Begin typing your search above and press return to search.

అసద్ ను బీజేపీ అంతలా మార్చేసిందా?

By:  Tupaki Desk   |   23 Dec 2019 4:09 AM GMT
అసద్ ను బీజేపీ అంతలా మార్చేసిందా?
X
హైదరాబాద్ మహానగరంలో అర్థరాత్రివేళ వరకూ సాగే రాజకీయ కార్యక్రమం ఏదైనా ఉందంటే అది కేవలం మజ్లిస్ కు చెందినది మాత్రమే ఉంటుంది. సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుందని అధికారికంగా చెప్పే ఈ కార్యక్రమం ఏకంగా అర్థరాత్రి ఒంటి గంట వరకూ సాగుతూ ఉంటుంది. ఇక.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అయితే ఏకంగా పదకొండు గంటల వేళలో వేదిక మీదకు వచ్చి తన సందేశాన్ని ఇచ్చేస్తుంటారు.

పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్న వేళ.. హైదరాబాద్ లో ఇదే అంశంపై వ్యతిరేకించే రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వటం లాంటివి కేవలం హైదరాబాద్ లో మాత్రమే సాధ్యమవుతాయేమో? సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేస్తారని.. మోడీ పరివారంపై నిప్పులు కురిపిస్తారని అంతా భావించారు.

అనుకున్నట్లే ఈ సభకు దాదాపు పాతికవేల మంది వరకూ హాజరు కావటం ఒక విశేషం అయితే.. అందరి అంచనాలకు భిన్నంగా మజ్లిస్ అధినేత తెలివైన రాజకీయ ప్రసంగం చేయటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఎప్పుడూ లేని రీతిలో ఆయన స్పీచ్ సాగినట్లుగా చెప్పక తప్పదు. అంతేకాదు.. ప్రతి ముస్లిం తన ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలన్న పిలుపునిచ్చారు.

భావోద్వేగంతో సాగిన తన ప్రసంగాన్ని జాతీయ గీతాలాపనతో ముగించిన వైనం ఆశ్చర్యపోయేలా చేసింది. అసద్ దేశభక్తిని ఎవరూ శంకించటం లేదు. ఎప్పుడూ చేయని రీతిలో ఆయన చర్య ఉండటానని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నామని చెప్పాలి. అసద్ ప్రసంగంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై బీజేపీ అధ్వర్యంలో మేధావుల సమావేశం జరగ్గా.. దానికి జీవీఎల్ హాజరయ్యారు. అసద్ తన ప్రసంగానని జాతీయ గీతంతో ముగించటం శుభపరిణామంగా పేర్కొన్నారు.

ఇళ్లపై జాతీయ జెండాల్ని ఎగురవేయాలని ఓవైసీ పిలుపునివ్వటానికి కారణం బీజేపీనే అని ఆయన వ్యాఖ్యానించారు. రోటీన్ కు భిన్నంగా సాగిన మజ్లిస్ అధినేత ప్రసంగం క్రెడిట్ ను తమ ఖాతాలో వేసేసుకుంటున్న జీవీఎల్ కాంగ్రెస్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. 1980లలో లక్షలాది మంది శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వాన్ని ఇవ్వటాన్నిప్రశ్నించారు. యూపీ.. ఢిల్లీ.. కర్ణాటకల్లో హింసకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని అభివర్ణించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేసిన గంలోనే రాహుల్ గాంధీ విడుదల చేసిన ప్రకటన కూడా అదే రీతిలో ఉంటాన్ని ప్రశ్నించారు.

మత రాజకీయాలకు అడ్డాగా హైదరాబాద్ మారిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు జీవీఎల్. తమ ఇమేజ్ కు పూర్తి భిన్నమైన తీరును ప్రదర్శించిన అసద్ వార్తల్లోకి వస్తే.. దాని క్రెడిట్ మొత్తం తమ పార్టీదేనని బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యపై అసద్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.