Begin typing your search above and press return to search.

3.6కోట్ల అమెరిక‌న్లను వ‌ణికిస్తున్న ఇర్మా

By:  Tupaki Desk   |   11 Sep 2017 3:50 AM GMT
3.6కోట్ల అమెరిక‌న్లను వ‌ణికిస్తున్న ఇర్మా
X
ప్ర‌పంచానికి పెద్ద‌న్న అయినా.. ప్ర‌కృతి ముందు ప‌సిపాపేన‌న్న వాస్త‌వం మ‌రోసారి నిరూపిత‌మైంది. ప్ర‌కృతి ప్ర‌కోపంతో అగ్ర‌రాజ్యం అమెరికా విల‌విల‌లాడిపోతోంది. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు బ‌ల‌మైన హ‌రికేన్లు అమెరికాపై విరుచుకు ప‌డ్డాయి. మొన్న‌టికి మొన్న హార్వీ హ‌రికేన్ తో విల‌విల‌లాడిన అగ్ర‌రాజ్యాన్ని ఇప్పుడు ఇర్మా గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. వాతావ‌ర‌ణ నిపుణుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ఆదివారం ఉద‌యం ఫ్లోరిడాలోని కీస్ వ‌ద్ద ఇర్మా తీరాన్ని తాకింది. 12 గంట‌ల పాటు హ‌రికేన్ తీవ్ర‌త మూడోస్థాయికి త‌గ్గిన‌ట్లే క‌నిపించినా.. మ‌ళ్లీ నాలుగో స్థాయి పెను తుపానుగా బ‌లం పుంజుకొని గంట‌కు 8 మైళ్ల వేగంతో వాయువ్య దిశ‌గా ముందుకు వెళుతోంది.

ఫోరిడా స్టేట్ తో పాటు.. మ‌రికొన్నిప్రాంతాలపై త‌న పంజా విసిరిన ఇర్మా హ‌రికేన్ విస్తీర్ణం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. దీని విస్తీర్ణం 350 - 400 మైళ్లు అని.. దాని క‌న్ను ఒక్క‌టే 25 నుంచి 65కిలోమీట‌ర్లు ఉంటుంద‌ని చెబుతున్నారు. కీస్ న‌గ‌రానికి ఆగ్రేయంగా 24 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న దీని ప్ర‌భావంతో మియామీ.. ఫోర్డ్ లాడెర్ డేల్‌.. తంపా ప్రాంతాలు ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లు చెబుతున్నారు.

ఫ్లోరిడాలో ఉంటున్న 1.20ల‌క్ష‌ల మంది భార‌తీయ అమెరిక‌న్ల‌లో వేలాదిమంది ఇర్మా బాధిత ప్రాంతంలో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న వారిని ఇళ్లు ఖాళీ చేయాల‌ని హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఇళ్లు వ‌దిలి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లారు.

హ‌రికేన్ ధాటికి పెద్ద పెద్ద వృక్షాలు సైతం చీపురుపుల్ల‌ల్లా విరిగిప‌డుతున్నాయి. ప‌లు ప్రాంతాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. ఫ్లోరిడాలోని చాలాభాగం చిమ్మ చీక‌టిలో చిక్కుకుపోయింది. విద్యుత్ స‌ర‌ఫరా నిలిచిపోవ‌టంతో 24 కౌంటీల్లో ఉన్న 13.5 ల‌క్ష‌ల మంది తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. ఇర్మా ధాటికి మియామీ.. తంపా ప‌ట్ట‌ణాల ప్ర‌జ‌లు ఇళ్ల‌ను వ‌దిలి బ‌య‌ట‌కు రావొద్ద‌ని పోలీసులు ప‌దే ప‌దే కోరుతున్నారు. మ‌నాటీ కౌంటీలో అధికారులు ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి 24 గంట‌ల పాటు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంద‌ని పేర్కొన్నారు.

కేప్ సేబుల్‌.. కేఫ్టివా వంటి ప్రాంతాల్లో కెరటాలు 15 అడుగుల ఎత్తున ఎగిసిప‌డే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌క‌టించారు. ఇది ప్రాణాంత‌క‌మైన ప‌రిస్థితి అని.. కీస్ న‌గ‌రంలో సుర‌క్షిత‌మైన ప్రాంతం ఏమీ లేదంటూ తేల్చేసింది. ఫ్లోరిడా తీర‌మంతా 10 నుంచి 15 అడుగుల ఎత్తు నీటిలో మునిగిపోయే ప్ర‌మాదం ఉంద‌ని చెబుతున్నారు. ఒకే ఏడాదిలో నాలుగోస్థాయి తుపానులు రావ‌టం అమెరికాకు ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

