Begin typing your search above and press return to search.

మాకు డిపాజిట్టు కూడా రాదేమో: టీడీపీ నేత‌

By:  Tupaki Desk   |   24 April 2018 11:51 AM GMT
మాకు డిపాజిట్టు కూడా రాదేమో: టీడీపీ నేత‌
X
ఆళ్లగడ్డ నియోజకవర్గం రాజ‌కీయ ర‌చ్చ ర‌చ్చ‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఏపీ టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ సీనియ‌ర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య నెల‌కొన్న విబేధాలు ఏకంగా దాడులు చేసుకునే వ‌ర‌కు చేరాయ‌ని పార్టీ వ‌ర్గాలే అంగీక‌రిస్తున్నాయి. ఇదే విష‌యాన్ని పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు ఇరిగెల రాంపుల్లారెడ్డి బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. అంతేకాకుండా వారి మూలంగా త‌మ‌కు డిపాజిట్లు కూడా ద‌క్క‌వేమోన‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం విశేషం. పార్టీ పెద్ద‌లు ఇప్ప‌టికైనా జోక్యం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

త‌మ స‌త్తా చాటుకునేందుకు నియోజ‌క‌వ‌ర్గంలో అఖిలప్రియ - సుబ్బారెడ్డి పోటాపోటీ సైకిల్ యాత్రలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రుద్రవరం మండలం ముత్తలూరు - నర్సాపురంలో అఖిలప్రియ - ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరులో ఏవీ సుబ్బారెడ్డి సైకిల్‌ యాత్ర చేస్తుండ‌గా...ఆదివారం సుబ్బారెడ్డిపై దాడి జ‌రిగింది. ఈ ఘటనపై ఆళ్లగడ్డ డీఎస్పీకి సుబ్బారెడ్డి ఫిర్యాదు చేయ‌డంతో ఆహోబిలానికి చెందిన సంజీవరాయుడు - చింతకుంటకు చెందిన రాముతో పాటు మరో పదిమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై దాడి జరిగిన పార్టీ శ్రేయస్సు కోసం సర్దుకుపోతామని సుబ్బారెడ్డి చెబుతున్నారు. ఆదివారం జరిగిన దాడి ఘటనను అఖిలప్రియ ఖండించారు. ఎవరిపైనా దాడి చేయించాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు.

కాగా, తాజాగా జ‌రిగిన స‌మావేశంలో ఈ ప‌రిణామాల‌పై ఆళ్ళగడ్డ నియోజకవర్గ టీడీపీ మాజీ ఇంచార్జీ ఇరిగెల రాంపుల్లారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మంత్రితో పాటు సుబ్బారెడ్డి పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టారని రాంపుల్లారెడ్డి విమర్శలు గుప్పించారు. పరస్పరం గొడవలు పెట్టుకోవడం - పోటాపోటీ ర్యాలీలు - దీక్షలు చేయడంతో పార్టీ తీవ్రంగా నష్టపోతోందని వాస్త‌వ ప‌రిస్థితిని వెల్ల‌డించారు. ఈ వివాదాలు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడ దక్కవన్నారు. అందుకే ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల‌ని కోరారు. కాగా, నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న వర్గవిభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వారం రోజుల క్రితమే ఏవీ - అఖిల ప్రియ వర్గీయుల తో చంద్రబాబు చర్చలు జరిపి విభేదాలు వీడి పార్టీ కోసం పని చేయాలన్న సూచించారు. కానీ విభేదాలు వీడని నాయకులు ఆదివారం వీదిన పడ్డారు. మంగ‌ళ‌వారం వారితో భేటీ కావాల్సి ఉన్న‌ప్ప‌టికీ ఇత‌ర‌త్రా కార్యాక్ర‌మాలు ఉండటం వ‌ల్ల చంద్ర‌బాబు మంత్రి అఖిల‌ప్రియ‌, సీనియ‌ర్ నేత సుబ్బారెడ్డితో భేటీ కాలేక‌పోయారు.