Begin typing your search above and press return to search.

ఇదంతా శరద్ పవార్ గేమా? గందరగోళమా?

By:  Tupaki Desk   |   26 Nov 2019 9:45 AM GMT
ఇదంతా శరద్ పవార్ గేమా? గందరగోళమా?
X
మహారాష్ట్ర రాజకీయం పై శరద్ పవార్ మరోసారి పట్టు నిలుపుకున్నట్టుగా కనిపిస్తున్నాడు. తన పార్టీని చీల్చాలని భారతీయ జనతా పార్టీ చేసిన ప్రయత్నాన్ని ఆయన విజయవంతంగా తిప్పి కొట్టినట్టుగానే కనిపిస్తోంది. ఎన్సీపీ నుంచి బయటకు వెళ్లినట్టుగానే వెళ్లిన అజిత్ పవార్ ఇప్పుడు తిరిగి వచ్చినట్టే. బీజేపీ ఇచ్చిన డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. శరద్ పవార్ కుటుంబీకుల దౌత్యం అలా ఫలితాన్ని చూపించింది.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో శరద్ పవార్ పాత్రే బోలెడన్ని అనుమానాలను రేకెత్తిస్తూ ఉందని విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి ఈ గందరగోళం తలెత్తడానికి కారణమే శరద్ పవార్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

ఢిల్లీలో సోనియాగాంధీని కలవడానికి అంటూ వెళ్లిన శరద్ పవార్ అక్కడ అంతటితో ఆగకుండా, వెళ్లి మోడీతో సమావేశం అయ్యారు. అక్కడ నుంచి ఊహాగానాలు రేగాయి. మహారాష్ట్ర రాజకీయంలోనూ మార్పు కనిపించింది. బీజేపీతో శరద్ పవార్ ఒప్పందం చేసుకున్నారనే ఊహాగానాలకు ఆ సమావేశం అవకాశం ఇచ్చింది.

ఆ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారో కానీ, చాలా మంది పవార్ ను అనుమానించడం మొదలుపెట్టారు. ఆ వెంటనే అజిత్ పవార్ తిరుగుబాటు జరిగింది. వెళ్లి బీజేపీతో చేతులు కలిపాడు. అదంతా చూసి శరద్ పవార్ ఆశీస్సులతోనే అజిత్ పవార్ వెళ్లాడనే అభిప్రాయాలు వినిపించాయి. చాలా మంది శరద్ పవార్ ను అలా అనుమానించారు. బీజేపీ, పవార్ లు కలిసి గేమ్ ఆడుతున్నారనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

అయితే కొంత ప్రతిష్టంభన, సుప్రీం కోర్టు జోక్యం అనంతరం ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. అజిత్ పవార్ రాజీనామాతో ఎన్సీపీలో టీ కప్పులో తుఫాన్ చల్లారినట్టుగా అయ్యింది. ఈ నేపథ్యంలో ఇదంతా శరద్ పవార్ గేమ్ అనే వాళ్లూ ఉన్నారు. ఆ గేమ్ సంగతేమో కానీ, గందరగోళాన్ని రేపింది మాత్రం ఈ వృద్ధ నేతే అని స్పష్టం అవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.