Begin typing your search above and press return to search.

3 గంటలు ఆలస్యం..తేజస్ కు భారీ చెల్లింపులు తప్పలేదు

By:  Tupaki Desk   |   22 Oct 2019 4:26 AM GMT
3 గంటలు ఆలస్యం..తేజస్ కు భారీ చెల్లింపులు తప్పలేదు
X
రైలు అన్నాక ఆలస్యం కాకుండా ఉంటుందా? ఒకవేళ చెప్పిన టైంకు చెప్పినట్లుగా గమ్యస్థానానికి చేరితే ఆ ట్రైన్లో జర్నీ చేసిన వారికి కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. టైంకి రైళ్లు గమ్యస్థానాలకు చేరటం చాలా తక్కువ. లేటు అన్నది ఇండియన్ రైల్ డీఎన్ ఏలోనే ఉందన్న ఎటకారం చాలామంది చేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో మేం నడిపే ట్రైన్ ఆలస్యమైతే.. అందులో జర్నీ చేసే ప్రయాణికులకు లేటు ఫీజు చెల్లిస్తామని చెప్పటాన్ని ఊహించగలమా?

ఇటీవల పట్టాలెక్కిన తేజస్ ట్రైన్ కు సంబంధించిన ఆసక్తికర ప్రకటనను విడుదల చేసింది. లక్నో నుంచి ఢిల్లీ మధ్య ప్రయాణించే ఈ ట్రైన్ కానీ చెప్పిన టైంకు గమ్యస్థానానికి చేరని పక్షంలో ప్రయాణికులకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించి సంచలనంగా మారింది ఐఆర్ సీటీసీ. అక్టోబరు ఆరు నుంచి మొదలైన తేజస్ ప్రయాణం.. ఈ నెల 19న అనూహ్యంగా మూడు గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంది. దీంతో.. ఈ ట్రైన్ లేటుకు పరిహారాన్ని తన ప్రయాణికులకు అందించింది.

రైలు ఆలస్యానికి ప్రయాణికులకు పరిహారం చెల్లించటం దేశంలో ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం తేజస్ రైలు చెప్పిన టైం కంటే గంటకు పైగా ఆలస్యమైతే ఒక్కో ప్రయాణికుడికి రూ.100చొప్పున.. అదే రెండు గంటలకు పైగా ఆలస్యమైతే రూ.250 చొప్పున చెల్లిస్తామని ఐఆర్ సీటీసీ ప్రకటించింది.

అక్టోబరు 19న లక్నోనుంచి ఢిల్లీకి బయలుదేరిన తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు షెడ్యూల్ ప్రకారం మధ్యామ్నం 12.25 గంటలకు చేరుకోవాలి. కానీ.. ఇది కాస్తా మధ్యామ్నం 3.40 గంటలకు చేరుకుంది. తేజస్ ఆలస్యానికి కారణం కాన్ పూర్ ప్రాంతంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పటంగా చెబుతున్నారు. రిటర్న్ లోనూ గంటన్నర ఆలస్యంగా చేరుకుంది. దీంతో.. లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లిన 450 మంది ప్రయాణికులకు రూ.250 చొప్పున.. లక్నోనుంచి ఢిల్లీకి జర్నీ చేసిన 500 మందికి రూ.వంద చొప్పున పరిహారాన్ని చెల్లించారు. మొత్తంగా రూ.1.62 లక్షలు ఆలస్యానికి పరిహారాన్ని చెల్లించింది. ఇప్పుడీ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. తేజస్ మాదిరి అన్ని రైళ్లలో ఇదే విధానాన్ని ప్రవేశ పెడితే ఎంత బాగుండో కదా?