Begin typing your search above and press return to search.

గోవాలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు బీజేపీ వ‌ల వేస్తోందా?

By:  Tupaki Desk   |   11 July 2022 6:30 AM GMT
గోవాలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు బీజేపీ వ‌ల వేస్తోందా?
X
మ‌ధ్య‌ప్ర‌దేశ్, మ‌హారాష్ట్ర‌ల్లో విప‌క్ష పార్టీల ప్ర‌భుత్వాల‌ను కూల్చిన బీజేపీ ఇప్పుడు తాజాగా గోవాలోనూ ఇలాంటి ప‌నుల‌కు శ్రీకారం చుట్టింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్తవానికి గోవాలో బీజేపీనే అధికారంలో ఉంది. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీకి ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇందులో బీజేపీ 20 స్థానాలు గెలుచుకుంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావ‌ల్సిన 21 సీట్ల‌కు గానూ బీజేపీకి ఒక సీటు త‌గ్గింది. దీంతో ఇత‌రుల‌ మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఎన్డీఏ కూట‌మి బ‌లం 25 మంది మాత్రమే.

గోవాలో కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఏడుగురు బీజేపీతో ట‌చ్ లో ఉన్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల పార్టీ నిర్వ‌హించిన స‌మావేశాల‌కు ఈ ఏడుగురు హాజ‌రు కాలేద‌ని చెబుతున్నారు. దీంతో వీరు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేర‌డం కూడా ఖాయ‌మేన‌ని అంటున్నారు. మొత్తం 11 మంది ఏడుగురు అంటే మెజార్టీ స‌భ్యులు బీజేపీలో చేరిపోతే వారిపై అన‌ర్హ‌త వేటు కూడా ప‌డ‌దంటున్నారు. పూర్తిగా వారిని చీలిక ప‌క్షంగా, విలీన ప‌క్షంగా గుర్తిస్తార‌ని పేర్కొంటున్నారు.

బీజేపీతో ట‌చ్ లో ఉన్నవారిలో గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌ మైఖేల్ లోబో, గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి దిగంబర్ కామత్ కూడా ఉన్నారు. ఈ ఇద్దరు.. బీజేపీతో పూర్తి సమన్వయంతో పని చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండిప‌డుతోంది. అధికారం, పదవి కోసం మైఖేల్ లోబో పాకులాడారని, మరోవైపు కామత్‌.. తనపై ఉన్న కేసులనుంచి బయటపడేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని అంతం చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని మండిపడుతోంది.

కాగా గోవా అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు ముందు ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ సమావేశాలకు డుమ్మా కొట్టడంతో కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపింది. గోవా అసెంబ్లీ సమావేశానికి ఒక రోజు ముందు కాంగ్రెస్‌ పార్టీ సమావేశం ఏర్పాటు చేయగా.. ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. వీరిలో అసమ్మతి నేతలు ఉన్నారని, వారు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. దీంతో గోవాలోనూ బీజేపీ నీచ రాజ‌కీయాల‌కు తెర‌తీసింద‌ని కాంగ్రెస్ మండిప‌డుతోంది.