Begin typing your search above and press return to search.

అమిత్ షా దూకుడు బీజేపీ కి లాభమా? నష్టమా?

By:  Tupaki Desk   |   23 Dec 2019 4:14 AM GMT
అమిత్ షా దూకుడు బీజేపీ కి లాభమా? నష్టమా?
X
అమిత్ షా.. దేశంలోనే రెండో పవర్ ఫుల్ నేత. మోడీ మొదటి కేబినెట్ లో ఆయన లేక పోవడంతో అండ లేని మోడీ అంతగా సాహసోపేత నిర్ణయాలు తీసుకోలేదు. ప్రధాని పదవి కొత్త కావడం.. పైగా రాజ్యసభలో బీజేపీ కి బలం లేక పోవడంతో నాడు బిల్లుల విషయంలో మోడీ ఆచితూచి అడుగులు వేసేవారు.

కానీ ఐదేళ్లు గడిచాయి. మోడీ రెండోసారి ప్రధాని అయ్యారు. మోడీ కి గుట్టుమట్లు అన్ని తెలిసాయి. గండర గండరుడు లాంటి అమిత్ షా ఏకంగా ప్రధాని తర్వాత కీలకమైన హోంమంత్రి పగ్గాలు చేపట్టారు. దీంతో వీరి ద్వయం కొరఢా ఝలిపిస్తోంది. పట్టపగ్గాలు లేకుండా తమకు ఓట్లేసిన గెలిపించిన హిందుత్వ వాదులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ నిర్ణయాల తో తమను టచ్ చేసే వారు లేరని అమిత్ షా బీరాలకు పోయాడు..

కానీ ఇప్పుడేమైంది. దేశ వ్యాప్తంగా పౌరసత్వ మంటలు అంటుకున్నాయి. ఆ సెగ అమిత్ షాకు, మోడీ కి బాగానే తగులుతోంది. అందుకే ఢిల్లీ సభలో మోడీ ఎన్ఆర్సీపై వెనక్కి తగ్గారు. పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లింలు, ఇతర వర్గాలకు విడమర్చి చెప్పి వేడుకున్నారు. వదంతులు నమ్మ వద్దని కోరారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ కి అమిత్ షా బలం నుంచి బలహీనత గా మారారని విశ్లేషకులు చెబుతున్నారు. అమిత్ షా దూకుడు వల్లే బీజేపీ డిఫెన్స్ లో పడిపోయిందంటున్నారు. పౌరసత్వ సవరణ చట్టం తెచ్చినప్పుడు అందులోని అంశాలు దేశంలోని మైనార్టీల కు చేటు కావని చాటడం లో అమిత్ షా నిర్లక్ష్యం ఆయా వర్గాల్లో ఆగ్రహాని కి కారణమైంది. రోడ్డున పడి ఆందోళనలు చేసేలా చేసింది. షా దూకుడైన మాటతీరు.. బిల్లుల పాస్ లో దుందుడుకు స్వభావం ప్రదర్శించారు.తమకు దేశంలో ఎదురేలేదని వ్యవహరించిన తీరుతో ఆయా వర్గాలు భగ్గుమన్నాయి. నింపాదిగా అందరికీ అర్థమయ్యేలా అయోధ్య వివాదం లో వ్యవహరించినట్టు సమస్యను పరిష్కరిస్తే పోయేది. కానీ పార్లమెంట్ సాక్షిగా, బయట అమిత్ షా చేసిన ప్రకటనలతో మైనార్టీల్లో అభద్రత భావం ఏర్పడి ఇప్పుడీ ఉపద్రవానికి కారణమైంది. మొత్తం పౌరసత్వ రణంలో అమిత్ షా దూకుడే బీజేపీకి నష్టం చేకూర్చిందన్న వాదన వినిపిస్తోంది.