Begin typing your search above and press return to search.

ద‌గ్గుబాటి కుమారుడు పోటీ అక్క‌డి నుంచేనా?

By:  Tupaki Desk   |   20 Sep 2022 6:31 AM GMT
ద‌గ్గుబాటి కుమారుడు పోటీ అక్క‌డి నుంచేనా?
X
ద‌గ్గుబాటి వెంకటేశ్వ‌ర‌రావు.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ అల్లుడుగా ఉన్న ఆయ‌న ప‌లు ప‌ర్యాయాలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల త‌ర‌ఫున ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అంతేకాకుండా టీడీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుడిగానూ వ్య‌వ‌హ‌రించారు. తొలిసారిగా గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేసి ప్ర‌కాశం జిల్లా ప‌ర్చూరు నుంచి టీడీపీ అభ్య‌ర్థి ఏలూరి సాంబశివ‌రావు చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక అప్ప‌టి నుంచి వైఎస్సార్సీపీలోనూ ద‌గ్గుబాటి క్రియాశీల‌కంగా లేరు.

ఇటీవ‌ల టెన్నిస్ ఆడుతూ స్వ‌ల్ప గుండెపోటుకు గురికావ‌డంతో ఆస్ప‌త్రికి వెళ్లి ద‌గ్గుబాటి వెంకటేశ్వ‌ర‌రావును టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప‌రామ‌ర్శించి వ‌చ్చారు. చాలాసేపు అన్న‌ద‌మ్ములిద్ద‌రూ మ‌న‌సు విప్పి మాట్లాడుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. పాత సంబంధాలు చిగురించాయ‌ని.. ద‌గ్గుబాటి టీడీపీలో తిరిగి ప్ర‌వేశానికి మార్గం సుగ‌మ‌మైంద‌ని గాసిప్స్ వినిపించాయి.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం జిల్లా చీరాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ద‌గ్గుబాటి కుమారుడు హితేష్ చెంచురామ్ పోటీ చేస్తార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేర‌కు దగ్గుబాటి హితేష్ త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉంది.

మ‌రోవైపు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు స‌తీమ‌ణి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున రెండు ప‌ర్యాయాలు బాప‌ట్ల‌, విశాఖ‌ప‌ట్నంల నుంచి గెలిచారు. అంతేకాకుండా కేంద్ర స‌హాయ మంత్రిగానూ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 2014లో రాజంపేట పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్ర‌స్తుతం బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పురందేశ్వ‌రి సైతం టీడీపీ తీర్థం పుచ్చుకుంటార‌ని.. గుడివాడ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా కొడాలి నానిపై పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

కాగా గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం జిల్లా ప‌ర్చూరు వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ద‌గ్గుబాటి కుమారుడు హితేష్ చెంచురామ్ పోటీ చేయాల్సి ఉంది. అయితే పౌర‌స‌త్వ స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న‌కు బ‌దులుగా చివ‌రి నిమిషంలో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు పోటీ చేయాల్సి వచ్చింది.

ప్ర‌స్తుతం పౌర‌స‌త్య స‌మ‌స్య‌లు తొల‌గాయ‌ని.. ఈ నేప‌థ్యంలో హితేష్ టీడీపీ త‌ర‌ఫున చీరాల బ‌రిలో నిల‌బ‌డ‌టం ఖాయ‌మ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం చీరాల ఎమ్మెల్యేగా క‌ర‌ణం బ‌ల‌రాంకృష్ణ‌మూర్తి ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో క‌ర‌ణం టీడీపీ త‌ర‌ఫున గెలుపొంది ఆ త‌ర్వాత వైఎస్సార్సీపీతో అంట‌కాగుతున్నారు. అంతేకాకుండా త‌న కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను వైఎస్సార్సీపీలో చేర్చారు.

మ‌రోవైపు చీరాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఉన్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి కొణిజేటి రోశ‌య్య శిష్యుడిగా రంగ‌ప్ర‌వేశం చేసిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ 2009, 2014ల్లో చీరాల నుంచి విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చీరాల నుంచి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ఆమంచి లేదా క‌ర‌ణం పోటీ చేసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ త‌ర‌ఫున ద‌గ్గ‌బాటి హితేష్ అయితే గ‌ట్టిపోటీ ఇవ్వ‌గ‌ల‌ర‌ని భావిస్తున్నారు. అందులోనూ చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు పెద్ద ఎత్తున అనుచ‌ర‌గ‌ణం, బంధువులు ఉన్నార‌ని అంటున్నారు. అలాగే ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి గ‌తంలో ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హించిన బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలోకే చీరాల కూడా వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో హితేష్ ను దించ‌డం వ‌ల్ల సులువుగా విజ‌యం సాధిస్తామ‌నే ధీమాలో టీడీపీ ఉంది.

మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన, టీడీపీ మ‌ధ్య పొత్తు కుదిరితే చీరాల అసెంబ్లీ సీటును జ‌న‌సేన‌కు కేటాయిస్తార‌నే అంచ‌నాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ద‌గ్గుబాటి కుమారుడు హితేష్ ఇక్క‌డ పోటీ చేయ‌క‌పోవ‌చ్చు. ఆయ‌న‌ను మ‌రో నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దించే అవ‌కాశం కూడా ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.