Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి బయట పెడతానని చెబుతున్న నేత ఎవరో?

By:  Tupaki Desk   |   17 April 2022 1:30 AM GMT
మాజీ మంత్రి బయట పెడతానని చెబుతున్న నేత ఎవరో?
X
కర్ణాటకలో రాజకీయాలు మారుతున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రం కర్ణాటక. దీంతో అక్కడ అలజడి సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యలో మంత్రి ఈశ్వరప్ప ప్రమేయం ఉందని సెల్ఫీ వీడియో తీసి... లేఖ రాసి ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఈశ్వరప్ప తనపై కావాలనే కుట్రలు చేసి పదవి పోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని వాపోయారు. సంతోష్ ఆత్మహత్య లేఖలో తన పేరును కావాలనే పొందుపరచినట్లు ఆరోపిస్తున్నారు. తనపై వచ్చిన నిందలు నిజం కావని నిరూపించుకునేందుకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులకు జడిసేది లేదని చెప్పారు. సంతోష్ లేఖ ఆధారంగా మంత్రి ఈశ్వరప్పపై కేసు నమోదు చేశారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈశ్వరప్పతోపాటు ఆయన సన్నిహితులపై కూడా కేసు పెట్టారు. అయితే ఇందులో కాంగ్రెస్ నేతల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న క్రమంలో భవిష్యత్ లో ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.

ఏ తప్పు చేయని వారికి భయమెందుకు తాను సచ్చీలుడిగా మళ్లీ మంత్రి పదవి చేపడతానని భరోసాగా ఉన్నారు. అనవసరంగా తన పేరును ఇరికించి చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు. ఇందులో ఎవరి హస్తం ఉందో త్వరలో బయటపడుతుందని చెబుతున్నారు. నిజాలు తెలిశాక పరిణామాలు ఎలా ఉంటాయో అందరికి తెలుస్తుందన్నారు

దీనిపై బెళగావి జిల్లా కు చెందిన మాజీ మంత్రి రమేశ్ జార్కి హోళి సంచలన ప్రకటన చేశారు. మంత్రి ఈశ్వరప్ప కేసులో కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్నారు. ఈ నెల 18న వాటిని బయటపెడతానని చెబుతున్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యలో ఓ బడా కాంగ్రెస్ నేత హస్తం ఉన్నట్లు బాంబు పేల్చారు. దీంతో అందరిలో ఆశ్చర్యం నెలకొంది.

ఆయన ఎవరిపై ఆరోపణలు చేస్తారు? ఎవరి పేరు బయటపెడతారోనని సందేహాలు అందరిలో వస్తున్నాయి. తగిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. 18న ఆయన వెల్లడించే వివరాలతో కూడిన సీడీలో ఎవరి భవితవ్యం మారనుందో తెలియడం లేదు. మొత్తానికి ఇందులో కాంగ్రెస్ నేతల హస్తం ఉన్నట్లు మాత్రం తెలిసిపోతోంది.