Begin typing your search above and press return to search.

సీఎం జ‌గ‌న్ కి టాలీవుడ్ ని ప‌ట్టించుకునే తీరిక ఉందా..!

By:  Tupaki Desk   |   16 July 2021 9:54 AM GMT
సీఎం జ‌గ‌న్ కి టాలీవుడ్ ని ప‌ట్టించుకునే తీరిక ఉందా..!
X
రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో మ‌రో టాలీవుడ్ రూప‌క‌ల్ప‌న గురించి విస్త్ర‌తంగా చర్చ సాగింది. కానీ దానికి సంబంధించి సినీ పెద్ద‌లు ప్ర‌భుత్వాన్ని క‌లిసి సంప్ర‌దింపులు జ‌రిపినా ర‌క‌ర‌కాల రాజ‌కీయ కార‌ణాల‌తో ఆ అంశం తెర‌మ‌రుగైన సంగ‌తి తెలిసిందే. 2020 ఉగాది స‌మ‌యంలోనే వైజాగ్ టాలీవుడ్ అంశాన్ని సీఎం జ‌గ‌న్ ప్రక‌టిస్తార‌ని విశాఖ వాసులు స‌హా తెలుగు జ‌నంలో చ‌ర్చ న‌డిచింది. కానీ దానికి సంబంధించి ఎలాంటి ప్ర‌క‌ట‌నా వెలువ‌డ‌లేదు. ఇప్ప‌టికే విశాఖ‌లో స్టూడియోల నిర్మాణం కోసం ప‌లువురు సినీప్ర‌ముఖులు ద‌ర‌ఖాస్తులు చేసుకున్నా దానికి స్పంద‌న లేనే లేదు.

తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల నేప‌థ్యంలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు చేసిన ఓ వ్యాఖ్య ఏపీ రాజకీయ వ‌ర్గాల్లోకి వైర‌ల్ గా దూసుకెళుతోంది. ``ఏపీలో వంద స‌మ‌స్య‌ల‌తో ముఖ్య‌మంత్రి బిజీగా ఉంటే.. టాలీవుడ్ బాగోగుల‌పై దృష్టి పెట్టే తీరిక అక్క‌డ ఉండ‌ద‌``ని నాగ‌బాబు కాస్త క‌టువైన‌ కామెంట్ నే చేశారు. నిజ‌మే సీఎం జ‌గ‌న్ కి రాజ‌ధాని అంశం తేల‌నంత వ‌ర‌కూ ఇలానే ఉంటుందేమో! అంటూ ఇప్పుడు గుస‌గుస వేడెక్కిస్తోంది.

కొన్ని రోజులుగా మా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీదారుల మ‌ధ్య నువ్వా? నేనా? అన్న స్థాయిలో ర‌చ్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో `మా` సొంత భ‌వన నిర్మాణం తెర‌పైకి తీసుకొచ్చి స‌న్నివేశాన్ని మ‌రింత హీటెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే మంచు విష్ణు తాను ఎవ‌రి స‌హాయం అవ‌స‌రం లేకుండా `మా`కు సొతంగా భ‌వ‌నం నిర్మిస్తాన‌ని ప్ర‌క‌టించారు. అలాగే ప్ర‌కాశ్ రాజ్ స‌హా మిగ‌తా పోటీ దారులు సొంత భ‌వ‌నం ఎజెండాగ‌నే ప‌నిచేస్తామ‌న్నారు. ఈ నేప‌థ్యంలో నాగ‌బాబు ఓ ఇంట‌ర్వ్యూలో చాలా అంశాల‌పై త‌న‌దైన శైలిలో సునిశిత వ్యాఖ్య‌ల‌ను చేశారు.

