Begin typing your search above and press return to search.

చంద్రబాబు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారా ?

By:  Tupaki Desk   |   23 July 2021 8:30 AM GMT
చంద్రబాబు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారా ?
X
ప్రతిపక్షంలోకి వచ్చి రెండేళ్ళయినా ఇంకా చంద్రబాబునాయుడు వైఖరిలో మార్పు రాలేదు. అధికారంలో ఉన్నపుడు ఎలాంటి తప్పు చేశారో ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అదే తప్పు చేస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు చేస్తున్న తప్పు ఏమిటంటారా ? మీడియాను మాత్రమే నమ్ముకోవటం.

గడచిన రెండేళ్ళుగా ప్రజలకు టీడీపీని దగ్గర చేయాల్సిందిపోయి కేవలం తనకు మద్దతుగా ఉండే మీడియాతో మాత్రమే మమేకం అవుతున్నారు. యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా నేతలు కూడా మీడియాను మాత్రమే నమ్ముకుని జనాలకు దూరమైపోయారు.

నిజానికి మీడియాను మాత్రమే నమ్ముకున్న ఏ నేత కూడా సక్సెస్ సాధించలేడు. ఇంతచిన్న విషయాన్ని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు కొత్తగా ఎవరు చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు జనాల్లో ఉంటునే మీడియాలో ప్రచారం వస్తే డబల్ బొనాంజ అనుకోవాలి కానీ కేవలం మీడియాలో మాత్రమే హైలైట్ అవుతామంటే సాధ్యంకాదు.

ఇక ఇంకో కీలకమైన అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు మద్దతు మీడియాలో ప్రతిరోజు పేజీలకు పేజీలు వార్తలు, కథనాలు వండి వార్చటం వల్ల ఉపయోగమే లేదు.

ఒకవైపు వ్యతిరేక వార్తలు, కథనాలు మరోవైపు గంటలకొద్దీ డిబేట్లు పెట్టి జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయిస్తున్నారు. నిజానికి గడచిన రెండేళ్ళల్లో జగన్ ఏవైతే తప్పులు చేశారని రాస్తున్నారో దాదాపు అవే తప్పులు చంద్రబాబు కూడా చేశారు. అయితే అప్పట్లో ఆ తప్పులను చూపని ఇదే మీడియా ఇపుడు మాత్రమే తెగ హైలైట్ చేయటానికి కారణాలు ఏమిటని తెలుసుకోలేనంత అమయాకులు కారు జనాలు. చంద్రబాబు హయాంలో కూడా ఇదే మీడియా జగన్ కు వ్యతిరేకంగా చాలానే కష్టపడింది. కానీ ఫలితం ఎలావచ్చిందో అందరు చూసిందే.

జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడే వ్యతిరేక మీడియాలో వచ్చిన వార్తలు, కథనాలను పట్టించుకోని జనాలు ఇపుడు పట్టించుకుంటారా ? జగన్ వ్యతిరేక మీడియా మొత్తం చంద్రబాబు కోసమే పనిచేస్తున్నదనే విషయం అందరికీ తెలుసు. జగన్ కు వ్యతిరేకంగా వార్తలు రాయించి లాభపడదామనే భ్రమల్లో నుండి చంద్రబాబు బయటపడాలి.

జగన్ పాలనలో నిజంగానే ప్రజా వ్యతిరేక నిర్ణయాలున్నాయని అనుకుంటే చంద్రబాబు ప్రజల్లోకి వచ్చి పోరాడాలి. అప్పుడే జనాలు మద్దతుగా నిలబడతారు. అలాకాకుండా కేవలం మీడియాలో వ్యతిరేక వార్తలు వస్తే చాలనుకుంటే మళ్ళీ 2019 ఫలితాలే పునరావృతమయ్యే అవకాశముంది.