ఇర్మా తీవ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకున్న అధికారులు ఫ్లోరిడాలోని దాదాపు 63 ల‌క్ష‌ల ప్ర‌జ‌ల్ని ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఒక‌వేళ ఇంట్లో ఉండాల‌నుకోవ‌టం ఆత్మ‌హ‌త్య‌తో స‌మానంగా అభివ‌ర్ణిస్తున్నారు. ప‌రిస్థితి తీవ్ర‌త నేప‌థ్యంలో అమెరికాలోని భార‌త రాయ‌బార కార్యాల‌యం 24 గంట‌లూ న‌డిచే హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. ఇర్మా బాధిత ప్రాంతాల్లోని భార‌తీయ అమెరిక‌న్లు త‌మ ఇళ్ల త‌లుపుల్ని తెర‌చి.. బాధితుల‌కు సాయం చేస్తున్నారు. ప్ర‌వాస భార‌తీయుల సంఘాల వారు పున‌రావాస కేంద్రాల్ని తెరిచారు. దేవాల‌యాల్లోనూ తాత్కాలికంగా ఆశ్ర‌యాన్ని ఇస్తున్నారు.

ఇర్మా సృష్టించే విల‌యం నేప‌థ్యంలో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మ‌రోసారి దీనిపై రివ్యూ నిర్వ‌హించారు. తీవ్ర విధ్వంస‌శ‌క్తితో కూడిన హ‌రికేన్ ఈసారి వ‌చ్చింద‌ని.. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్ర‌భుత్వ అధికారుల నుంచి వ‌చ్చే ప్ర‌తి ఆదేశాన్ని త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ట్రంప్ కోరారు. ఇర్మా పెను తుపాన‌ని.. దాని తీవ్ర‌త కార‌ణంగా ఎవ‌రి ప్రాణాలైనా పోయే ప్ర‌మాదం ఉంద‌ని.. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పెను తుపాను నుంచి వెళ్లిపోవాల‌ని ఫ్లోరిడా గ‌వ‌ర్న‌ర్ రిక్ స్కాట్ చెబితే.. ఇర్వీ కార‌ణంగా బీభ‌త్సం త‌ప్ప‌ద‌ని.. దీని నుంచి త‌ప్పించుకునే దారేమీ లేద‌ని యూక్యువెద‌ర్ వెల్ల‌డించింది.

సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లే ప్ర‌జ‌లు.. వారి వాహ‌నాల‌తో నేష‌న‌ల్ హైవేలు కిక్కిరిసిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చ‌మురు కొర‌త వెంటాడుతోంది. విప‌త్తు నేప‌థ్యంలో అసాంఘిక శ‌క్తులు.. షాపులపై దాడులు చేస్తూ.. సామాన్లను లూటీ చేస్తున్నారు. ఇర్మా దెబ్బ‌తో డిస్నీ వ‌ర‌ల్డ్‌.. యూనివ‌ర్శ‌ల్ స్టూడియో లాంటివి ఆదివారం మూత‌ప‌డ్డాయి.

అమెరికాలో ఇర్మా తీవ్ర‌త ఈ స్థాయిలో ఉంటే.. ఇప్ప‌టికే ఇర్మా ఎఫెక్ట‌కు గురైన క్యూబా ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంద‌ని చెప్పాలి. వేలాది ఇళ్లు తుపాను ధాటికి దెబ్బ తిన‌గా..తీరం వెంట ఇళ్లు నీళ్ల‌లో మునిగిపోయాయి. ఉత్త‌ర క్యూబాలో విరిగిన చెట్లు.. విద్యుత్ స్తంభాల కార‌ణంగా పెద్ద ఎత్తున ఇళ్లు ధ్వంస‌మ‌య్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్ర‌ళ‌యం వ‌చ్చిన‌ప్పుడు భారీ ఎత్తున నీళ్ల‌ల్లో న‌గ‌రం చిక్కుకున్న‌ట్లుగా సినిమాల్లో చూపించే దృశ్యాల్ని త‌ల‌ద‌న్నేలా ప‌రిస్థితి ఉంద‌ని చెబుతున్నారు. ప్ర‌భుత్వం ముంద‌స్తుగా స్పందించి.. జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టంతో క్యూబాలో మృతుల సంఖ్య లేన‌ప్ప‌టికీ.. భారీ ఆస్తి న‌స్టం వాటిల్లింద‌ని చెప్పొచ్చు. విద్యుత్.. క‌మ్యూనికేష‌న్ల వ్య‌వ‌స్థ‌కు తీవ్ర విఘాతం ఏర్ప‌డింది. క్యూబా సైనికులు ఇర్మా బాధిత ప్ర‌జ‌ల్ని త‌ర‌లించే ప‌నిలో నిమ‌గ్న‌మై ఉన్నారు. బాధితుల కోసం ప్ర‌భుత్వ కార్యాల‌యాలు.. స్కూళ్ల‌ల్లో నివాసాల్ని ఏర్పాటు చేశారు. ఈ మ‌ధ్య‌నే ప్ర‌భుత్వం నిర్మించిన రిసార్ట్స్ లో ఉన్న 5వేల మంది ప‌ర్యాట‌కుల్ని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఇర్మా కార‌ణంగా క్యూబాకు క‌లిగిన న‌ష్టం లెక్క తేల్చ‌టానికి మ‌రింత స‌మ‌యం ప‌డుతుంద‌ని చెబుతున్నారు.