ఇటీవ‌లే బాల‌య్య ఇన్నేళ్ల పాటు ఎందుకు సొంత భ‌వ‌నం నిర్మించుకోలేక‌పోయార‌ని ప్ర‌శ్నించగా.. మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ఇంత‌లోనే మా భ‌వంతి నిర్మాణానికి తెలంగాణ ప్ర‌భుత్వం ఎలాంటి స‌హ‌కారం చేస్తుంద‌నేది ప్ర‌కాష్ రాజ్ చెబుతార‌ని అన‌డం ఆస‌క్తిని రేకెత్తించింది.

నిజ‌మే నాగ‌బాబు వ్యాఖ్య‌లు అక్ష‌ర స‌త్యం. క‌రోనా రాక‌తో దేశంలో రాష్ట్రాల్లో ఎలాంటి ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోయామో తెలిసిందే. వ్య‌వ‌స్థ‌ల‌న్నీ త‌ల్ల‌కిందులైపోయాయి. క‌ష్ట‌కాలంలో ప్ర‌భుత్వాల్ని న‌డిపించ‌డం కేంద్రం స‌హా అన్ని రాష్ట్ర‌ ప్రభుత్వాల‌కు ఇబ్బందిక‌రంగానే మారింది. ఇక ఏపీలో చూసుకుంటే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ ప‌థ‌కాలపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ప‌నిచేస్తున్నారు.

ఆప‌త్కాలంలో కొవిడ్ కోసం ప్ర‌త్యేక నిధిని కేటాయించాల్సి వ‌చ్చింది. ఇది ప్ర‌భుత్వానికి అద‌నంగా ఎంతో భారం. అలాంటి స‌మ‌యంలోనూ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసారు. ఇక రాజ‌ధాని అంశం ఎటూ తేల‌క‌పోవ‌డం ఆయ‌న‌కు తల‌నొప్పి వ్య‌వ‌హారంగానే ఉంది. అలాగే జిల్లాల పున‌ర్విభ‌జ‌న అంశం కూడా ఇటీవ‌ల స‌ర్వ‌త్రా చర్చ‌నీయాంశంగా మారింది.

ఇలాంటి ర‌క‌ర‌కాల రాజ‌కీయ కార‌ణాల‌తో తీరిక లేకుండా ఉన్న సీఎం ఇప్పుడు టాలీవుడ్ అభివృద్దిపై దృష్టి సారించ‌డం సాధ్య‌మేనా? అన్న చ‌ర్చా ప‌రిశ్ర‌మ‌లో సాగుతోంది. ఇండ‌స్ట్రీ కోసం త‌న స‌హాకారం ఎప్పుడు ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి గతంలో మెగాస్టార్ చిరంజీవితో భేటీలో చెప్పిన సంగ‌తి తెలిసిందే. విశాఖ‌ను టాలీవుడ్ హాబ్ గా మార్చాల‌ని సినీ పెద్ద‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో సీఎం అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

ఇక కొత్త‌గా ఏర్పాటు కాబోతున్న ప‌రిపాల‌న రాజ‌ధాని విశాఖ‌ని అన్ని ర‌కాలుగా తీర్చి దిద్దాల‌ని సీరియస్ గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే విశాఖ బీచ్ తీరాన ఎఫ్.ఎన్.సీ.సీ బిల్డింగ్ నెల‌కొంది. రెండెక‌రాల్లో వైజాగ్ ఎఫ్.ఎన్.సీ.సీ ప్రారంభం కానుంది. మా అసోసియేష‌న్.. ఇత‌ర ప‌రిశ్ర‌మ అభివృద్ధికి కావాల్సిన అన్ని ర‌కాల ఆఫీస్ ల‌కు స్థ‌లాలు కేటాయించ‌డానికి ప్ర‌భుత్వం ఎంతమాత్రం వెనుక‌డుగు వేయ‌ద‌ని తెలుస్తోంది. టాలీవుడ్ విశాఖ‌లో ఏర్పాటు చేయాలంటే ఇప్పుడున్న చాలా స‌మ‌స్య‌లు వైదొలిగితేనే సాధ్య‌మ‌ని విశ్లేషిస్తున్నారు.