Begin typing your search above and press return to search.

టీడీపీ తీరుపై ఆగ్ర‌హం: పోలవ‌రం ప్రాజెక్టు దుష్ప్ర‌చారంపై మంత్రి అనిల్ ఫైర్‌

By:  Tupaki Desk   |   29 Jun 2020 1:06 PM GMT
టీడీపీ తీరుపై ఆగ్ర‌హం: పోలవ‌రం ప్రాజెక్టు దుష్ప్ర‌చారంపై మంత్రి అనిల్ ఫైర్‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌ర‌ప్ర‌దాయినిగా మారిన పోలవరం ప్రాజెక్టుపై జ‌రుగుతున్న దుష్ప్ర‌చారం.. తెలుగుదేశం పార్టీ తీరుపై ఏపీ భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వారి తీరును ఖండిస్తూ మండిప‌డ్డారు. పోలవ‌రం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నివేదిక పంపలేదని కేంద్రం చెబితే.. పోలవరంలో టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతికి- రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చిందని ఓ వర్గం మీడియాలో టీడీపీ ప్రచారం చేసుకోవడం బాధాకరమని తెలిపారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరెవరు ఎంతెంత అవినీతికి పాల్పడ్డారో మొత్తం బయటకు వస్తుందని పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో సోమ‌వారం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప‌ర్య‌టించి నిర్వాసితుల‌తో మాట్లాడారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఎక్స్ పర్ట్ కమిటీని వేశామ‌ని దానిపై విజిలెన్స్ నివేదిక ఇంకా రాలేదని స్ప‌ష్టం చేశారు. అందుకే కేంద్రానికి ఇంకా స‌మ‌ర్పించ‌లేద‌ని వివ‌రించారు. సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు చేసిన ఫిర్యాదుకు కేంద్రం కూడా ఇదే సమాధానం చెప్పిందని గుర్తుచేశారు. దీన్ని తెలుగుదేశం పార్టీ, ఆ వర్గం మీడియా తమకు అనుకూలంగా మలచుకుని ప్రచారం చేసుకుంటోంద‌ని ఆరోపించారు. దీనిలో ఎటువంటి వాస్తవం లేదని, పనిలో పనిగా పోలవరంతోపాటు పట్టిసీమను కూడా కలిపేసుకుని అందులో కూడా అవినీతి జరగలేదని ఓ వర్గం మీడియా రాయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది ముమ్మాటికీ తప్పు అని పేర్కొన్నారు. పట్టిసీమలో రూ. 300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని కాగ్ నివేదికలోనే బట్టబయలైందని, దానిని కూడా దాచిపెడతారా..? అని ప్రశ్నించారు.

తాము అధికారంలోకి వ‌చ్చాక రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చి పోలవరంలో ఇప్పటికే రూ.800 కోట్లు ఆదా చేశామని మంత్రి అనిల్ గుర్తుచేశారు. తెలుగుదేశం హయాంలో నామినేషన్ల పద్ధతిలో పనులు కేటాయించి నిధులు దుర్వినియోగం చేస్తే తాము రివర్స్ టెండరింగ్ విధానంతో ప్రభుత్వానికి ఆదా చేశామ‌ని వివ‌రించారు. మీరు గతంలో రూ.800 కోట్లు ఎక్కువకి నవయుగకు పనులు కట్టబెట్టారని అంగీకరిస్తారా అని టీడీపీ నాయ‌కుల‌కు ప్రశ్నించారు. చౌకబారు విమర్శలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలకు మెదడు మోకాళ్ల‌లోనో.. అరికాళ్ల‌ల్లో ఉందో అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో కేటాయించిన పనుల కంటే రూ.800 కోట్లు ఆదా చేస్తే అది అవినీతి అవుతుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులను తమకు కావాల్సిన వారికి నామినేషన్ పద్ధ‌తిలో పనులు కట్టబెట్టి వెయ్యి.. రెండు వేల కోట్లు కొట్టేశారని ఆరోపించారు.

ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు, ఆయన హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు అబద్ధాలు చెబుతున్నారని మంత్రి అనిల్ తెలిపారు. రూ.55 వేల కోట్ల నిర్మాణ పనుల్లో రూ.17 వేల కోట్లు చేసి 70 శాతం పూర్త‌యిందని ఎలా చెబుతారని నిలదీశారు. నిర్వాసితులకు సంబంధించి ఒక్క ఇల్లును కూడా మార్చకుండా.. నిద్రపోయారని మండిప‌డ్డారు. ప‌నులు చేయ‌కుండా ఇప్పుడు మా మీద నిందలు వేయటం సిగ్గు మాలిన పని అని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌స్తుత ఆప‌త్కాలంలోనూ 50 శాతం వరకూ పనులు చేస్తున్నట్లు తెలిపారు.

పోలవరం అంటే ఒక డ్యామ్ కాదు.. దానితో పాటు 1.10 లక్షల కుటుంబాలు అని కూడా ముఖ్యమంత్రి జగన్ చెప్పారని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు ఎంత ముఖ్యమో.. లక్షా పది వేల మంది నిరాశ్రయులకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రూ.33 వేల కోట్లతో వారికి పునరావాసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే 17 వేల కుటుంబాలు మార్చబోతున్నామ‌ని, వారికి పునరావాసం కల్పించబోతున్నట్లు వివ‌రించారు. కాఫర్ డ్యామ్ నిర్మించే లోపు 17 వేల కుటుంబాలను జులై నెలాఖరుకు లేదా ఆగస్టు మొదటి వారానికి మార్చబోతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తయ్యే లోపల మొత్తం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. టీడీపీ నాయ‌కులు అనుభవం లేని వాళ్ల‌మ‌ని మాట్లాడుతున్నారని.. మీరు అనుభవం ఉండి ఏం ఉద్ధ‌రించారని మంత్రి ప్రశ్నించారు. అనుభవం లేకపోయినా.. యువకులం, చదువుకున్నవాళ్ల‌మ‌ని.. అందుకే ప్రతి పనినీ సమర్థవంతంగా చేస్తూ ప్రభుత్వ డబ్బు ఆదాతో పాటు ప్రజలకు మంచి చేస్తున్నట్లు తెలిపారు. మిగతా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్ప‌ష్టం చేశారు.