Begin typing your search above and press return to search.

బాబు త‌ట్టా బుట్టా స‌ర్దుకోవాల్సిందేన‌ట‌!

By:  Tupaki Desk   |   10 May 2019 9:56 AM GMT
బాబు త‌ట్టా బుట్టా స‌ర్దుకోవాల్సిందేన‌ట‌!
X
టీడీపీ అధినేత, ఏపీ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు రాజకీయ జీవితం ముగిసిపోయిన‌ట్టేనా? ఈ నెల 23న వెలువ‌డ‌నున్న ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత చంద్ర‌బాబు త‌ట్టాబుట్టా స‌ర్దేసుకోవ‌డం ఖాయ‌మేనా? ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత చంద్ర‌బాబు చాప్ట‌ర్ క్లోజ్ అయిన‌ట్టేనా? అంటే... అవున‌నే స‌మాధానాలే ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో విప‌క్ష పార్టీ వైసీపీ బంప‌ర్ మెజారిటీతో విక్ట‌రీ సాధించ‌డం ఖాయ‌మేన‌ని ఇప్ప‌టికే చాలా స‌ర్వేలు చెప్పాయి. పోలింగ్ స‌రళిని చూసినా... జ‌గ‌న్ పార్టీ విక్ట‌రీ ఖాయ‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ నేప‌థ్యంలో వైసీపీ విజ‌యం సాధించి జ‌గ‌న్ సీఎం అయితే... చంద్ర‌బాబు పొలిటిక‌ల్ కెరీర్ కు ముగింపు కార్డు ప‌డిన‌ట్టే క‌దా. అమ‌రావ‌తి నుంచి త‌ట్టా బుట్టా స‌ర్దేసుకోవాల్సిందే క‌దా. ఇప్ప‌టికే 70 ఏళ్ల‌కు ద‌గ్గ‌రైన చంద్ర‌బాబు... మరో ఎన్నిక‌ను చూస్తారో, లేదో... ఈ నేప‌థ్యంలో ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలిస్తే... చంద్ర‌బాబు చాప్ట‌ర్ క్లోజ్ అయిన‌ట్టే క‌దా.

ఈ మాట‌ల‌న్నింటినీ పూస‌గుచ్చి, గుదిగుచ్చి, ఇటుక‌ల్లా పేర్చిన‌ట్లు చెప్పింది వేరెవ‌రో కాదు.... టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, దివంగ‌త సీఎం నంద‌మూరి తార‌క‌రామారావు రెండో భార్య‌, చంద్ర‌బాబుకు అత్త గారి వ‌ర‌సైన ల‌క్ష్మీపార్వ‌తే. ఈ మాట‌లు ఆమె తిరుమ‌ల వెంక‌న్న సాక్షిగా చెప్ప‌డం గమ‌నార్హం. తిరుమ‌ల వెంక‌న్న‌ను ద‌ర్శించుకునే నిమిత్తం నిన్న రాత్రికే తిరుమ‌ల చేరుకున్న ల‌క్ష్మీపార్వ‌తి నేటి ఉద‌యం సుప్ర‌భాత సేవ‌లో స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఆ త‌ర్వాత ఆల‌యం వెలుప‌ల ఆమెను మీడియా ప‌ల‌క‌రించ‌గా... చంద్ర‌బాబుపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం ప‌రిస‌మాప్తం అయిపోయింద‌ని ఆమె జోస్యం చెప్పారు. 2019 ఎన్నిక‌ల త‌రువాత రాష్ట్రంలోగానీ, దేశంలో గానీ తెలుగుదేశం పార్టీ అనే పేరు వినిపించ‌క‌పోవ‌చ్చ‌ని అన్నారు.

రాజ‌కీయంగా చంద్ర‌బాబు విశ్రాంతి తీసుకునే స‌మ‌యంలో ఆస‌న్న‌మైంద‌ని చెప్పారు. మే 23వ తేదీ తెలుగుదేశం పార్టీకి డెడ్ లైన్ వంటిద‌ని ఆమె చెప్పారు. చంద్ర‌బాబు పాపాల భైరవుడిలాంటి వాడ‌ని, 23వ తేదీన ఆయ‌న పాల‌న అంత‌మౌతుంద‌ని అన్నారు. ఎన్టీ రామారావు త‌ర‌హాలో జ‌న‌రంజ‌క‌మైన ప‌రిపాల‌న‌ను అందించిన ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మాత్ర‌మేన‌ని ల‌క్ష్మీపార్వ‌తి చెప్పారు. మ‌రోసారి అలాంటి ప‌రిపాల‌న రావాలంటే అది ఒక్క వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితోనే సాధ్య‌ప‌డుతుంద‌ని చెప్పారు. రాష్ట్రంలో మ‌రోసారి రాజ‌న్న రాజ్యం రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీని సాధించ‌బోతోంద‌ని అన్నారు. వైఎస్ జగన్ ముఖ‍్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. దీన్ని ఎవ‌రూ అడ్డుకోలేర‌ని ఆమె చెప్పారు.