Begin typing your search above and press return to search.

చంద్రబాబు చివరి ప్రయోగం టీడీపీకి పెను శాపమేనా... ?

By:  Tupaki Desk   |   26 July 2021 12:30 AM GMT
చంద్రబాబు చివరి ప్రయోగం టీడీపీకి పెను శాపమేనా... ?
X
చంద్రబాబును ఎత్తులు పొత్తుల మాస్టర్ అని చెప్పాలి. కాఫీ ఎలా తయారవుతుంది అంటే డికాషన్ లో పాలు పోసి అని ఠక్కున ఎవరైనా చెబుతారు. కానీ చంద్రబాబు డికాషన్ లేకుండానే కాఫీ తయారు చేయగలరు. లేక పాలకు బదులు ఇంకేదైనా కలపగలరు. మొత్తానికి తాగేందుకు ఒక ద్రవ పదార్ధమే కదా కావాల్సింది అన్నది బాబు మార్క్ థియరీ. ఈ విషయంలో ఆయన మరేమీ ఆలోచించరు కూడా.. రాజకీయాలలో కూడా బాబుకు అదే పద్ధతి. ఆయనకు ఎలాగైనా అధికారంలోకి రావడం అన్నదే అతి ముఖ్యం. దానికి కోసం దేనితో అయినా కలసిపోగలరు. దేంతో అయినా అంతే సులువుగా బంధాలను తెంచుకోగలరు. అదే చంద్రబాబు చాణక్య రాజకీయం.

గత ఎన్నికల వేళ తెలంగాణాలో ఎవరూ ఊహించని పొత్తుని చంద్రబాబు అక్కడి జనాల ముందు పెట్టారు. కాంగ్రెస్ తో కలసి పోటీకి దిగారు. రాహుల్ గాంధీతో కలసి భుజం కలిపారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు వెనక ఉన్న మహత్తర ఉద్దేశ్యాన్నే బాబు ఆ విధంగా మరచిపోయారు. అయితే నాటి ఎన్నికల్లో చేదు ఫలితాలే వచ్చాయి. బాబుతో జట్టుకట్టిన పుణ్యానికి తెలంగాణాలో కాంగ్రెస్ కూడా మట్టికొట్టుకుని పోయింది. అయినా బాబు పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా పోరాడుతున్నారు. మరో మారు ఆయన కాంగ్రెస్ తో పొత్తులకు ఆరాటపడుతున్నారు అంటున్నారు.

ఈసారి ఆయన తెలంగాణాతో పాటు ఏపీకి కూడా కాంగ్రెస్ పొత్తుని విస్తరిస్తారు అంటున్నారు. తెలంగాణాలోనే ఈ దోస్తీకి విలువ లేకుంటే ఏపీలో ఎలా సాధ్యపడుతుంది అన్నది బాబునే అడగాలేమో. ఇక నాడు కాంగ్రెస్ తో పొత్తు అంతే ఇంతెత్తున ఎగిరిపడిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ఇపుడు గుర్తుకు వస్తారు. జనాలు బట్టలూడదీసికొడతారు అని ఆయన అప్పట్లో చేసిన హాట్ కామెంట్స్ కూడా అందరికీ గుర్తుకు వస్తాయి. మొత్తానికి తెలంగాణా వరకూ పొత్తు అంటే అయ్యన్న లాంటి వారు సర్దుకుపోయారు. రేపు బాబు మాస్టర్ మైండ్ ఏపీలో కూడా టీడీపీ కాంగ్రెస్ పొత్తు అంటే ఏం చేస్తారో చూడాలి. ఏం చేయగలరు ఎవరైనా..!

తెలంగాణ‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నందుకే అక్క‌డ టీడీపీని ... చివ‌ర‌కు టీడీపీతో పొత్తు పెట్టుకున్న పాపానికి కాంగ్రెస్‌ను కూడా చిత్తుగా ఓడించారు. అందుకే ఆ వెంట‌నే జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను బాబు ఆమ‌డ దూరంలో పెట్టేశారు. ఇక మ‌రి ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో మ‌ళ్లీ ఎలా ? జ‌ట్టు క‌డ‌తారు ? అన్న‌ది ఆయ‌న‌కే తెలియాలి. అయినా రాజకీయాల్లో సిద్ధాంతాలు ఎక్కడ ఉన్నాయి. ఏదో విధంగా అధికారంలోకి రావడమే పరమావధి అయినపుడు ఈ పొత్తుల వల్ల గెలుస్తామని ఆశ ఉంటే టీడీపీ నేతలు అంతా ఫుల్ సైలెంట్ అవుతారు కూడా..!

మరి వారు అయినట్లుగా జనాలు కూడా సైలెంట్ గా ఉండి మద్దతు ఇస్తారా లేక వద్దనుకుంటారా అన్నది 2024లోనే చూడాలి. ఏది ఏమైనా కొత్త రాజకీయ వంటకాలు వండడంలో తనను మించిన స్పెషలిస్ట్ లేడని బాబు మళ్ళీ మళ్లీ నిరూపించుకుంటూనే ఉంటారుగా. అయితే ఈసారి చేసే ప్రయోగమే బాబు రాజకీయాల్లో చివరిది అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.