Begin typing your search above and press return to search.

అధ్యక్షుడిగా ఎవరున్నా ఒకటేనా ?

By:  Tupaki Desk   |   11 July 2021 4:48 AM GMT
అధ్యక్షుడిగా ఎవరున్నా ఒకటేనా ?
X
క్షేత్రస్ధాయిలో పునాదులు కూలిపోయిన తర్వాత పార్టీకి అధ్యక్షుడిగా ఎవరుంటే ఏమిటి ? ఇది తెలంగాణాలో టీడీపీ పరిస్ధితి. పార్టీ అధ్యక్షునిగా ఎల్ రమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన ఈరోజో రేపే టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఆయన స్ధానంలో ఎవరిని అధ్యక్షునిగా నియమించాలనే విషయమై జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో రావుల చంద్రశేఖరరెడ్డి, బక్కిన నర్సింహులు, కొత్తకోట దయాకర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ పేర్లు ప్రస్తావనకు వచ్చింది. నిజానికి ఈ ముగ్గురు నేతలు కూడా పార్టీలో కానీ జనాల్లో కానీ అంత పట్టున్న నేతలు కాదు. పార్టీ పరిస్ధితి బ్రహ్మాండంగా ఉన్న రోజుల్లో కూడా పార్టీ గాలుంటే గెలుపు లేదా ఓటమే అన్నట్లుగా ఉండేది వీళ్ళ పరిస్ధితి. వీళ్ళల్లో కూడా రావుల మాత్రమే ఒకసారి ఎంఎల్ఏగా పనిచేశారు. మరోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇక మిగిలిన వాళ్ళ కొత్తకోట ఒక్కరే కాస్త జనాల్లో పట్టున్న నేత.

క్షేత్రస్ధాయిలో పార్టీల పరిస్ధితిని గమనిస్తే టీడీపీ పరిస్దితి గురించి మాట్లాడుకోవటం కూడా దండగే. ఎందుకంటే చంద్రబాబే పార్టీని వదిలిపెట్టేశారు. ఓటుకునోటు దెబ్బకు చంద్రబాబు ఎప్పుడైతే తెలంగాణాను, పార్టీని వదిలిపెట్టేశారో అప్పుడే డౌన్ ఫాల్ మొదలైపోయింది. దాంతో పార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు కూడా తమదారి తాము చూసుకుని టీఆర్ఎస్ లో కలిసిపోయారు.

మొన్నటి గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపికి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. ప్రస్తుత రాజకీయాల్లో పార్టీకున్న సీట్లపైనే భవిష్యత్తు ఆధారాపడుంటోంది. ఒక్క సీటు కూడా లేకపోయినా పర్వాతలేదు చంద్రబాబు ఇక్కడే కూర్చుని యాక్టివ్ రాజకీయాలు చేస్తుంటే పార్టీ పరిస్ధితి మరోరకంగా ఉండేదేమో. కేసీయార్ పేరు ప్రస్తావించేందుకు భయపడి ఏకంగా పార్టీనే వదిలేసిన కారణంగా పార్టీ పరిస్దితి శిధిలావస్తకు చేరుకునేసింది.

ఇపుడున్న నేతల్లో చాలామంది ఇతర పార్టీల్లోకి వెళ్ళే అవకాశం లేక ఇంకా టీడీపీలోనే కంటిన్యు అవుతున్నట్లుంది. పార్టీనే ప్రజల్లో గుర్తుంపుకోల్పోయిన తర్వాత ఇక నేతలుండి ఉపయోగం లేదు. కాబట్టి టీడీపీకి ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా ఒకటే.