపడేలా నిర్ణయాన్ని తీసుకుంది.

2015లో వివిధ దేశాల మధ్య కుదిరిన అణుఒప్పందంలోని కీలక నిబంధనన నుంచి బయటకు వచ్చేసింది. ఈ నిర్ణనయంతో యురేనియం నిల్వలు.. వాటిని శుద్ధి చేసే స్థాయిని పెంచుతున్నట్లుగా వెల్లడించింది. చివరకు యురేనియం శుద్ధిలో కీలకపాత్ర పోషించే సెంట్రిఫ్యూజుల సంఖ్య పైనా పరిమితిని సైతం పక్కన పెట్టేస్తున్నట్లుగా స్పష్టం చేసింది.

తాజా ప్రకటన తో వివిధ దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందం నుంచి ఇరాన్ పూర్తిగా బయటకు వచ్చేసినట్లైంది. దీంతో.. యురేనియం శుద్ది ఎంత మొత్తంలో చేయాలి? లాంటి పరిమితులు ఏమీ ఇరాన్ మీద ఉండవు. ఇరాన్ నిర్ణయాన్ని ఒప్పందంలో భాగస్వామ్య దేశాలైన బ్రిటన్.. ఫ్రాన్స్.. జర్మనీ.. చైనాలు విచారం వ్యక్తం చేశాయి. ప్రస్తుతానికి అమెరికా.. ఇరాన్ రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరాయి. ఇరాన్ తాజా నిర్ణయంపై ఐక్య రాజ్యసమితి సైతం స్పందించింది. ఇరాన్ విదేశాంగమంత్రితో మరింత లోతుగా చర్చలు ప్రారంభిస్తామని చెబుతున్నారు.

ఇరాన్ ప్రకటన ప్రపంచ ప్రజల్ని కలవరపాటుకు గురి చేసేదెందుకు? అన్న విషయంలోకి వెళితే.. అణు ఆయుధాల తయారీకి కీలకమైన యురేనియం ను ఇష్టారాజ్యం గా ఉత్పత్తి చేస్తే.. దాన్ని తమకు నచ్చిన వారికి అమ్మటం షురూ చేస్తే.. ప్రపంచానికి కొత్త సమస్య వచ్చి పడినట్లు అవుతుంది. అణు ఆయుధాలు ఏ ఒక్కటి సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళినా.. కిమ్ లాంటి నియంత చేతుల్లోని వెళ్లినా.. ప్రపంచానికి జరిగే నష్టం మాటల్లో చెప్పలేదని.. అందుకే.. ఇరాన్ తాజా ప్రకటన ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. ప్రపంచ మానవాళికి సైతం ఏ మాత్రం మంచిది కాదని చెప్పక తప్పదు.