Begin typing your search above and press return to search.

ఇసుక కొరత బ్లూ ఫ్రాగ్ సృష్టేనా?... లోకేశ్ అనుచరుడి సంస్థేనట

By:  Tupaki Desk   |   13 Nov 2019 2:38 PM GMT
ఇసుక కొరత బ్లూ ఫ్రాగ్ సృష్టేనా?... లోకేశ్ అనుచరుడి సంస్థేనట
X
ఏపీలో ఇసుక కొరత జగన్ సర్కారును బాగానే ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. వరదల నేపథ్యంలో ఇసుక ర్యాంపులు మునిగిపోతే... ఇసుక ఎలా బయటకు వస్తుందంటూ వైసీపీ సర్కారు వాస్తవాన్ని చెప్పుకుంది. అయితే అసలు ఏపీలో ఇసుక కొరత నిజమేనా? అనే దిశగా జగన్ సర్కారు కాస్తంత లోతుగానే విచారణ చేసిందన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంచలన విషయం నిజంగానే కలకలం రేపుతోందని చెప్పక తప్పదు. ఏపీలో ఇసుక కొరత లేకున్నా.. కృత్రిమంగా కొరతను సృష్టించారని, ఈ వ్యవహారం మొత్తం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ అనుచరులకు చెందిన సంస్థ నడిపించిందన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... ఏపీలో ఇసుక కొరతను కృత్రిమంగా సృష్టించేందుకు బ్లూ ఫ్రాగ్ అనే ఓ సంస్థ రంగంలోకి దిగిందట. ఇందులో భాగంగా సదరు సంస్థ ఏకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇసుక వెబ్ సైట్ ను హ్యాకింగ్ చేసేసిందట. ఇంకేముంది... సర్కారీ వెబ్ సైట్ ను హ్యాక్ చేసేసిన బ్లూ ఫ్రాగ్.. ఏపీలో ఇసుక దొరకడం లేదని చెప్పేసిందట. ఈ మొత్తం వ్యవహారం ఓ పకడ్బందీ ప్రణాళికతో నడిచిందట. దీంతో ఇసుక కొరత వెబ్ సైట్ లోనే కనిపిస్తున్నా కూడా సర్కారు... ఈ విషయాన్ని గుర్తించలేకపోయిందట. అయితే జగన్ కేబినెబ్ లోని కొందరు మంత్రులు ఈ వ్యవహారంపై దర్యాప్తు సాగాలని కోరితే... జగన్ ఏకంగా సీఐడీని రంగంలోకి దించారట.

జగన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు పలు ఐటీ సంస్థల్లో సోదాలు చేశారట. ఈ క్రమంలోనే బ్లూ ఫ్రాగ్ లోనూ సోదాలు జరగగా... సర్కారీ వెబ్ సైట్ ను హ్యాక్ చేయడంతో పాటుగా ఇసుక కొరతను క్రియేట్ చేసిన వైనం బయటపడిందట. దీంతో సదరు సంస్థకు చెందిన యాజమాన్యంపై కఠిన చర్యలకు కూడా సీఐడీ రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సంస్థ ఎవరిదన్న విషయానికి వస్తే... లోకేశ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ టీడీపీ యువ నేత తండ్రి దీనిని నడిపిస్తున్నారట. ప్రస్తుతానికి ఈ పేరును సీఐడీ అధికారులు వెల్లడించకున్నా... రేపో, ఎల్లుండో మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టడంతో పాటుగా బ్లూ ఫ్రాగ్ పై ఉక్కుపాదం మోపడానికి రంగం సిద్దం చేస్తున్నట్లుగా వినికిడి. మొత్తంగా ఇసుక కొరతను క్రియేట్ చేసి జగన్ సర్కారును బదనాం చేసేందుకు చేసిన టీడీపీ యత్నాలు ఇలా రివర్స్ అవుతున్నాయట.