Begin typing your search above and press return to search.

రాజుగారు తగులుకున్నట్లేనా ?

By:  Tupaki Desk   |   1 July 2021 10:30 AM GMT
రాజుగారు తగులుకున్నట్లేనా ?
X
అనవసరంగా ప్రిస్టేజికి వెళ్ళి వివాదం మొత్తాన్ని అశోక్ గజపతిరాజు తన మెడకు తానే చుట్టుకుంటున్నారా ? ఇపుడిదే అనుమానం పెరిగిపోతోంది. ట్రస్టు ఆధ్వర్యంలో సంవత్సరాలుగా జరిగిన అవకతవకలు, అక్రమాలన్నీ ఇపుడు బయటపడుతున్నాయి. వేలాది ఎకరాల భూములు, కోట్లరూపాయల ఆస్తులు ట్రస్టు సొంతం. ఎప్పుడైతే ట్రస్టు ఛైర్మన్ గా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపి అశోక్ గజపతిరాజు స్ధానంలో ప్రభుత్వం సంచైత గజపతిరాజును ఛైర్ పర్సన్ గా నియమించిందో అప్పటినుండో ట్రస్టు వివాదం మొదలైంది.

ట్రస్టు ఛైర్మన్ గా తనను తొలగించటంపై అశోక్ కోర్టుకెక్కి మళ్ళీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్ గా తనను తొలగించిన దగ్గర నుండి ప్రభుత్వంపైనే కాకుండా సంచైత పైన కూడా అశోక్ బాగా నోరుపారేసుకున్నారు. అశోక్ కు మద్దతుగా చంద్రబాబునాయుడు, లోకేష్ లాంటి వాళ్ళు నిలవటంతో విషయం కాస్త రాజకీయ వివాదమైపోయింది. నిజానికి ప్రభుత్వాన్ని కాదని అశోక్ ఒక్క అడుగు కూడా ముందుకేయలేరు. ఇంతచిన్న విషయాన్ని మరచిపోయిన అశోక్ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు.

అయితే ట్రస్టు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం వినిపిస్తున్న ఆరోపణలపై విచారణ మొదలుపెట్టింది. ఈ విచారణలో ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన భూ సంతర్పణలు, అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. ముఖ్యంగా సింహాచలం దేవాలయంకు చెందిన 748 ఎకరాల భూములను ఇతరులకు కట్టబెట్టిన విషయం సంచలనంగ మారింది. ట్రస్టు పేరుతో ఉన్న వేలాది ఎకరాల భూముల్లో అత్యధికం టీడీపీ నేతల చేతుల్లోనే ఉందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.

దశాబ్దాల పాటు అశోక్ ఛైర్మన్ గా ఉన్నపుడే భూములన్నీ ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇతరులంటే ఇక్కడ టీడీపీ నేతలనే అర్ధం చేసుకోవాలి. గతంలో జరిగిన అక్రమాలన్నీ ఒకఎత్తు, 2014-19 మధ్యలో జరిగిన అక్రమాలు ఒకఎత్తు. మరి టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలకు అయితే చంద్రబాబు లేకపోతే అశోకే బాధ్యత వహించాలి. టీడీపీ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్న అధికారుల జాబితా బయటకువస్తోంది.

చంద్రబాబు సంగతి ఎలాగున్నా ట్రస్టు ఛైర్మన్ హోదాలో అశోక్ మాత్రం పూర్తిగా తగులుకున్నట్లే అనిపిస్తోంది. తన స్ధానంలో సంచైతను ఛైర్ పర్సన్ గా నియమించినపుడు అశోక్ మాట్లాడకుండా ఉండుంటే అక్రమాలపై ప్రభుత్వం కూడా ప్రిస్టేజిగా తీసుకునేదికాదేమో. తన హయాంలో జరిగిన అక్రమాలను వదిలేసి వైసీపీ ప్రభుత్వం హయాంలోనే అక్రమాలు జరుగుతున్నట్లు అశోక్ పదే పదే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. విచారణలో బయటపడుతున్న విషయాలు చూస్తుంటే అశోక్ బాగా తగులుకున్నట్లే ఉంది. చూద్దాం ఏమి జరుగుతుందో.