Begin typing your search above and press return to search.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బండి సంజ‌య్ పోటీ అక్క‌డ నుంచేనా?

By:  Tupaki Desk   |   27 Aug 2022 6:08 AM GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో బండి సంజ‌య్ పోటీ అక్క‌డ నుంచేనా?
X
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌స్తుతం క‌రీంన‌గ‌ర్ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థి బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ పై ఆయ‌న 89 వేల‌కు పైగా మెజారిటీతో గెలుపొందారు. ప్ర‌స్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా బీజేపీని అధికారంలో తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న ప్ర‌జా సంగ్రామ యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అధికార టీఆర్ఎస్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

కాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బండి సంజ‌య్ శాస‌న‌స‌భకు పోటీ చేస్తార‌ని చెబుతున్నారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని వేముల‌వాడ నుంచి ఆయ‌న పోటీ చేస్తార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గం ఉంది. ప్ర‌స్తుతం అక్కడ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చెన్న‌మ‌నేని ర‌మేష్ ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లోనూ చెన్న‌మ‌నేని ర‌మేషే గెలుపొందారు.

అయితే చెన్న‌మ‌నేని ర‌మేష్ పై పౌర‌స‌త్వ వివాదాలు ఉన్నాయి. ఆయ‌న స్థానికంగా నివాసం ఉండ‌టం లేద‌ని.. ఆయ‌న‌కు జ‌ర్మ‌నీ పౌర‌స‌త్వం ఉంద‌ని ఆయ‌న‌పై గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. భార‌త చ‌ట్టాల ప్ర‌కారం రెండు పౌర‌స‌త్వాలు ఉండ‌టం కుద‌ర‌ద‌ని కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న వేముల‌వాడ నుంచి బ‌రిలోకి దిగాల‌ని బండి సంజ‌య్ నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. 2018 ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థికి ఇక్క‌డ 6500 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. అయితే 2014లో మాత్రం బీజేపీ ఇక్క‌డ 53 వేల ఓట్ల‌కు పైగా సాధించింది.

మ‌రోవైపు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఐదోసారి సిరిసిల్ల నుంచే పోటీ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో రెండు పార్టీలు.. బీజేపీ, టీఆర్ఎస్ అధ్యక్షులు ఒకే జిల్లా నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.