Begin typing your search above and press return to search.

ఐసిస్ అడ్ర‌స్ ఇక ఉండే చాన్స్ లేదు

By:  Tupaki Desk   |   15 March 2017 7:39 AM GMT
ఐసిస్ అడ్ర‌స్ ఇక ఉండే చాన్స్ లేదు
X
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ పై విజయం దిశగా ఇరాక్ సైన్యాలు ప‌ట్టుబిగించేశాయి. పశ్చిమ మోసుల్‌ లో జిహాదిస్టులను అన్నివైపుల నుంచి చుట్టుముట్టాయి. ఇంతకాలం ఐఎస్ ప్రాబల్యం ఉన్న అన్ని కీలక ప్రాంతాల్లోకి దూసుకుపోయి పట్టు బిగించాయి. ఐఎస్‌ చీఫ్ మహమ్మద్ అబూ బకర్ బాగ్దాదీ మోసుల్ వదిలి పారిపోవటంతో జిహాదిస్టుల ఆత్మస్థైర్యం దెబ్బతింది. రఖా పట్టణం - అల్‌ నఫత్ ప్రాంతాల్లో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లను ఉద్ధృతంగా నిర్వహిస్తున్నాయని లెఫ్టినెంట్ జనరల్ రరుూద్ షకీర్ జాదత్ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో సాధారణ ప్రజల మాటున తలదాచుకున్న జిహాదీల కోసం గాలింపు జరుపుతున్నామని తెలిపారు. మోసుల్ పాత పట్టణంలో కూడా సైన్యం దాడులు కొనసాగుతున్నాయన్నారు. చాలామంది జిహాదిస్టులు మామూలు ప్రజల్లో కలగలిసిపోవటంతో వారిని గుర్తించటం కష్టమవుతోందని అన్నారు. అయినప్పటికీ ఐఎస్‌ ను ఓడించటానికి తాము కట్టుబడి ఉన్నామని, త్వరలోనే విజయం సాధిస్తామని జాదత్ వివరించారు.

ఇదిలాఉండ‌గా ఐసిస్ దారుణాల వ‌ల్ల సిరియాలో చిన్నారుల పరిస్థితి ఘోరంగా తయారైందని, అంతర్యుద్ధంలో చనిపోతున్న చిన్నారుల సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతున్నదని యునిసెఫ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2016 ఏడాదిలో 652 మంది చిన్నారులు చనిపోయారని, ఇందులో 255 మంది పిల్లలు పాఠశాలలకు సమీపంలో చోటుచేసుకున్న బాంబు దాడి ఘటనల్లో మృతి చెందారని యునిసెఫ్‌ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి..."2015 ఏడాదితో పోల్చుకుంటే పిల్లల మరణాలు 2016 నాటికి 20 శాతం పెరిగాయి. నివేదికలోని వివరాలన్నీ అధికారికంగా ధృవీకరించినవే. అనధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. 2016లో 850 మంది చిన్నారుల్ని తీవ్రవాదులు తమ దళాలల్లో చేర్చుకున్నారు. వారికి ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య రెట్టింపు అయ్యింది. ఇలా రిక్రూట్‌ చేసుకున్న బాలల్ని యుద్ధ క్షేత్రంలో ఆయుధంగా తీవ్రవాదులు వాడుతున్నారు. ముందు భాగంలో వారిని నిలిపి తీవ్రవాదులు కదులుతున్నారు. కొన్ని చోట్ల బాలలతో హత్యలు, ఆత్మాహుతి దాడులు జరిపిస్తున్నారు" అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/