Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్‌ను నిన్న కాదని.. జగన్ పార్టీలోకి చిరంజీవి వెళ్లడమా?

By:  Tupaki Desk   |   15 Feb 2020 5:30 PM GMT
పవన్ కళ్యాణ్‌ను నిన్న కాదని.. జగన్ పార్టీలోకి చిరంజీవి వెళ్లడమా?
X
రాజకీయాల్లో ఎప్పుడేమైనా జరగవచ్చుననేది ఎంత నిజమో.. అప్పుడప్పుడు జరగలేని అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరగడం కూడా అంతే సహజం! రెండ్రోజులుగా వైసీపీ కేంద్రంలో చేరుతుందని, అలాగే చిరంజీవి వైసీపీలో చేరి కేంద్రమంత్రి కావొచ్చుననే ఊహాగానాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. గతంలో చిరు వ్యవహరించిన తీరు ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తోంది. వైసీపీ ఎన్డీయేలో చేరితే రెండు కేంద్రమంత్రి పదవులు వస్తాయని, అందులో ఒకటి విజయసాయిరెడ్డికి ఇస్తారనే ప్రచారం ఉంది. అంతటితో ఆగకుండా చిరంజీవి వైసీపీలో చేరవచ్చునని, ఆ పార్టీ తరఫున త్వరలో 4గురిని రాజ్యసభకు పంపించే అవకాశముందని, అందులో మెగాస్టార్‌కు చోటు దక్కి, కేంద్రమంత్రి కూడా అయ్యే అవకాశాలు కొట్టి పారేయలేమంటున్నారు.

సైరా నరసింహా రెడ్డి సినిమా సమయంలో చిరంజీవి సీఎం జగన్‌ను కలిశారు. ఈ సినిమా విషయంలో చిరంజీవి విజ్ఞప్తులకు సీఎం సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత మూడు రాజధానుల నిర్ణయానికి కూడా మెగాస్టార్ మద్దతు పలికారు. అదే సమయంలో చిరు తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలకు మద్దతు పలుకుతున్నారు. అమరావతే రాజధాని అంటున్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన వైసీపీలో చేరి, కేంద్రమంత్రి అవుతారని ప్రచారం జోరుగా సాగుతోంది.

ఐతే, చిరంజీవిపై కావాలని కొందరు చేస్తోన్న వట్టి ప్రచారంగానే చాలామంది కొట్టి పారేస్తున్నారు. ఇందుకు రెండు మూడు కారణాలు కూడా చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలపడం, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయనకు రాజకీయాలపై వెగటు పుట్టిందని చెబుతున్నారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉండేవారని లేదా 2019లో సొంత తమ్ముడి కోసం రంగంలోకి దిగేవారని గుర్తు చేస్తున్నారు. కానీ ఆయన కాస్త దూరం పాటించారు. దీనిని బట్టే ప్రత్యక్ష రాజకీయాలు దాదాపు పక్కన పెట్టి, సినిమాల పైనే ఆయన దృష్టి పెట్టారని చెబుతున్నారు.

అలాగే, జగన్‌ను కలవడం వెనుక తాను నటించిన సినిమా అదనపు షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు, వినోదపు పన్ను వంటి అంశాలు ఉన్నాయని చెబుతున్నారు. మూడు రాజధానుల విషయానికి వచ్చేసరికి.. అధికార వికేంద్రీకరణ అనే కోణంలో ఆయనకు నచ్చి ఉంటుందని చెబుతున్నారు. అంతే తప్ప ఈ రెండు మూడు అంశాలను పరిగణలోకి తీసుకొని, వైసీపీలో చేరుతారు, కేంద్రమంత్రి అవుతారనే ప్రచారం ఉత్తిదే కావొచ్చు అంటున్నారు.

అసలు, సున్నిత మనస్కుడిగా పేరు ఉన్న చిరంజీవికి రాజకీయాలు సరిపోవడం లేదనేది చాలామంది వాదన. దానికి తగినట్లుగా ఆయన క్రియాశీలకంగా లేరు. 2019లో టీడీపీ, వైసీపీలకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆసక్తి ఉంటే జనసేన కోసం పని చేయాలి. అలాంటివేమీ చేయలేదని గుర్తు చేస్తున్నారు. అలాంటి చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా వైసీపీలో చేరి, కేంద్రమంత్రి కావాలని కోరుకోరని, అదంతా వట్టి ప్రచారం మాత్రమేనని అంటున్నారు. కేంద్రంలో సీఏఏ, నోట్ల రద్దు, జీఎస్టీ... వంటి వివిధ బిల్లులపై ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అంశాల వారీగా మద్దతు పలుకుతుంటాయి. ఇప్పుడు మూడు రాజధానులపై కూడా చిరంజీవిది ఓ విధంగా అదే వైఖరి అంటున్నారు.