Begin typing your search above and press return to search.

బాబుకు నచ్చని మాటలు పవన్ నోటి నుంచి వచ్చాయా?

By:  Tupaki Desk   |   19 Oct 2022 4:10 AM GMT
బాబుకు నచ్చని మాటలు పవన్ నోటి నుంచి వచ్చాయా?
X
అనూహ్య పరిణామాలు ఒక్కసారిగా చోటు చేసుకుంటే? ఏపీలోని రాజకీయ పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. రోజులో మొత్తం తిరిగిపోయినట్లుగా.. కీలక పరిణామాలు ఒకటి తర్వాత ఒకటి చోటు చేసుకున్నాయి. విశాఖపట్నం నుంచి వచ్చిన పవన్ కల్యాణ్ ను చంద్రబాబు కలవాలని కోరుకోవటం.. ఆ వెంటనే ఇరువురు అధినేతలు ఒక హోటల్లో భేటీ కావటం తెలిసిందే. ఇక.. నేతలు..కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో మాట్లాడారు పవన్ కల్యాణ్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణలోనూ ఆసక్తికరంగా మారాయి. హాట్ టాపిక్ అయ్యాయి. కొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీసినట్లైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మిగిలింది అసంతృప్తేనా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి కారణం పవన్ నోటి నుంచి వచ్చిన కొన్ని కీలక వ్యాఖ్యలే అని చెప్పాలి.

తెలుగుదేశం పార్టీతో జనసేన జత కట్టటం అంటే.. ముఖ్యమంత్రి పదవికి ఆశలు వదులుకోవటమే. ఆ విషయంలో మరో మాటకు తావు లేదు. అయినప్పటికీ.. అనూహ్య పరిణామాల్లో సీఎం పదవి లభించే అవకాశాన్ని తాను వదులుకోవాలనుకోవటం లేదన్న సంకేతాలు ఇచ్చేలా పవన్ ప్రసంగం ఉండటం ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణమైందని చెప్పాలి.

ఇంతకూ పవన్ నోటి నుంచి వచ్చిన మాటల్ని యథాతధంగా చూస్తే.. ''నేను ముఖ్యమంత్రి పదవి కోసం పని చేయడం లేదు. ఈ యుద్ధంలో సీఎం పదవి వరిస్తే సంతోషమే. అధికారంలోకి వచ్చాక... తొలుత అభివృద్ధి, తర్వాత వీళ్ల తాట తీయడమే. చావో... రేవో... రాజకీయాల్లోనే'' అంటూ తన ఆలోచనల్ని సూటిగా.. సుత్తి లేకుండా చెప్పేశారు.

పవన్ తో భేటీ అయిన తర్వాత బాబు ముఖంలో కొత్త కళ కనిపించక మానదు. అయితే.. ఆ కళకు పరిమితులు ఉండేలా పవన్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. పవన్ మాటల్ని లోతుగా చూస్తే.. ముఖ్యమంత్రి పదవి మీద తనకు ఆశ లేదన్న విషయాన్ని ఆయన చెప్పలేదు సరికదా.. అవకాశాన్ని తాను వదులుకోనన్న విషయాన్ని స్పష్టం చేశారు. పవన్ మాటల్ని చూస్తే.. ముఖ్యమంత్రి పదవి మీద తనకు వ్యామోహం లేదని.. ఆసక్తి ఉందని మాత్రం తేల్చేశారు.

దీంతో.. అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకొని సీఎం పదవి వరిస్తే తాను చేపడ్డడానికి సిద్దంగా ఉన్నట్లుగా తేల్చేశారు. తనకు మిత్రుడిగా.. తన చేతికి అధికారం లభించేలా పవన్ తీరు ఉండాలే తప్పించి ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవాలన్నట్లుగా బాబు తీరు ఉండదు. అందుకే పవన్ తో భేటీ అయిన ఆనందంతో పాటు.. సీఎం పదవిని చేపట్టే విషయంలో పవన్ కు ఉన్న క్లారిటీ చంద్రబాబుకు కాసింత అసంతృప్తిని మిగిల్చిందన్నది మాత్రం వాస్తవం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.