Begin typing your search above and press return to search.

పాత పార్ములాకే పదును పెడుతున్నారా?

By:  Tupaki Desk   |   22 Aug 2022 11:30 PM GMT
పాత పార్ములాకే  పదును పెడుతున్నారా?
X
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న చంద్రబాబునాయుడు అనేక వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒకపుడు అమలుచేసిన వ్యూహానికి మళ్ళీ పదునుపెడుతున్నారట. ఇంతకీ ఆ వ్యూహం ఏమిటంటే తటస్తులకు సీట్లనే పాత ఫార్ములాను అమలు చేయాలని డిసైడ్ అయ్యారట. పార్టీల వారీగా ఎంతోకొంత ఓటు బ్యాంకు ఉంటుందని అందరికీ తెలిసిందే. ఆరునూరైనా ఈ ఓటు బ్యాంకు దాదాపు ఆయా పార్టీలకే పడుతుంటుంది. చాలా అరుదుగా మాత్రమే ఓటు బ్యాంకు ప్రత్యర్థి పార్టీ వైపు మళ్ళుతుంది.

పార్టీల వారీగా చీలిపోయిన ఓటు బ్యాంకు కాకుండా తటస్థుల ఓట్లు చాలానే ఉంటాయి. ఈ తటస్తుల్లో ఎంతమంది ఏ పార్టీవైపు మొగ్గుచూపుతారో ఆ పార్టీనే గెలుస్తుంది.

ఒకపుడు తటస్థుల ఓట్లను సాధించేందుకు 1999 ఎన్నికల్లో చంద్రబాబు తటస్తులకు టికెట్లనే ప్రయోగం చేశారు. దానివల్ల ఏమైందంటే తటస్తుల ఓట్లు కూడా కొన్ని టీడీపీకి పడ్డాయి. తటస్తుల కోటాలో ఎంఎల్ఏలుగా పోటీచేసిన వారిలో శెనక్కాయల అరుణ లాంటి కొందరు గెలిచి మంత్రులయ్యారు కూడా.

అప్పట్లో చంద్రబాబు చేసిన ప్రయోగానికి ఆకర్షితులై మున్సిపల్ కమీషనర్లు, లెక్చరర్, రిటైర్డు అధికారులు, పోలీసు అధికారులు పార్టీలో చేరారు. వీరిలో కొందరికి టికెట్లిచ్చి ప్రోత్సహించారు. తర్వాత అదే ప్రయోగం ఫెయిలైంది. ఇంత కాలానికి మళ్ళీ తటస్థుల ప్రయోగానికి చంద్రబాబు రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తటస్థుల కోటాలో కొందరికి టికెట్లిస్తే తటస్తుల ఓట్లను కూడా ఆకర్షించవచ్చన్నది చంద్రబాబు ఆలోచన.

అయితే అప్పట్లో చంద్రబాబు ప్రయోగం చేయగలిగారంటే అధికారంలో ఉన్నారు కాబట్టి స్వేచ్చగా చేయగలిగారు. కానీ ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అందులోను వైసీపీని ఎదుర్కోవటంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు.

వచ్చే ఎన్నికలు పార్టీకి చావో రేవో లాంటిదని చెప్పటంలో సందేహం అవసరం లేదు. ఇలాంటి ఎన్నికల్లో కూడా చంద్రబాబు ప్రయోగాలకు దిగి సక్సెస్ అవుతారా అన్నదే అనుమానం. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.