Begin typing your search above and press return to search.

బలమైన మంత్రివర్గం రాబోతోందా...?

By:  Tupaki Desk   |   26 March 2022 11:30 PM GMT
బలమైన మంత్రివర్గం రాబోతోందా...?
X
ఏపీలో మంత్రి వర్గ విస్తరణ ఊసులే అంతటా వినిపిస్తున్నాయి. కొత్త మంత్రివర్గం రూపూ రేఖా అన్నీ కూడా జగన్ మనసులోనే ఉన్నాయి. 2024లో షెడ్యూల్డ్ మేరకు సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. తప్పనిసరిగా మరొక‌సారి వైసీపీ గెలవాల్సిన అవసరం అయితే ఉంది.

దాంతో ముఖ్యమంత్రి దీని మీదనే భారీ కసరత్తు చేస్తున్నారుట. ఏపీలో ఏర్పడబోయేది బలమైన మంత్రివర్గం అని అంటున్నారు. అంటే నోరున్న నేతలే ఈసారి మంత్రులుగా రాబోతున్నారు అని అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను జనాలలో పెద్ద ఎత్తున తీసుకెళ్ళడం ద్వారా వారు వైసీపీకి సానుకూలతను తీసుకువస్తారని ఆశించే ఈ ఎంపిక అంటున్నారు.

మరి ప్రస్తుత ప్రభుత్వంలో బలమైన మంత్రులు లేరా అంటే ఉన్నారు, కానీ కొందరు మాత్రమే నోరు విప్పుతున్నారు. చాలా మంది సైలెంట్ గా ఉంటున్నారు. విపక్షాలు ఏ ఆరోపణ చేసినా ఏ శాఖకు చెందినా కూడా కొందరు మాత్రమే దానిని తిప్పికొడుతున్నారు.

మరి మిగిలిన వారు మాత్రం తమ పనేంటో తామేంటో అన్నట్లుగా ఉన్నారు. తొలి మంత్రివర్గం కాబట్టి జగన్ కూడా పెద్దగా మొదట్లో పట్టించుకోలేదు. ఆఖరుకు అదే చాలా మందికి అలవాటు అయింది. ఇక మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని తెలియగానే చాలా మంది తగ్గిపోయారు.

అందుకే ఇపుడు కొత్తగా మంత్రులు అయ్యే వారు ఇక మీదట జనంలో ఉంటారని అంటున్నారు. అలాగే విపక్షాలకు ధాటీగా జవాబు చెప్పే వారు కూడా వస్తారట.

దాంతో ఇపుడు కొత్త మంత్రుల అర్హతలు బయటకు వస్తూండడంతో ఆ ఆర్కే రోజా, అంబటి, గుడివాడ అమరనాధ్, ధర్మాన ప్రసాదరావు వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి బలమైన మంత్రులు అంటే ఇంకా ఎవరెవరు ఉన్నారో చూడాల్సి ఉంది.