Begin typing your search above and press return to search.

మెగా న్యూస్ : జనసేనకు గాడ్ ఫాదర్ గా......?

By:  Tupaki Desk   |   26 Nov 2022 2:30 AM GMT
మెగా న్యూస్ : జనసేనకు గాడ్ ఫాదర్ గా......?
X
జనసేన వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది అని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. దానికి వారు చెప్పే కారణాలు చాలా ఉన్నాయి. ఏపీలో చంద్రబాబు పాలన చూశారు, జగన్ ఏలుబడిని చూశారు. ఇక మిగిలింది పవన్ కళ్యాణ్. ఆయనకు ఒక్క చాన్స్ ఇవ్వడానికి ఏపీ జనాలు సిద్ధంగా ఉన్నారని వారు అంచనా వేస్తున్నారు. దాంతో పాటుగా ఏపీలో మిగిలిన రెండు పార్టీలకు లేనిది జనసేనకు ఉన్నది యూత్ ఫాలోయింగ్. అలాగే ఒక బలమైన సామాజికవర్గం అండ.

దీంతో జనసేనకు ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా ఆ పార్టీ నేతలు దూకుడు చేస్తున్నారు. నిజానికి ఈసారి సీఎం కావాల్సిందే అని పవన్ కళ్యాణ్ సైతం పక్కాగా వ్యూహ రచన చేస్తూ వస్తున్నారు. ఆయన ఆ మధ్యన పార్టీ ఆవిర్భావ సభలో చేసిన ప్రసంగం కనుక ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నారు. దానికి మిగిలిన పార్టీలు కూడా కలవాలని, తాము ఇప్పటిదాకా తగ్గామని, వారు కూడా తగ్గాలని ఆయన కోరుకున్నారు.

అంటే జనసేన పెద్దన్న పాత్రలో ఉంటూ అటు బీజేపీ ఇటు టీడీపీ అయినా లేక ఇతర విపక్షాలు అయినా ఒకే గొడుకు కిందకు రావాలన్నదే పవన్ ఉద్దేశ్యం అని ఆనాడే విశ్లేషణలు ఉన్నయి. ఇక ఆ తరువాత కొన్నాళ్ళకు ఆయన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ కొన్ని ఆప్షన్లు కూడా ప్రకటించారు. వాటిలో కూడా జనసేననే కేంద్ర బిందువుగా చేసుకుని పొత్తుల విషయం ప్రస్తావించారు.

ఇది జరిగాక విశాఖ సంఘటన చోటు చేసుకుంది. అనంతరం విజయవాడ హొటల్ లో పవన్ కళ్యాణ్ణి చంద్రబాబు కలుసుకున్నారు. అయితే నాటి నుంచి మళ్లీ తెలుగుదేశం ఊసుని పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఎత్తడంలేదు. ఈ మధ్యలో సడెన్ గా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన తరువాత ఏపీలో బీజేపీతో కలిసి అయినా లేక సోలోగా అయినా బరిలోకి దిగాలన్న ఆలోచనలు ఆ పార్టీలో వస్తున్నాయి అని అంటున్నారు

మొత్తానికి చూస్తే 2029 వరకూ కాదు, ఏదైనా 2024లోనే తేల్చుకోవాలని జనసేన చూస్తోంది. జనసేనకు ఇపుడు మెగా ఫ్యామిలీ కూడా పూర్తిగా కలసివచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. మెగాస్టార్ ఈ మధ్య తరచుగా జనసేనాని పొగుడుతున్నారు. తమ్ముడు కచ్చితంగా అధికారాన్ని అందుకుంటాడు అన్న విశ్వాసాన్ని ఆయన చూపిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి ఊతమివ్వడానికి ప్రత్యక్షంగా రంగంలోకి దిగి మెగాస్టార్ కూడా రాజకీయ ప్రచారం చేసి పెడతారు అని అంటున్నారు. తమ్ముడు కొసం మెగాస్టార్ గాడ్ ఫాదర్ గా వ్యవహరిస్తారు అని కూడా అంటున్నారు.

మరో విషయం ఏంటి అంటే వచ్చే ఏడాది మొదట్లో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర మొదలవబోతోంది. ఆ యాత్రను స్వయంగా చిరంజీవే ప్రారాంభిస్తారు అని అంటున్నారు. అది కూడా పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుపతి నుంచే స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. ఆ సందర్భంగా జరిగే సభలో అఫీషియల్ గా మెగాస్టార్ తన మద్దతు జనసేనకు ప్రకటిస్తూ ప్రజారాజ్యం పార్టీ మాజీ నాయకులతో పాటుగా మొత్తం మెగాభిమానులు జనసేనకు అండగా నిలవాలని పిలుపు ఇస్తారు అని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే 2009 తరువాత మెగా ఫ్యామిలీ మొత్తం సీరియస్ గానే పాలిటిక్స్ ని తీసుకున్నాయని అంటున్నారు.

అశేష జనం విశేష అభిమానం తమకు ఉంది. బలమైన సామాజికవర్గం తోడు కూడా ఉంది. మెగా క్యాంప్ లో దాదాపుగా డజన్ మంది దాకా హీరోలు ఉన్నారు. ఇంతటి శక్తిని తమ వద్ద ఉంచుకుని ఏపీ రాజకీయాన్ని అందుకోకొపోవడం ఏంటి అన్న చర్చ చాలా కాలంగా ఉంది. ఇపుడు అది కార్యరూపంలోకి వస్తోంది అంటున్నారు. ఈసారి ఎన్నికలు టీడీపీ వైసీపీలకే కాదు, జనసేనకు కూడా అత్యంత ప్రతిష్టాత్మకం అని అంటున్నారు. మరి చిరంజీవి గాడ్ ఫాదర్ గా మరి జనసేన రధాన్ని తాను స్వయంగా ముందుకు ఉరికిస్తే ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదు అవుతుందా అంటే వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.