Begin typing your search above and press return to search.

కశ్మీర్ మీద ప్రేమ చూపించే అసద్ ఆంధ్రా గురించి గమ్మున ఎందుకున్నట్లు?

By:  Tupaki Desk   |   14 Aug 2019 7:59 AM GMT
కశ్మీర్ మీద ప్రేమ చూపించే అసద్ ఆంధ్రా గురించి గమ్మున ఎందుకున్నట్లు?
X
దశాబ్దాలకు తరబడి రగులుతున్న కశ్మీరాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాలకు యావత్ దేశం మొత్తం నీరాజనాలు పలుకుతుంటే.. అందుకు భిన్నంగా కొందరు మాత్రం తప్పు పడుతున్నారు. అలాంటి వారిలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒకరుగా చెప్పాలి. ఆర్టికల్ 370 నిర్వీర్యం చేయటం.. 35ఏ అమల్లోకి లేకుండా చేసిన వైనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కశ్మీర్ విషయంలో కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినట్లుగా ఆయన మండిపడుతున్నారు. భారత్ లో జమ్ముకశ్మీర్ భాగమని.. ఎప్పటికి ఉంటుందన్న ఆయన.. అసెంబ్లీలో చర్చ లేకుండా రాష్ట్ర విభజన చేయటాన్ని తప్పు పడుతున్నారు. అసద్ ఆవేశం.. ఆగ్రహం.. ఆక్రోశంపై పలువురు తప్పు పడుతున్నారు. ఎక్కడో ఉన్న కశ్మీర్ గురించి ఇంతలా ఉడికిపోతున్న ఆయన.. తన పక్కనే ఉన్న ఆంధ్రా విషయంలో జరిగిన అన్యాయం పై ఎందుకు మాట్లాడలేదన్న ప్రశ్నను సంధిస్తున్నారు ఆంధ్రోళ్లు.

కశ్మీర్ లోనే కాదు.. ఆంధ్రాలోనూ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా విభజన జరిగింది. మరి.. ఆ విషయాన్ని ఇప్పటివరకూ ఎందుకు ప్రస్తావించటం లేదు. ఆంధ్రాలోని ప్రజలు పెద్ద ఎత్తున విభజనను వ్యతిరేకించటం.. అందులో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ముస్లింలంతా తెలుగువాళ్లు కలిసి ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి.. కశ్మీర్ లోని ముస్లిం ప్రజల ఆవేదనను అడ్రస్ చేసే అసద్.. ఆంధ్రా ప్రజల మనోభావాల్ని.. సెంటిమెంట్ల విషయంలో పట్టనట్లు ఎందుకు ఉంటున్నట్లు? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. కశ్మీర్ కు అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న అసద్.. మరి ఆంధ్రోళ్ల ఆవేదనను ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఎందుకు పట్టలేదు? వారి తరఫున మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నట్లు? తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించటమే తప్పించి.. ఎక్కడా ఒకేలాంటి స్టాండ్ లేని వైనం అసద్ లో కొట్టొచ్చినట్లుగా కనిపించకమానదు. ఇలాంటి వారు ముస్లిం ప్రయోజనాల కోసం ఎందుకు పోరాడుతున్నట్లు? ఎలా పోరాడుతున్నట్లు? ఒకవేళ పోరాడుతున్నది నిజమే అయితే.. ఆంధ్రా విషయంలో అసద్ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడనట్లు?