Begin typing your search above and press return to search.

రాజకీయాల‌కు ఉక్కు మ‌హిళ గుడ్ బై

By:  Tupaki Desk   |   11 March 2017 5:00 PM GMT
రాజకీయాల‌కు ఉక్కు మ‌హిళ గుడ్ బై
X
ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల ఫలితాల వ‌ల్ల మ‌నం వినాల్సి వ‌చ్చిన దుర్వార్త ఇది. మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ చాను షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఓటమి చవిచూడడంతో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. రాజ‌కీయాల్లోకి దిగి త‌న రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌ని భావించిన ష‌ర్మిల‌కు నోటా కంటే త‌క్కువ ఓట్లు రావ‌డంతో క‌లత చెంది ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు భావిస్తున్నారు.

నవంబరు 2, 2000 సంవత్సరంలో మణిపూర్‌లోని మాలోం అనే పట్టణంలో బస్సుకోసం వేచి చూస్తున్న పౌరులపై అస్సాం రైఫిల్స్‌కి చెందినవారుగా భావిస్తున్న సిబ్బంది విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 10 మంది అమాయకులు మృతి చెందారు. పౌరహక్కుల కార్యకర్త అయిన 28 ఏళ్ల షర్మిల ఈ దారుణ సంఘటన పట్ల తీవ్రంగా స్పందించారు. వెంటనే నిరాహారదీక్షకు ఉపక్రమించారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేసిన షర్మిల చ‌రిత్ర సృష్టించారు. ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే వర్తించే సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం తొలగించమని ఆమె డిమాండ్‌ చేశారు. ఎవరిమీద ఏమాత్రం అనుమానం వచ్చినా సాయుధ దళాలు ఈ చట్టాన్ని వినియోగించుకోవచ్చు. దాంతో అత్యాచారాలు, అమానుషాలు పెచ్చుమీరి సాధారణ పౌరజీవనం తీవ్రంగా ఇబ్బందుల్లో పడుతోందని ఆరోపిస్తూ షర్మిల దీక్ష చేశారు. అయితే ఎన్నేళ్లైనా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గత ఏడాదే ఆమె దీక్ష విరమించి రాజకీయాల్లో పోరాడాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్ర‌మంలో పీఆర్‌ జేఏ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీచేశారు. తౌబల్‌ స్థానం నుంచి ఏకంగా సీఎం ఇబోబిసింగ్‌పైనే పోటీచేశారు. అయితే, ఈ పోరులో ఆమె ఘోరంగా ఓడిపోయారు. కేవలం 90 ఓట్లు మాత్రమే దక్కడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. త‌న ప్రయత్నం ఇంత ఘోరంగా విఫలం కావడంతో ఆమె రాజకీయాలకు వీడ్కోలు చెప్పేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/