Begin typing your search above and press return to search.

ఆ బీసీ ఎమ్మెల్యే జ‌గ‌న్‌కు షాకివ్వ‌బోతున్నారా?

By:  Tupaki Desk   |   28 July 2022 4:30 PM GMT
ఆ బీసీ ఎమ్మెల్యే జ‌గ‌న్‌కు షాకివ్వ‌బోతున్నారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కృష్ణా జిల్లా పెన‌మ‌లూరు ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సార‌ధి పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నారా అంటే నియోజ‌క‌వ‌ర్గంలో అవున‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌ల సీఎం వైఎస్ జ‌గ‌న్ రెండోసారి చేప‌ట్టిన‌ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో పార్థ‌సార‌ధికి మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రిగినా ప‌ద‌వి ద‌క్క‌లేదు. ఆ ప‌ద‌విని ప‌క్క నియోజ‌క‌వ‌ర్గం పెడ‌న ఎమ్మెల్యే జోగి రమేష్ త‌న్నుకుపోయారు. మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో పార్థ‌సార‌ధి అనుచ‌రులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ రోడ్లెక్కారు.

అప్ప‌టి నుంచి కొలుసు పార్థ‌సారధి పార్టీలో ఉన్నా లేన‌ట్టేగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారని చెబుతున్నారు. జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా అవ‌కాశం వ‌స్తుంద‌ని ఆశించినా ఇవ్వ‌లేద‌ని అంటున్నారు. అలాగే టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని ఆశించినా ద‌క్క‌పోవ‌డంతో కొలుసు పార్థ‌సార‌ధి తీవ్ర అసంతృప్తికి లోన‌య్యార‌ని నియోజ‌క‌వ‌ర్గంలో ప్రచారం జ‌రుగుతోంది.

కాగా పెన‌మలూరు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇన్చార్జిగా ఉన్న బోడే ప్ర‌సాద్‌కు ఈసారి సీటు ద‌క్క‌ద‌నే ప్ర‌చారం సాగుతోంది. బోడెకు ఎమ్మెల్సీగా కానీ లేదంటూ విజ‌య‌వాడ తూర్పు నుంచి అసెంబ్లీకి కానీ పోటీ చేయిస్తార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గ‌ద్దె రామ్మోహ‌న్ ను విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేయిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

కాగా గ‌తంలో 2004, 2009ల్లో ఉయ్యూరు, పెన‌మ‌లూరు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పార్థసార‌ధి విజ‌యం సాధించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విద్యా శాఖ మంత్రిగానూ ఆయ‌న ప‌నిచేశారు. ఆయ‌న‌ కుటుంబం మొద‌ట నుంచి టీడీపీలో ఉంది. పార్థ‌సారథి తండ్రి రెడ్డ‌య్య యాద‌వ్ గతంలో టీడీపీ త‌ర‌ఫున బంద‌రు ఎంపీగా కూడా గెలుపొంద‌డం విశేషం. అంతేకాకుండా చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన‌ప్పుడు 2009లో ఏలూరు ఎంపీగానూ రెడ్డ‌య్య యాద‌వ్ పోటీ చేశారు.

ఈ నేప‌థ్యంలో కొలుసు పార్థ‌సార‌ధి టీడీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని చెబుతున్నారు. అందులోనూ పెన‌మలూరు, అంత‌కుముందు ఉయ్యూరు నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న‌ప్పుడు ఎక్కువ ప‌ర్యాయాలు టీడీపీ అభ్య‌ర్థులే గెలుపొందారు. క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో అధికం. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్థ‌సారధి పెన‌మ‌లూరు నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

పార్థ‌సార‌ధి పార్టీని వీడ‌టం నిజ‌మైతే వైఎస్సార్సీపీకి గ‌ట్టి దెబ్బేన‌ని చెప్పొచ్చు. పార్థ‌సార‌ధికి సౌమ్యుడిగా, వివాద‌ర‌హితుడిగా పేరుంది. అందులోనూ కృష్ణా జిల్లాలో యాద‌వ సామాజిక‌వ‌ర్గం కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లంగానే ఉంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో పార్థ‌సార‌ధి పార్టీ వీడితే వైఎస్సార్సీపీకి గ‌ట్టి షాకేన‌ని అంటున్నారు.