Begin typing your search above and press return to search.

చిరాగ్ ది సెల్ఫ్ గోలు ఫలితమేనా ?

By:  Tupaki Desk   |   7 July 2021 7:30 AM GMT
చిరాగ్ ది సెల్ఫ్ గోలు ఫలితమేనా ?
X
‘నా వాళ్ళే నాకు వెన్నుపోటు పొడిచారు’ .. ఇది తాజాగా ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించిన సందర్భంగా బీహార్ యువనేత చిరాగ్ పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలు. చిరాగ్ తండ్రి, దివంగత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఎల్జేపీ ఘోర ఓటమి తర్వాత పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. తనకు వెన్నుపోటు పొడవటానికి తనంతట తానే అవకాశం ఇచ్చారు.

ఎల్జేపీ జాతీయపార్టీ అధ్యక్షునిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ నుండి దింపేసి పశుపతి కుమార్ పాశ్వాన్ అధ్యక్షుడయ్యారు. పార్టీ అధ్యక్షపదవినే కాకుండా లోక్ సభా పక్ష నేతగా కూడా ఎన్నికయ్యారు. అంటే పార్టీకున్న ఏడుమంది ఎంపిల్లో చిరాగ్ ఒకవైపు పశుపతితో కలిపి మిగిలిన ఆరుగురు ఒకవైపున్నారు. దాంతో చిరాగ్ కు ఇటు పార్టీ పగ్గాలు పోయి అటు లోక్ సభాపక్ష నేత కూడా చేజారిపోయింది. అందుకనే ప్రజాబలం తనకే ఉందని నిరూపించుకునేందుకు చిరాగ్ పాదయాత్ర ప్రారంభించారు.

సరే ప్రజాబలం నిరూపణలో ఏమవుతుందన్నది ప్రస్తుతానికి అనవసరం. ఎందుకంటే దానికి ఇంకా చాలా కాలం పడుతుంది. ఇంతకీ చిరాగ్ కు ఈ పరిస్ధితి ఎందుకు వచ్చిందన్నదే అసలైన ప్రశ్న. రామ్ విలాస్ ఉన్నపుడు రాష్ట్రానికి సంబంధించిన పార్టీ వ్యవహారాలన్నీ తమ్ముడు పశుపతి చేతుల మీదగానే జరిగేవి. ముఖ్యమైన నిర్ణయాలను పార్టీలోని కొందరు కీలక నేతలతో చర్చించిన తర్వాతే రామ్ విలాస్ తీసుకునేవారు. పైగా పార్టీకి రామ్ విలాసే కర్త, కర్మ, క్రియ కాబట్టి ఎవరు నోరెత్తేవారు కాదు.

ఎప్పుడైతే తండ్రి చనిపోయి చిరాగ్ కు పార్టీపగ్గాలను తీసుకున్నారో అప్పటినుండి తేడా వచేసింది. పార్టీకి సంబంధించిన ఎలాంటి నిర్ణయమైన ఎవరితోను చర్చింటంలేదు. తానిష్ట ప్రకారమే తీసుకుని అమలు చేస్తున్నారు. సొంత బాబాయ్ పశుపతిని దూరంగా పెట్టేశారు. ముఖ్యనేతలకు కూడా పెద్దగా విలువివ్వటంలేదట. మొన్నటి బీహార్ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేయాలనే నిర్ణయం చిరాగ్ దేనట. వద్దని చెప్పిన బాబాయ్ ను అందరిముందు అవమానించారట.

ఇలాంటి అనేక నిర్ణయాల్లో చిరాగ్ కు పార్టీ నేతలకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. చిరాగ్ ఒంటెత్తు పోకడలను పశుపతితో సహా చాలామంది నేతలకు నచ్చలేదు. దాంతో ఎలాగైనా చిరాగ్ ను దెబ్బకొట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకనే సమయం చూసి ఏకంగా పార్టీనే చీల్చేశారు. పార్టీమీద తన ముద్ర ఉండాలని చిరాగ్ అనుకోవటంలో తప్పులేదు. కానీ కాస్త ముందు వెనుక ఆలోచించుకునుంటే బాగుండేది. పార్టీలో తనకంటు బలమైన మద్దతుదారులను రెడీ చేసుకునుండాలి. అలాంటిదేమీ లేకుండా ఏకపక్ష నిర్ణయాల కారణంగానే చివరకు పార్టీ చీలికకకు కారకుడయ్యారు. సరే చూద్దాం పాదయాత్ర ప్రారంభించారు కదా ఏమవుతుందో.